Movie Review – Cobra

Wednesday,August 31,2022 - 09:30 by Z_CLU

నటీనటులు: విక్రమ్, శ్రీనిధి శెట్టి, ఇర్ఫాన్ పఠాన్, మియా జార్జ్, రోషన్ మాథ్యూ, కేఎస్ రవికుమార్, మృణాళిని రవి తదితరులు రచన, దర్శకత్వం: ఆర్ అజయ్ జ్ఞానముత్తు నిర్మాత: ఎస్ఎస్ లలిత్ కుమార్ బ్యానర్: సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ విడుదల: ఎన్వీఆర్ సినిమా (ఎన్వీ ప్రసాద్) సంగీతం: ఏఆర్ రెహమాన్ డీవోపీ: హరీష్ కన్నన్ ఎడిటర్: భువన్ శ్రీనివాసన్ నిడివి : 183 నిమిషాలు సెన్సార్: U/A రిలీజ్ డేట్: ఆగస్ట్ 31, 2022

విక్రమ్ నుంచి ఏ సినిమా వచ్చినా అది విలక్షణంగా ఉంటుంది. అందులో ఎవ్వరికీ ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఈరోజు రిలీజైన కోబ్రా సినిమా కూడా అంతే విలక్షణంగా ఉంది. అయితే ఈ సినిమాతో విక్రమ్ హిట్ కొట్టాడా లేదా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

cobra movie review

కథ మధి (విక్రమ్) మ్యాథ్స్ లో టాపర్. ఎంతలా అంటే లెక్కలతోనే మర్డర్లు చేస్తుంటాడు. తన గాడ్ ఫాదర్ (కేఎస్ రవికుమార్), ఇతడు కలిసి సూడోకు ద్వారా కమ్యూనికేట్ అవుతుంటారు. కార్పొరేట్ కింగ్ రిషి (రోషన్ మాధ్యూ)కి ఎదురొచ్చిన వ్యక్తుల్ని మది హతమారుస్తుంటాడు. ఈ క్రమంలో రష్యా డిఫెన్స్ మినిస్టర్, స్కాట్లాండ్ యువరాజును కూడా చంపేస్తాడు. ఈ కేసును ఛేదించేందుకు పారిస్ నుంచి ఇంటర్ పోల్ ఆఫీసర్ అస్లాన్ (ఇర్ఫాన్ పఠాన్) వస్తాడు. అలా చెన్నై చేరుకున్న అస్లాన్, మదిని పట్టుకున్నాడా లేదా? అసలు మది ఎందుకు హత్యలు చేస్తున్నాడు? మదికి, రిషికి సంబంధం ఏంటి? మదిని పోలిన ఇంకో మనిషి ఎలా వచ్చాడు అనేది ఈ సినిమా స్టోరీ.

నటీనటుల పనితీరు రెండు డిఫరెంట్ షేడ్స్ లో విక్రమ్ అద్భుతంగా నటించాడు. మ్యాథ్స్ లెక్చరర్ గా, హ్యాకర్ గా విక్రమ్ నటన చాలా బాగుంది. దీనికితోడు అతడు వేసిన 9 డిఫరెంట్ గెటప్స్ ఆకట్టుకుంటాయి. విక్రమ్ తర్వాత చెప్పుకోదగ్గ పాత్ర ఇర్ఫాన్ పఠాన్ దే. ఇంటర్ పోల్ ఆఫీసర్ గా ఇర్ఫాన్ బాగా చేశాడు. మొదటి సినిమా అయినప్పటికీ చక్కగా నటించాడు. కాకపోతే ఈ కీలకమైన పాత్రకు యాక్టింగ్ బాగా తెలిసిన మరో నటుడ్ని తీసుకుంటే బాగుండేది. హీరోయిన్లు ముగ్గురూ తమ పాత్రలకు న్యాయం చేశారు. విలన్ గా నటించిన రోషన్, కేఎస్ రవికుమార్, మియా జార్జ్ చక్కగా చేశారు.

