Movie Review – Bhala Thandanana

Friday,May 06,2022 - 04:29 by Z_CLU

న‌టీనటులు : శ్రీవిష్ణు, కెథ‌రిన్ ట్రెసా, పోసాని కృష్ణ మురళి ,శ్రీనివాస్ రెడ్డి, సత్య , గరుడ రామ్ , శ్రీకాంత్ అయ్యంగార్, చైతన్య కృష్ణ , ఆదర్శ్ బాలకృష్ణ , రవి వర్మ తదితరులు

సినిమాటోగ్ర‌ఫీ : సురేశ్ ర‌గుతు

సంగీతం : మణిశర్మ

కథ -మాటలు : శ్రీకాంత్ విస్సా

నిర్మాత : రజినీ కొర్రపాటి

దర్శకత్వం : చైతన్య దంతులూరి

నిడివి : 134 నిమిషాలు

విడుదల తేది : 6 మే 2022

 

విభిన్న కథలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న హీరో శ్రీ విష్ణు 'భళా తందనాన' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. చైతన్య దంతులూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి బజ్ లేకుండా థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి కంటెంట్ తో సినిమా మెప్పించిందా ? శ్రీ విష్ణు సూపర్ హిట్ అందుకున్నాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

కథ :

అనాథ ఆశ్రమంలో అకౌంటెంట్ గా పనిచేసే చందు (శ్రీ విష్ణు) ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ శశి రేఖ(కేథరిన్) తో ప్రేమలో పడతాడు. హవాల వ్యాపారంతో డాన్ గా ఎదిగిన ఆనంద్ బాలీ (గరుడ రామ్) మీద ఫోకస్ పెట్టి శశిరేఖ అతని దగ్గర ఉన్న రెండు వేళ కోట్లు దొంగలించబడ్డాయని వెబ్ సైట్ లో న్యూస్ రాస్తుంది. ఈ క్రమంలో శశిరేఖతో క్లోజ్ గా ఉంటూ ఆమెతో ట్రావెల్ అవుతున్న చందుని ఉన్నపళంగా ఓ ముఠా కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్తారు. అసలు చందుని ఎత్తుకెళ్ళిన వాళ్ళెవరు ? వారికి చందుకి సంబంధం ఏమిటి ? ఇంతకీ డాన్ బాలీ దగ్గర రెండు వేళ కోట్లు కొట్టేసిందెవరు ? ఫైనల్ గా చందు ఈ కథకి ఎలాంటి ఎండ్ ఇచ్చాడు అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

శ్రీ విష్ణు ఎప్పటిలానే కేరెక్టర్ కి బెస్ట్ ఇచ్చాడు. కాకపోతే ఇటివలే ఈ తరహా పాత్రే 'రాజ రాజ చోర' లో చేయడంతో ఈ పాత్రతో పూర్తిగా ఆకట్టుకోలేకపోయాడు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా కేథరిన్ పర్ఫెక్ట్ అనిపించుకుంది. కథలో కీలకమైన పాత్ర దొరకడంతో తన నటనతో మెప్పించింది. కామిక్ పాత్రలో పోసాని కృష్ణ మురళి మంచి హాస్యం పండించాడు. తన హావభావాలతో నవ్వించాడు. శ్రీనివాస్ రెడ్డి , సత్య డైలాగ్ కామెడీ కొన్ని సందర్భాల్లో ఎంటర్టైన్ చేసింది. రవివర్మ , చైతన్య కృష్ణ , ఆదర్శ్ బాలకృష్ణ తమ పాత్రలకు న్యాయం చేశారు. శ్రీకాంత్ అయ్యంగార్ కి కేవలం రెండు సన్నివేశాలే దక్కడంతో పరవాలేదనిపించుకున్నాడు. మెయిన్ విలన్ గా గరుడ రామ్, మరో విలన్ గా అయ్యప్ప తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు :

మణిశర్మ మ్యూజిక్ అంటే బెస్ట్ సాంగ్స్ , అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎక్స్ పెక్ట్ చేస్తాం. కానీ ఈ సినిమాకు మణిశర్మ మేజికల్ మ్యూజిక్ పడలేదు. సాంగ్స్ తో పాటు నేపథ్య సంగీతం కూడా బాలేదు. ఉన్నంతలో టైటిల్ సాంగ్ ఒక్కటే పరవాలేదపిస్తుంది. సురేశ్ ర‌గుతు కెమెరా వర్క్ పరవాలేదు. కొన్ని షాట్స్ బాగా తీశాడు. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ బాగుంది. పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసేలా ఉన్నాయి.

