Movie Review – MahaSamudram

Thursday,October 14,2021 - 01:37 by Z_CLU

నటీన‌టులు: శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్‌, అదితిరావు హైద‌రీ, అను ఇమ్మాన్యుయేల్, జ‌గ‌ప‌తిబాబు,రావు రమేష్ త‌దిత‌రులు

మ్యూజిక్‌:  చైత‌న్య భ‌ర‌ద్వాజ్‌

సినిమాటోగ్ర‌ఫీ:  రాజ్ తోట‌

నిర్మాణం : ఏకే ఎంట‌ర్‌టైన్మెంట్స్‌

నిర్మాత:  సుంక‌ర్ రామ‌బ్ర‌హ్మం

మాటలు : సయ్యద్

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  అజ‌య్ భూప‌తి

సెన్సార్: U/A

నిడివి : 155 నిమిషాలు

విడుదల తేది : 14-10-2021

'ఆర్ ఎక్స్ 100' తర్వాత గ్యాప్ తీసుకున్న దర్శకుడు అజయ్ భూపతి.. శర్వానంద్-సిద్ధార్థ్ తో మల్టీస్టారర్ తీస్తున్నారని ఎనౌన్స్ అయిన రోజు నుండే 'మహాసముద్రం' పై అంచనాలు నెలకొన్నాయి. తెలుగులో చాలా గ్యాప్ తర్వాత సిద్దార్థ్ రీ ఎంట్రీ ఇస్తుండటంతో సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయింది. మరి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన విజయం అందుకుందా? డైరెక్టర్ అజయ్ భూపతి రెండో సినిమాతో మరో విజయం అందుకున్నాడా? 'మహాసముద్రం' సిద్దు కి బెస్ట్ కం బ్యాక్ ఫిలిం అవుతుందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

mahasamudram movie stills sharwanand anu emmanual కథ :

అర్జున్ (శర్వానంద్) విజయ్ (సిద్దార్థ్) ఇద్దరూ బాల్యం నుంచే మంచి స్నేహితులు. ఒకరంటే ఒకటికి ప్రాణం. అర్జున్ ఏదైనా వ్యాపారం చేయాలనే ఉద్దేశ్యంతో ఉంటాడు. ఇక విజయ్ పోలీస్ ట్రైనింగ్ తీసుకొని SI పోస్ట్ కి ఎగ్జాం రాస్తాడు. ఉద్యోగం వచ్చాక తన ప్రేయసి మహా (అదితిరావు హైదరి) ని పెళ్లాడలనుకుంటాడు విజయ్. వైజాగ్ ని శాసిస్తున్న స్మగ్లర్ ధనుంజయ్(రామచంద్ర రాజు) అనుకోకుండా చావు వరకు వెళ్తాడు. ధనుంజయ్ చావుకు కారణం తనే అని భావించి విజయ్ వైజాగ్ వదిలి వెళ్ళిపోతాడు. ఆ క్రమంలో విజయ్ ప్రేయసి మహా ని అర్జున్ చేరదీసి తనతో పాటే చూసుకుంటాడు.

కొన్నేళ్ల తర్వాత మళ్ళీ విజయ్ వైజాగ్ వస్తాడు. అలా తిరిగొచ్చిన విజయ్.. వైజాగ్ లో స్మగ్లర్ గా ఎదిగిన అర్జున్ ని చూసి షాక్ అవుతాడు. అర్జున్, మహాల సంబంధంపై అనుమాన పడతాడు. అక్కడ్నుండి స్నేహితుల మధ్య వైరం ముదురుతుంది. ఆ తర్వాత ఏమైంది? అర్జున్ ఎందుకు స్మగ్లర్ గా మారాడు? అర్జున్, విజయ్ మళ్ళీ కలిశారా? విజయ్ ఉన్నపళంగా దుర్మార్గుడిలా మారడానికి కారణం ఏమిటి అనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు :

అర్జున్ పాత్రలో శర్వానంద్ బాగా నటించాడు. తన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో మెప్పించి పాత్రలో ఒదిగిపోయాడు. కొన్ని సన్నివేశాల్లో నటుడిగా మంచి మార్కులు అందుకున్నాడు. విజయ్ క్యారెక్టర్ కి సిద్దార్థ్ పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర దక్కడంతో దాన్ని చాలెంజింగ్ గా తీసుకొని నటించాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో సిద్ధు నటన అందరినీ ఆకట్టుకుంటుంది. అదితి రావు హైదరి తన నటనతో మహా పాత్రకు పూర్తి న్యాయం చేసింది. సినిమా చూస్తున్నంత సేపు ఆమె మహా పాత్రలోనే కనిపించింది. అను ఇమ్మానుయెల్ కథలో స్కోప్ లేని పాత్ర కావడంతో జస్ట్ పరవాలేదనిపించుకుంది.