టెక్నీషియన్స్ పనితీరు టెక్నికల్ గా సినిమా చాలా రిచ్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ గ్రాండ్ గా ఉన్నాయి. హరీశ్ కణ్నన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఫస్టాఫ్ లో అతడి కెమెరా పనితనం కనిపిస్తుంది. ఇక ఏఆర్ రెహ్మాన్ పాటలతో ఆకట్టుకోలేకపోయాడు కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మెప్పించాడు. కొన్ని సన్నివేశాలకు రొటీన్ గా ఇచ్చే బీజీఎం కాకుండా, కాస్త కొత్తగా ట్రై చేశాడు. ఎడిటింగ్ ఓకే కానీ, రన్ టైమ్ ఇంకాస్త తగ్గిస్తే బాగుండేది. మరీ ముఖ్యంగా ఈ కథకు సాంగ్స్ సెట్ కావు. అవి తీసేసినా సరిపోయేది. ఆర్ట్ వర్క్ బాగుంది.

cobra teaser out

జీ సినిమాలు రివ్యూ విక్రమ్ గతంలో నటించిన ఐ-మనోహరుడు అనే సినిమాలో ఓ స్క్రీన్ ప్లే ఫాలో అయ్యారు. అందులో ఇద్దరు విక్రమ్ లు ఉన్నట్టు అనిపించేలా స్క్రీన్ ప్లే నడిపించారు. ఇంటర్వెల్ కు వచ్చేసరికి ఒక్కడే అని చెప్పారు. కోబ్రాలో కూడా ఇదే స్క్రీన్ ప్లే పాట్రన్ ఫాలో అయ్యారు. కాకపోతే రివర్స్. ఇక్కడ ఒక్కడ్నే చూపించారు. ఇంటర్వెల్ కు వచ్చేసరికి ఇద్దరు ఉన్నట్టు రివీల్ చేస్తారు. శాడ్ పార్ట్ ఏంటంటే.. అక్కడ ఆ స్క్రీన్ ప్లే ఫెయిలైనట్టే, ఇక్కడ ఈ స్క్రీన్ ప్లే కూడా ఫెయిలైంది.

కోబ్రా దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు, తన విజ్ఞాన ప్రదర్శన చూపించడానికి ప్రయత్నించాడు. స్క్రీన్ ప్లేతో మేజిక్ చేయాలనుకున్నాడు. కానీ అన్ని కథలకు, అందరూ దర్శకులకు ఈ ఆర్ట్ తెలీదు. జ్ఞానముత్తుకు కూడా తెలియదనే విషయం కోబ్రా సెకండాఫ్ చూస్తే అర్థమౌతుంది. ఎక్కడైతే తెలివితేటలు చూపించాలని దర్శకుడు ప్రయత్నించాడో, అక్కడే సినిమా ఫెయిలైంది.

నిజానికి ఈ సినిమాను ఫ్లాట్ నెరేషన్ లో కూడా చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే, అలానే చెప్పాలి కూడా. కానీ ఈ సింపుల్ రివెంజ్ డ్రామాకు భారీ లేయర్స్ తగిలించారు. కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే యాడ్ చేశారు. ఒకటికి నాలుగు ఎలిమెంట్స్ జోడించారు. ఫలితంగా కోబ్రా నిడివి అమాంతం పెరిగిపోయింది. సేమ్ టైమ్, సాధారణ ప్రేక్షకుడికీ దూరమైంది.