శ్రీకాంత్ విస్సా అందించిన కథ రొటీన్ గానే ఉంది. కానీ అక్కడక్కడా వచ్చే కొన్ని మాటలు బాగున్నాయి. శ్రీకాంత్ విస్సా కథకి చైతన్య దంతులూరి రాసుకున్న కథనం కూడా ఆకట్టుకోలేదు. 'వారాహి చలన చిత్ర'  తక్కువ బడ్జెట్ పెట్టడంతో ప్రొడక్షన్ వేల్యూస్ 'లో' అనిపించాయి.

జీ సినిమాలు సమీక్ష :

శ్రీ విష్ణు నుండి ఓ సినిమా వస్తుందంటే అందులో ఎంతో కొంత కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు ఊహించుకొని థియేటర్స్ కి వస్తారు. కానీ ఈసారి ఓ రొటీన్  క్రైం థ్రిల్లర్ యాక్షన్ డ్రామాతో ఆడియన్స్ ముందుకొచ్చాడు కుర్ర హీరో. దీంతో సినిమా ఆకట్టుకోలేకపోయింది. శ్రీకాంత్ విస్సా అందించిన రొటీన్ కథకి దర్శకుడు చైతన్య రాసుకున్న వీక్ స్క్రీన్ ప్లే కూడా మైనస్ అని చెప్పొచ్చు. ఇక ఈ తరహా పాత్ర ఆల్రెడీ చేసేయడంతో శ్రీ విష్ణు కూడా పెద్దగా కష్టపడలేదు. కాకపోతే కాస్త నెగటివ్ టచ్ ఉన్న కేరెక్టర్ కావడంతో ఎగ్జైట్ అయి ఈ స్క్రిప్ట్ ఒకే చేసి ఉండొచ్చు.

ఒక అనాధ ఆశ్రమంలో పనిచేసే కుర్రాడు తనకి తెలిసిన ఓ లింక్ ద్వారా రెండు వేళ కోట్లను సిల్లీగా కొట్టేసి విలన్ తో  గేమ్ ప్లే చేయడమనేదే కామెడీగా ఉంది. నిజానికి ఈ జోనర్ లో సినిమా అంటే చాలా సీరియస్ గా ఉండాలి. అప్పుడప్పుడు థ్రిల్ చేస్తూ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనే ఆసక్తి కలిగించాలి. కానీ ఇందులో అలాంటిదేం లేకుండానే జరగలేదు. సినిమా ప్రారంభంలో ఓ పది హేను నిమిషాలు ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. ఇక  ఇంటర్వెల్ లో ఓ ట్విస్ట్ పెట్టినప్పటికీ తర్వాత కన్ఫ్యూజ్ డ్రామాతో రొటీన్ గా సినిమాను ముందుకు నడిపించాడు దర్శకుడు. సెకండాఫ్ కొచ్చేసరికి  కొన్ని ట్విస్టులు ప్లాన్ చేసుకున్నాడు అవి వర్కౌట్ అవ్వలేదు.

చాలా చోట్ల లాజిక్స్ వదిలేసి ఏదో మేజిక్ చేయాలని గట్టిగా ట్రై చేశాడు దర్శకుడు. కానీ ఆ మేజిక్ స్క్రీన్ ప్లే లో కనిపించలేదు. పైగా హీరో చెప్పే  ఫ్లాష్ బ్యాక్ , అందులో వచ్చే ఓ సాంగ్ మొదటి భాగంలో పంటి కింద రాయిల తగులుతాయి. ఆ సాంగ్ మణిశర్మ నే కంపోజ్ చేశాడా అనే సందేహం కలగక మానదు. అలాగే సినిమాలో ఓ స్విచువేషణ్ లో వచ్చే ఐటెం సాంగ్ ని పోసానితో పాడించి ఆ పాటను ఖూనీ చేశారు. ఇంటర్వెల్ లో ఓ యాక్షన్ ఎపిసోడ్ తో ట్విస్ట్ ఇచ్చి గేమ్ స్టార్స్ నౌ అంటూ సెకండాఫ్ మీద అంతో ఇంతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన చైతన్య  ఆ తర్వాత సెకండాఫ్ లో చాలా చోట్ల తడబడుతూ ఫైనల్ గా  మెస్మరైజ్ చేయలేకపోయాడు. ఇక క్లైమాక్స్ కూడా వీక్ గా ఉండటంతో సినిమా  మెప్పించలేకపోయింది. నిజానికి ఈ కథకి KGF విలన్ అవసరం లేదనిపిస్తుంది. విలన్ ని మరీ పవర్ ఫుల్ చూపించే ప్రయత్నంలో విలన్ ముందు హీరో తేలిపోయాడు. చాలా చోట్ల ప్రొడక్షన్ వేల్యూస్ షార్ట్ ఫిలిం మేకింగ్ ని తలపిస్తాయి. ఏదేమైనా క్రైం థ్రిల్లర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన 'భళా తందనాన' ఆకట్టుకోలేకపోయింది.

రేటింగ్ : 2 /5