Movie Review – Bazaar Rowdy

Friday,August 20,2021 - 04:08 by Z_CLU

నటీనటులు: సంపూర్ణేష్ బాబు, మహేశ్వరి, సయాజీ షిండే, పృథ్వి, షఫీ, కత్తి మహేష్ తదితరులు.. దర్శకుడు: వసంత నాగేశ్వరరావు నిర్మాత: సంధిరెడ్డి శ్రీనివాసరావు బ్యానర్: కె ఎస్ క్రియేషన్స్ మాటలు: మరుధూరి రాజా సంగీతం: ఎస్ఎస్ ఫ్యాక్టరీ ఎడిటింగ్: గౌతం రాజు సినిమాటోగ్రఫీ: ఏ విజయ్ కుమార్ రన్ టైమ్: 2 గంటల 7 నిమిషాలు సెన్సార్: U/A రిలీజ్ డేట్: ఆగస్ట్ 20

థియేటర్లలో వరుసగా చిన్న సినిమాలు క్యూ కడుతున్న వేళ.. సంపూర్ణేష్ బాబు కూడా తన సినిమాను రిలీజ్ చేశాడు. ఈరోజు బజార్ రౌడీగా మనముందుకొచ్చిన సంపూ, ప్రేక్షకుల్ని మెప్పించాడా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

bazaar rowdy movie review in telugu

కథ కాళి (సంపూర్ణేష్ బాబు) చిన్నప్పట్నుంచి కష్టాలు పడుతూ వస్తుంటాయి. ఇబ్బందులు పడిన ప్రతిసారి కాళి తండ్రి (నాగినీడు) ఇంటికొచ్చి కొడుకును కొడుతుంటాడు. ఈ క్రమంలో తండ్రి అంటే విపరీతంగా భయపడతాడు చిన్నారి కాళి. ఓసారి స్కూల్ తో తన ఫ్రెండ్ కు తగిలిన గాయం చూసి చాలా భయపడతాడు. ఏదో ఒక రోజు తనను కూడా తండ్రి చంపేస్తాడని భయపడి ఇంటి నుంచి పారిపోతాడు. అలా పారిపోయిన కాళి.. ఓ చిన్న పట్టణంలో బజార్ రౌడీ అవుతాడు.

కట్ చేస్తే.. మరోవైపు కాళి అంకుల్స్ (సయాజీ షిండే, పృధ్వి, కత్తి మహేష్) అతడి ఆస్తిని కొట్టేయాలని చూస్తారు. తమకు తెలియకుండానే కాళిని కలుస్తారు. నకిలీ కొడుకుగా కాళిని ఇంట్లో ప్రవేశపెట్టి ఆస్తిని కొట్టేయాలని చూస్తారు. అయితే కాళీనే అసలు కొడుకు అనే విషయం వీళ్లకు తెలియదు. డూప్లికేట్ కొడుకుగా తన సొంత ఇంట్లోకి ఎంటరైన కాళి.. కథను ఎలా రక్తికట్టించాడనేది స్టోరీ.

నటీనటుల పనితీరు కాళిగా సంపూర్ణేష్ బాబు బాగా నటించాడు. తనకు చేతనైనంత యాక్టింగ్ చేశాడు. కామెడీ తప్ప అన్నీ చేశాడు. హీరోయిన్ గురించి చెప్పుకోడానికేం లేదు. అంకుల్స్ గా నటించిన సయాజీ షిండే, పృధ్వి, కత్తి మహేష్ తమ పాత్రలకు న్యాయం చేశారు. నాగినీడుతో పాటు మిగతావాళ్లంతా ఇలా వచ్చి అలా వెళ్లారు.

టెక్నీషియన్స్ పనితీరు టెక్నికల్ గా ఈ సినిమాలో చెప్పుకోడానికేం లేదు. ఎస్ఎస్ ఫ్యాక్టరీ సంగీతం చాలా సాదాసీదాగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దారుణం. విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ పేలవం. సీనియర్లయిన మరుధూరి రాజా మాటలు, గౌతం రాజు ఎడిటింగ్ ఈ సినిమాకు బొత్తిగా కలిసిరాలేదు. ఇక దర్శకుడు వసంత నాగేశ్వరరావు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ హైటెక్ యుగంలో, కొత్త కొత్త కథలతో దూసుకుపోతున్న టాలీవుడ్ కు మరోసారి 80ల నాటి కథ-కథనాన్ని పరిచయం చేశాడు ఈ దర్శకుడు. సినిమా మొత్తమ్మీద ఇతడి దర్శకత్వం గురించి చెప్పుకోడానికి ఒక్క పాయింట్ కూడా లేదు.

