Movie Review – Athithi Devobhava

Friday,January 07,2022 - 02:03 by Z_CLU

నటీ నటులు : ఆది సాయి కుమార్ , నువేక్ష , రోహిణీ , సప్తగిరి, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు

కెమెరా : అమరనాథ్ బొమ్మిరెడ్డి

మ్యూజిక్ : శేఖర్ చంద్ర

ఎడిటింగ్ : కార్తీక్ శ్రీనివాస్

నిర్మాణం : శ్రీనివాస సినీ క్రియేషన్స్

నిర్మాతలు : రాజబాబు మిర్యాల , అశోక్ రెడ్డి మిర్యాల

దర్శకత్వం : పొలిమేర నాగేశ్వరరావు

విడుదల : 7 జనవరి 2022

ఆది సాయి కుమార్ , నువేక్ష జంటగా తెరకెక్కిన 'అతిథి దేవోభవ'  సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. పాటలతో పాటు టీజర్ , ట్రైలర్ కూడా సినిమాపై బజ్ క్రియేట్ చేసింది. పైగా RRR పోస్ట్ పోన్ అయిన వెంటనే అదే డేట్ ఫిక్స్ చేసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో సినిమా  హాట్ టాపిక్ అయింది. మరి ఆది సాయి కుమార్ ఈ సినిమాతో మెప్పించి హిట్ అందుకున్నాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

 

కథ :

పుట్టుకతోనే మోనోఫోబియా అనే డిజార్డర్ తో బాధపడే అభయ్(ఆది) ఒంటరిగా ఉన్నప్పుడు నరకం అనుభవిస్తుంటాడు. ఎప్పుడూ తనతో ఒక తోడు ఉండాలని భావిస్తూ అమ్మ(రోహిణి)తోనే ఉంటాడు. ఈ క్రమంలో అభయ్ కి ఉన్న ప్రాబ్లం తెలుసుకొని తను ప్రేమించిన ఒకమ్మాయి బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో వైష్ణవి(నువేక్ష) ని తొలి చూపులోనే చూసి ప్రేమలో పడతాడు అభయ్.

వైష్ణవి కూడా అభయ్ కి దగ్గరై అతని ప్రేమలో పడుతుంది. కానీ కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా అభయ్ ని అపార్థం చేసుకొని అతని నుండి విడిపోవాలనుకుంటుంది. ఆ సమయంలో ప్రేమించిన వైష్ణవిని అభయ్ ఎలా కన్విన్స్ చేశాడు? ఫైనల్ గా తన ప్రేమని ఎలా దక్కించుకున్నాడు? అనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు :

అభయ్ పాత్రలో హీరో ఆది సాయికుమార్ బాగానే నటించాడు. కాకపోతే క్యారెక్టరైజేషన్ సరిగ్గా కుదరకపోవడంతో పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. హీరోయిన్ నువేక్ష నటనతో ఆకట్టుకుంది. సప్తగిరి డైలాగ్ కామెడీ వర్కౌట్ అవ్వలేదు. తల్లి పాత్రలో రోహిణి ఎప్పటిలానే క్యారెక్టర్ కి బెస్ట్ ఇచ్చారు. ఆదర్శ్ బాలకృష్ణ, రవిప్రకాష్, అప్పారావు, గుండు సుదర్శన్ తదితరులు పరవాలేదనిపించుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు : 

సినిమాకు శేఖర్ చంద్ర మ్యూజిక్ ప్లస్ అయ్యింది. సాంగ్స్ తో పాటు అక్కడక్కడ వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా సిద్ శ్రీరామ్ పాడిన "బాగుంటుందే" సాంగ్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. "నిన్ను చూడగానే" పాట కూడా వినసొంపుగా ఉంది. భాస్కరభట్ల అందించిన లిరిక్స్ పాటలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాయి.  అమరనాథ్ బొమ్మిరెడ్డి కెమెరా వర్క్ బాగుంది. కొన్ని సన్నివేశాల్లో అతని పనితనం కనిపించింది. సాంగ్స్ పిక్చరైజేషన్ బాగుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ పరవాలేదు. కొన్ని డ్రాగ్ అనిపించే సన్నివేశాలు ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది.