సినిమా గ్రాండ్ గా స్టార్ట్ అయింది. విక్రమ్ నుంచి ఆడియన్స్ ఆశించే గెటప్స్ అన్నీ ఫస్టాఫ్ లోనే బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తాయి. రకరకాల వేషాలు వేస్తూ, హై-ప్రొఫైల్ మర్డర్స్ చేస్తుంటాడు హీరో. ఇందులో భాగంగా వచ్చిన స్కాట్లాండ్ యువరాజు హత్య, రష్యా డిఫెన్స్ మినిస్టర్ మర్డర్ లాంటి ఎపిసోడ్స్ చాలా బాగా వచ్చాయి. ఓ హాలీవుడ్ సినిమాను చూసిన ఫీలింగ్ కలిగిస్తాయి. అలా భారీతనం చూపించిన దర్శకుడు, ఓ చక్కటి ట్విస్ట్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ వేస్తాడు.

ఫస్టాఫ్ దాదాపు గంటా 45 నిమిషాలుంది. అక్కడక్కడ బోర్ కొట్టినప్పటికీ, ఇంతకుముందే చెప్పుకున్నట్టు హాలీవుడ్ స్థాయిలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ వల్ల చూడాలనిపిస్తుంది. అయితే సెకండాఫ్ కు వచ్చేసరికి అసలు సమస్య మొదలైంది. ఇద్దరు విక్రమ్ లను చూపించే క్రమంలో దర్శకుడు గమ్మత్తుగా స్క్రీన్ ప్లే నడపాలనుకున్నాడు. దీంతో ఇద్దర్లో ఎవరు ఏ పాత్ర పోషిస్తున్నారనే కన్ఫ్యూజన్ ఆడియన్స్ లో క్రియేట్ అయింది. చివరికి క్లయిమాక్స్ లో కూడా అదే కన్ఫ్యూజన్ కనిపించడంతో రిజల్ట్ రివర్స్ అయింది.

ఇవన్నీ ఒకెత్తయితే, విలన్-హీరో మధ్య కాన్ ఫ్లిక్ట్ ను బలంగా చూపించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. ఎంతలా అంటే, సినిమాలో లోపలకు వెళ్లేకొద్దీ.. అసలు హీరో-విలన్ మధ్య ఎందుకు గొడవ వచ్చిందనే బేసిక్ ఎలిమెంట్ గుర్తుకురాదు. విలన్ ను హీరో కసితీరా చంపాలనే కోరిక ప్రేక్షకుడికి కలగదు. ఉన్నంతలో ఈ సినిమాను విక్రమ్ పెర్ఫార్మెన్స్ కోసం చూడొచ్చు. ఈ కథను దర్శకుడి తర్వాత బాగా అర్థం చేసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది విక్రమ్ మాత్రమే. బహుశా, ఈ కథను అర్థం చేసుకున్న మూడో వ్యక్తి ఉండకపోవచ్చు.

దాదాపు 9 గెటప్స్ లో విక్రమ్ అద్భుతంగా నటించాడు. మేనరిజమ్స్ చాలా చక్కగా ప్రజెంట్ చేశాడు. హీరోయిన్లు ముగ్గురు ఉన్నప్పటికీ ఆ 3 పాత్రల్లో చాలా లోపాలున్నాయి. శ్రీనిథి శెట్టి, ప్రియా భవానీ శంకర్, మృణాళిని పోషించిన పాత్రల్లో క్యారెక్టర్ ఆర్క్ కనిపించదు. కేఎస్ రవికుమార్, యంగ్ విక్రమ్ గా నటించిన ఖాలిద్, విలన్ గా నటించిన రోషన్ మాధ్యూ తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రిచ్ గా ఉన్నాయి. దర్శకుడిగా అజయ్ జ్ఞానముత్తు కొన్ని చోట్ల మెరుపులు మెరిపించినప్పటికీ, స్క్రీన్ ప్లే పరంగా ఫెయిల్ అయ్యాడు.

ఓవరాల్ గా కోబ్రా సినిమాను విక్రమ్ పెర్ఫార్మెన్స్ కోసం ఓసారి చూడొచ్చు. కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లేతో, 3 గంటల పాటు ఈ సినిమాను భరించడం కొంచెం కష్టమే.

రేటింగ్ - 2.5/5