bazaar rowdy movie review in telugu

జీ సినిమాలు సమీక్ష చిరంజీవి సినిమా నుంచి మంచి ఫైట్స్, పాటలు, డాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తాం. అలాగే మహేష్, ప్రభాస్ సినిమాల నుంచి కూడా ఆడియన్స్ ఏం ఆశిస్తారో అందరికీ తెలిసిందే. అదే విధంగా సంపూర్ణేష్ బాబు సినిమా నుంచి కామెడీ ఆశించడం కూడా అంతే సహజం. ఈ చిన్న లాజిక్ ను బజార్ రౌడీ యూనిట్ మిస్ అయింది. సంపూ సినిమాలో కామెడీ తప్ప అన్నీ చూపించారు. అదే ఈ సినిమాకు పెద్ద మైనస్ అయింది

మహేష్ బాబు ఎలివేషన్స్, చిరంజీవి స్టయిల్ స్టెప్స్, ప్రభాస్ మార్క్ ఫైట్స్.. ఇవన్నీ సంపూ చేస్తే ఎలా ఉంటుంది? ఏదో స్పూఫ్ లో భాగంగా చేస్తే కామెడీగా ఉంటుంది. కానీ సీరియస్ గా చేస్తే మాత్రం అట్టర్ ఫ్లాప్ అవుతుంది. బజార్ రౌడీ రిజల్ట్ ఇదే. కామెడీ పండిస్తాడని ఆశగా ఎదురుచూసిన ప్రేక్షకులకు సీరియస్ ఎమోషన్ చూపించాడు సంపూ.

సినిమా స్టార్ట్ అవ్వడమే సీరియస్ గా స్టార్ట్ అవుతుంది. హీరో ఇంటి నుంచి పారిపోతాడు. తల్లిదండ్రుల ఆలనాపాలనా లేకపోవడంతో బజార్ రౌడీగా మారుతాడు. అనుకోని పరిస్థితుల్లో మళ్లీ తన సొంత ఇంటిలోకే డూప్లికేట్ కొడుకులా ఎంటర్ అవుతాడు. ఇంట్లో సమస్యల్ని తీరుస్తాడు, తండ్రికి దగ్గరవుతాడు. గబ్బర్ సింగ్, రౌడీ అల్లుడు, అల్లరి అల్లుడు లాంటి సినిమాలు అడుగడుగునా గుర్తొస్తాయి. ఇంకా చెప్పాలంటే ప్రతి సీన్ లో ఓ హిట్ సినిమా కనిపిస్తుంది. కానీ ఈ సినిమా మాత్రం హిట్ అవ్వలేకపోయింది.

కథ, కథనం నీరసంగా సాగుతాయి. ఈ కథ, స్క్రీన్ ప్లేతో మనల్ని అమాంతం 80ల్లోకి తీసుకుపోయాడు సంపూ. అయితే అది అతడి తప్పు కాదు. దర్శకుడు సంపూతో చేయించిన విన్యాసాలు ఇవన్నీ. ఓ నటుడిగా సంపూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. కానీ కామెడీ పండించకుండా కథతో అతడి చేతులుకాళ్లు కట్టిపడేశారు. సెకండాఫ్ లో అక్కడక్కడ 2-3 కామెడీ సీన్లు కనిపిస్తాయి. వాటితోనే సరిపెట్టుకోవాలి.

అలా కామెడీకి కిలోమీటర్ దూరంలో సాగుతుంది ఈ బజార్ రౌడీ స్టోరీ. ఇక టెక్నికల్ గా ఈ సినిమా గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఇంతకుముందే చెప్పుకున్నట్టు 80ల నాటి టెక్నిక్స్ అన్నీ ఇందులో చూపించారు.

ఓవరాల్ గా బజార్ రౌడీ సినిమా అటు కామెడీకి దూరంగా, ఇటు ఎమోషన్ పండించక, ఓ పాత చింతకాయపచ్చడి ఫార్ములా స్టోరీతో విసుగెత్తిస్తుంది.

బాటమ్ లైన్: బజారున పడిన రౌడీ రేటింగ్: 1.5/5