Movie Review – Good Luck Sakhi

Friday,January 28,2022 - 05:28 by Z_CLU

తారాగ‌ణం: కీర్తిసురేష్‌, ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు, రాహుల్ రామకృష్ణ తదిత‌రులు ద‌ర్శ‌క‌త్వం: నగేష్ కుకునూర్ స‌మ‌ర్ప‌ణ‌: దిల్ రాజు (శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌) బ్యాన‌ర్‌: వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ నిర్మాత‌: సుధీర్ చంద్ర ప‌దిరి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ సినిమాటోగ్ర‌ఫి: చిరంతాన్ దాస్ రన్ టైమ్: 1 గంట 58 నిమిషాలు సెన్సార్: U రిలీజ్ డేట్: జనవరి 28, 2022

నేషనల్ అవార్డ్ అందుకున్న నటి ఓవైపు. జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మరోవైపు. ఇలాంటి ఇద్దరు వ్యక్తులు కలిసి చేసిన సినిమా గుడ్ లక్ సఖి. కీర్తిసురేష్-నగేష్ కుకునూర్ కాంబోలో ఈ రోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

Good-Luck-Sakhi-keerthy-suresh కథ

సఖి (కీర్తి సురేష్) ఓ సాధారణ పల్లెటూరి పిల్ల. దిగువ మధ్యతరగతి కుటుంబం ఆమెది. ఆమెను ఊరిలో అంతా బ్యాడ్ లక్ అని ఫీల్ అవుతుంటారు. కానీ గోలీ రాజు (ఆది పినిశెట్టి) ఒక్కడే సఖిపై నమ్మకం ఉంచుతాడు. మరీ ముఖ్యంగా గురి చూసి గోలీలు కొట్టడంలో సఖి టాలెంట్ ను రాజు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో కల్నల్ (జగపతిబాబు) ఆ ఊరికి వస్తాడు. మట్టిలో మాణిక్యాల్ని వెలికితీసి షూటర్స్ గా చేయాలనుకుంటాడు. ఆది పినిశెట్టి సహాయంతో కల్నల్ ను కలిసిన సఖి, ఎలా జాతీయ స్థాయిలో బెస్ట్ షూటర్ అయిందనేది స్టోరీ. మధ్యలో సఖి ప్రేమ వ్యవహారం ఏ మలుపు తీసుకుందనేది సబ్ స్టోరీ.

నటీనటుల పనితీరు

కథ ఏదైనా దాన్ని నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లడం కీర్తిసురేష్ కు బాగా తెలుసు. గుడ్ లక్ సఖి సినిమాను కూడా అలానే తన యాక్టింగ్ తో నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది కీర్తిసురేష్. ఆమె డ్రెస్సింగ్, లంబాడీ మేకప్, యాక్టింగ్.. అన్నీ పెర్ ఫెక్ట్ గా సింక్ అయ్యాయి. ఇక కల్నర్ గా, షూటింగ్ కోచ్ గా జగపతిబాబు నటన బాగుంది. స్టేజ్ ఆర్టిస్ట్ రాజుగా ఆది పినిశెట్టి మెప్పించాడు. కానీ డైలాగ్ డెలివరీలో మిస్టేక్స్ ఉన్నాయి. రాహుల్ రామకృష్ణతో పాటు మిగతా ఆర్టిస్టులు ఓకే.

టెక్నీషియన్స్ పనితీరు

టెక్నికల్ గా సినిమా రిచ్ గా ఉంది. దేవిశ్రీప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, నిర్మాతల ప్రొడక్షన్ వాల్యూస్, చిరంతాన్ దాస్ సినిమాటోగ్రఫీ అన్నీ బాగా కుదిరాయి. వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధీర్ చంద్ర పదిరి ఈ సినిమాకు ఏం కావాలో అన్నీ సమకూర్చి పెట్టారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఓకే.

Keerthy Suresh Good Luck Sakhi zeecinemalu

జీ సినిమాలు రివ్యూ

నిజంగా కీర్తిసురేష్ కు నేషనల్ అవార్డ్ వచ్చిందా? దర్శకుడు నగేష్ కుకునూర్ నిజంగానే జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడా? గుడ్ లక్ సఖి సినిమా చూస్తే కలిగే మొట్టమొదటి డౌట్ ఇది. ఈ వీక్ స్టోరీ, ఫ్లాట్ నెరేషన్ ను వీళ్లిద్దరూ ఎందుకు జాయింట్ గా సెలక్ట్ చేసుకున్నారనేది అంతుచిక్కని ప్రశ్న. పాతికేళ్ల కిందట రావాల్సిన ఈ కథ, ఈరోజు థియేటర్లలోకొచ్చి సహనానికి పరీక్ష పెడుతుంది.