చుంచు మావ పాత్రలో జగపతి బాబు, గూని బాబ్జీగా రావు రమేష్ మంచి నటన కనబరిచాడు. ముఖ్యంగా రావు రమేష్ డైలాగ్ డెలివరీ, నటన బాగా ఆకట్టుకున్నాయి.  అర్జున్ తల్లి పాత్రలో శరణ్య, ధనుంజయ్ విలన్ పాత్రలో రామచంద్ర మిగతా వాళ్ళందరూ తమ పాత్రలకు నాయ్యం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు :

చైతన్ భరద్వాజ్ కంపోజ్ చేసిన సాంగ్స్ ఆకట్టుకోలేకపోయాయి. ఉన్నంతలో "హే రంభ" పాట మాత్రమే పర్వాలేదనిపిస్తుంది. కానీ చైతన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. నేపథ్య సంగీతంలో చైతన్ ని మెచ్చుకోవాలి. సినిమాటోగ్రఫర్ రాజ్ తోట విజువల్స్ ఎట్రాక్ట్ చేశాయి. ప్రవీణ్ కె ఎల్ ఎడిటింగ్ సినిమాకు మైనస్.  అవినాష్ కొల్లా ఆర్ట్ వర్క్ సన్నివేశాలకు తగిన వాతావరణాన్ని క్రియేట్ చేశాయి. వెంకట్ మాస్టర్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉన్నాయి.

సయ్యద్ అందించిన మాటలు సన్నివేశాలకు బలం చేకూర్చాయి. దర్శకుడు అజయ్ భూపతి ఎంచుకున్న కథ దానికి రాసుకున్న కథనం రొటీన్ గానే అనిపించాయి. ముఖ్యంగా ఎగ్జిక్యూషన్ లో కొన్ని లోపాలు కనిపించాయి. ఏకే ఎంటర్టైన్ మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

Siddharth Sharwanand Maha Samudram movie October 14 release

జీ సినిమాలు సమీక్ష :

కొన్ని కథలు చాలా మంది హీరోల చుట్టూ తిరిగి ఫైనల్ గా ఓ హీరో చేతిలో పడుతాయి. 'మహాసముద్రం' కథ కూడా అలా కొందరి చుట్టూ తిరిగి చివరికి శర్వాకి చేరింది. 'ఆర్ ఎక్స్ 100' అనే బ్లాక్ బస్టర్ తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అజయ్ భూపతి ఈ కథ చెప్పగానే ఎగ్జైట్ అయి వెంటనే ఓకే చెప్పేశాడు శర్వా. నిజానికి కథలో శర్వా ని ఎగ్జైట్ చేసిన ఎలిమెంట్స్ ఏమిటో తెలియదు కానీ స్క్రీన్ పైకి వచ్చేసరికి కాస్త పేలవంగా మారింది.

తను రాసుకున్న ఈ కథను అమితంగా ప్రేమించడం వలన చాలా లోపాలున్నా పట్టించుకోకుండా సినిమాను నడిపించాడు దర్శకుడు. నాలుగు సీన్లతో విలన్ ని పవర్ ఫుల్ గా చూపించి కాసేపటికే ఆ పాత్రను చంపేయడం, ఆ చావుకి తనే కారణమన్న ఉద్దేశ్యంతో విజయ్ పారిపోవడం లాంటివి సిల్లీగా అనిపిస్తాయి. అలాగే శర్వా, అను ఇమ్మానుయెల్ లవ్ ట్రాక్ కూడా విసుగు తెప్పించేలా రాసుకున్నాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని ఫ్రెండ్ షిప్ సీన్స్, కొన్ని మాస్ ఎలిమెంట్స్ పర్వలేదనిపిస్తాయి. అలాగే రాజ్ తోట సినిమాటోగ్రఫీ , చైతన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్. అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా అజయ్ భూపతి బాగానే హ్యాండిల్ చేశాడు. రెండు విభిన్న ఆలోచనా విధానం ఉన్న ఇద్దరు మిత్రుల రెబల్స్ గా జీవించాలనుకుని చివరికి వారిద్దరి క్యారెక్టర్స్ రివర్స్ అవ్వడమనే లైన్ బాగుంది. కానీ దాన్ని ఆసక్తికరమైన కథగా మలవడంలో దానికి మంచి కథనం రాసుకోవడంలో విఫలం అయ్యాడు దర్శకుడు అజయ్ భూపతి.

ఆరంభంలో కాస్త ఆసక్తిగా నడిపించినప్పటికీ ఆ తర్వాత రొటీన్ సినిమాలను తలపించేలా తెరకెక్కించాడు అజయ్. అలాగే సిద్దార్థ్ పాత్ర కూడా డిజప్పాయింట్ చేసేలా ఉంది. కథ-కథనం వీక్ అనిపించడం, క్యారెక్టరైజేషన్ ప్రాపర్ గా డిజైనింగ్ చేసుకోకపోవడం, డ్రాగ్ అనిపించే సన్నివేశాలు, బలమైన సన్నివేశాలు లేకపోవడం, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ తెలిపోవడం సినిమాకు మెయిన్ మైనస్ గా చెప్పొచ్చు.

ఫైనల్ గా మహాసముద్రం మూవీ, భారీ అంచనాలు పెట్టుకున్న ప్రేక్షకులను నిరాశ పరుస్తుంది.

రేటింగ్ : 2.5 /5