వేణుగోపాల్ అందించిన కాన్సెప్ట్ బాగుంది. కానీ కథనం, సన్నివేశాలు ఆకట్టుకోలేదు. దర్శకుడికి మొదటి సినిమా కావడంతో ఈ కాన్సెప్ట్ ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కథకి తగ్గట్టుగా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష : 

కొన్ని కాన్సెప్ట్స్ వినడానికి బాగుంటాయి. విన్న వెంటనే ఎగ్జైట్ చేస్తాయి. కానీ సినిమాగా వచ్చేసరికి తేడా కొడతాయి. సరిగ్గా ఈ సినిమా కోసం ఎంచుకున్న కాన్సెప్ట్ అలాంటిదే. చిన్నతనం నుండే మోనో ఫోబియా అనే డిజార్డర్ తో బాధపడే ఓ కుర్రాడు, ఆ విషయాన్ని బయటపెట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఆ విషయం ఒక్క తల్లికి మాత్రమే తెలుసు. మిగతా వారితో పంచుకోవడానికి ఇష్టపడడు. ఇక్కడి వరకూ బాగానే ఉంది. కానీ ఈ ఐడియాని కథగా మార్చడానికి, దానికి కథనం రాయడానికి చాలా కసరత్తు చేయాల్సి వస్తుంది. ఏదో సాదాసీదాగా ఇలాంటి కాన్సెప్ట్ ని చెప్తే ఆడియన్స్ ని మెప్పించలేం. 'అతిథి దేవోభవ' విషయంలో అదే జరిగింది. వేణుగోపాల్ అందించిన కాన్సెప్ట్ బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే మైనస్. బలమైన సన్నివేశాలు లేకపోవడం, కామెడీ పండకపోవడం, స్లో నెరేషన్  సినిమాకు ప్రధాన బలహీనతలు.

ఇలాంటి కాన్సెప్ట్ ని హిలేరియస్ గా చెప్తూ క్లైమాక్స్ లో ఎమోషనల్ టచ్ ఇవ్వాలి. కానీ ఈ సినిమాలో అలా జరగలేదు. దర్శకుడు కామెడీ వర్కౌట్ చేయడంలో విఫలం అయ్యాడు. చాలా వరకూ సప్తగిరితో, మరికొన్ని కామెడీ క్యారెక్టర్స్ తో నవ్వించే ప్రయత్నం చేసినా అందులో పస లేకపోవడంతో ఆ సన్నివేశాలు పేలలేదు. సినిమా ఆరంభంలో హీరో కల గనే సీన్ తర్వాత ఒంటరిగా ఉంటూ భయపడే సీన్ నుండే సినిమాకి డిస్-కనెక్ట్ అయిపోతారు ఆడియన్స్. ఇక మొదటి భాగంలో వచ్చే సన్నివేశాలు చాలా వరకూ డ్రాగ్ అనిపిస్తాయి. వాటిని ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. సెకండాఫ్ లో "బాగుంటుంది" పాట తప్ప మిగతా సన్నివేశాలు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. మరో హీరోయిన్ ని ఇంట్లో ఉంచి ఆమెని బయటికి వెళ్ళకుండా చేసే సీన్ మాత్రమే అంతో ఇంతో పరవాలేదనిపిస్తుంది. హీరో క్యారెక్టరైజేషన్ లో కూడా లోపాలున్నాయి.

పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ దానికి ముందు వచ్చే సనివేశాలు అర్థం పర్థం లేకుండా ఉన్నట్టు అనిపిస్తాయి. ఇక లవ్ ట్రాక్ కూడా రొటీన్ గానే ఉంది. కామెడీ విలన్ గా రోలర్ రఘు ని పెట్టి పాత సినిమాల్లో సన్నివేశాలనే మళ్ళీ రిపీట్ చేశాడు దర్శకుడు. ఫైనల్ గా మోనో ఫోబియాతో ఒంటరిగా ఉండలేక ఇంటికి వచ్చిన అతిథిని బయటికి వెళ్ళకుండా చేసే కుర్రాడి కథ అంటూ 'అతిథి దేవోభవ' టైటిల్ కి జస్టిఫికేషన్ ఇచ్చారు.

నిజానికి ఇలాంటి డిజార్డర్ కాన్సెప్ట్ ఎంచున్నప్పుడు స్క్రిప్టింగ్ లో ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది. 'భలే భలే మగాడివోయ్' సినిమాతో మారుతి సక్సెస్ అయ్యింది అక్కడే. రైటింగ్ లో ఎంత మేజిక్ జరిగితే సినిమాలో అంత ఫన్ వర్కౌట్ అవుతుంది. ఓవరాల్ గా కాన్సెప్ట్, మ్యూజిక్, కెమెరా వర్క్ బాగున్నాయి. అవి మినహాయిస్తే మిగతావి అన్నీ సినిమాకు మైనస్ అనిపిస్తాయి.

రేటింగ్ : 2/5