స్పోర్ట్స్ జానర్ లో సినిమా చేసేటప్పుడు ఫోకస్ పెట్టాల్సిన మొట్టమొదటి ఎలిమెంట్ ఎమోషన్. అది కనెక్ట్ కాకపోతే సినిమాలో ఎన్ని హంగులు పెట్టినా అర్థం ఉండదు. అలాంటి ఎమోషన్ బిల్డప్ చేసే సరుకంతా 'సఖి'లో ఉంది. రాయలసీమ నేపథ్యం, పల్లెటూరి పిల్ల, అమాయకత్వం, జాతీయ స్థాయిలో షూటింగ్ లో విజేతగా నిలవడం లాంటి అంశాలు కచ్చితంగా గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఇవన్నీ కమర్షియల్ టచ్ ఉన్న ఎలిమెంట్స్. కానీ తన ఫ్లాట్ నెరేషన్ తో నగేష్ ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ ను వాడుకోలేకపోయాడు.

2 గంటల్లోపు నిడివి ఉన్న ఈ సినిమా స్టార్ట్ అవ్వడమే ఓ రకమైన మూడ్ తో స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు ఎక్కడో చూశాం అనే అనుభూతిని కలిగిస్తుంది. అలా సినిమా నడిచిన 40 నిమిషాలకే మేటర్ ఏంటనేది మనకు అర్థమైపోతుంది. స్పోర్ట్స్ జానర్ సినిమా కాబట్టి ట్విస్టులు ఆశించలేం. ఎమోషన్ పండితే చాలనుకుంటాం. కానీ ఇంటర్వెల్ కార్డు పడినంతవరకు ఆ ఛాయలు మనకు కనిపించవు.

అక్కడున్నది నగేష్ కుకునూర్, కీర్తిసురేష్ కాబట్టి ఇంటర్వెల్ తర్వాతైనా సినిమా ఊపందుకుంటుందని భావిస్తాం. ఎందుకంటే, కీలకమైన ఎపిసోడ్స్ అన్నీ సెకండాఫ్ లోనే ఉన్నాయి మరి. కానీ అక్కడ కూడా కుకునూర్ తన రైటింగ్ టాలెంట్ చూపించలేకపోయాడు. ఏదో ముగించాలన్నట్టు అతడి రైటింగ్ ఉంది. దర్శకత్వ ప్రతిభ కూడా పెద్దగా కనిపించదు. చివరికి జాతీయ అవార్డ్ అందుకున్న కీర్తిసురేష్ కూడా ఏదో అలా కానిచ్చేసింది. ఈ సినిమాకు ఇది చాల్లే అన్నట్టు నటించింది.

ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఈ సినిమాలో 'మహానటి'కి నటించే స్కోప్ ఇవ్వలేదు. కనీసం ఎపిసోడ్స్ వైజ్ చూసినా సినిమా ఎక్కడా ఎట్రాక్ట్ చేయదు. నాటకాల రాజుగా నటించిన ఆది పినిశెట్టి కూడా మమ అనిపించాడు. తెలిసిన ముఖం కాబట్టి తెరపై చూడగలిగాం తప్ప, క్యారెక్టర్ పరంగా అందులో ఎలాంటి మెరుపుల్లేవు. జగపతిబాబు, రాహుల్ రామకృష్ణతో పాటు మిగతా నటీనటులంతా ఓకే.

టెక్నికల్ చూసుకుంటే.. ప్రొడక్షన్ వాల్యూస్ కు ఫుల్ మార్కులివ్వాలి. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఖర్చు పెట్టారు. నిజంగా ఈ కథను నిర్మాతలు ఇంతలా ఎలా నమ్మారబ్బా అనిపిస్తుంది, ప్రొడక్షన్ వాల్యూస్ చూస్తే. పాటలతో మెప్పించలేకపోయిన దేవిశ్రీప్రసాద్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఓకే అనిపించుకున్నాడు. చిరంతాన్ దాస్ సినిమాటోగ్రఫీ బాగుంది.

ఓవరాల్ గా గుడ్ లక్ సఖి సినిమా థియేటర్లలో తను కోరుకున్న 'లక్'ను అందుకోలేకపోయింది.

రేటింగ్: 2/5