Movie Review – 777 Charlie

Friday,June 10,2022 - 04:53 by Z_CLU

న‌టీన‌టులు: ర‌క్షిత్ శెట్టి, సంగీత శ్రింగేరి, రాజ్ బి.షెట్టి, డానిష్ సెయిట్‌, బాబీ సింహ, శర్వారి త‌దిత‌రులు

సంగీతం: నోబిన్ పాల్‌

సినిమాటోగ్ర‌ఫీ: అర‌వింద్ ఎస్‌.క‌శ్య‌ప్‌

డైలాగ్స్‌: కె.ఎన్‌.విజ‌య్ కుమార్ (తెలుగు)

సమర్పణ : రానా దగ్గుబాటి

రిలీజ్ : సురేష్ ప్రొడక్షన్స్

నిర్మాణం : ప‌ర‌మ్ వ‌హ్ స్టూడియోస్‌

నిర్మాత‌లు: జి.ఎస్‌.గుప్తా, ర‌క్షిత్ శెట్టి

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: కిర‌ణ్ రాజ్‌.కె

నిడివి : 165 నిమిషాలు

విడుదల తేది : 10 జూన్ 2022

 

కన్నడ స్టార్ రక్షిత్ శెట్టి హీరోగా యానిమల్ సెంటిమెంట్ డ్రామాతో తెరకెక్కిన '777 చార్లి' ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగులో రానా దగ్గుబాటి ప్రెసెంట్స్ చేస్తుండటం , ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండటంతో '777 చార్లి' పై మంచి బజ్ క్రియేట్ అయింది. మరి ఆ అంచనాలను సినిమా అందుకుందా ? తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.

   

కథ :

చిన్నతనంలోనే కుటుంబాన్ని కోల్పోయి అనాధగా మారిన ధర్మ(రక్షిత్ శెట్టి) ఓ కాలనీలో ఒంటరిగా ఉంటాడు. ఎవరితోనూ మాట్లాడకుండా ఇల్లు , ఉద్యోగం రెండే జీవితం అనుకుంటూ గడుపుతుంటాడు. ఈ క్రమంలో అనుకోకుండా ఓ కుక్క పిల్ల ధర్మ జీవితంలోకి వస్తుంది. ఆ కుక్క ధర్మ మనసులో చోటు సంపాదించుకుంటుంది.

అక్కడి నుండి ధర్మ జీవితంలో కొత్త మార్పు వస్తుంది. ఆ కుక్కకి చార్లి అనే పేరు పెట్టుకొని అదే తన జీవితం అనుకొని గడిపేస్తుంటాడు. కానీ చార్లి ఎక్కువ రోజులు బ్రతకదని తెలుసుకుంటాడు. చార్లి మరణించే లోపు తనకిష్టమైన కాశ్మీర్ మంచు కొండలు చూపించాలని బయలుదేరతాడు. అసలు చార్లి కి ఉన్న జబ్బు ఏంటి ? చివరికి చార్లిని ధర్మ కాశ్మీర్ తీసుకెళ్ళి మంచు కొండలు చూపించాడా ? లేదా అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

ధర్మ పాత్రలో రక్షిత్ శెట్టి ఆకట్టుకున్నాడు. ఒక అనాధ కుర్రాడిలా తన నటనతో మెప్పించాడు. హీరోయిన్ సంగీత శ్రింగేరి తన పాత్రకు పర్ఫెక్ట్ అనిపించుకుంది. చార్లిగా కుక్క నటన బాగుంది. కుక్కకు ట్రైనింగ్ ఇచ్చిన ప్రమోద్ ని మెచ్చుకోవాల్సిందే. డాక్టర్ పాత్రలో రాజ్ బి.షెట్టి కామెడీ పండించాడు. ప్రత్యేక పాత్రలో బాబీ సిన్హా అలరించాడు. బాబీ శర్వారి నటన బాగుంది.డానిష్ సెయిట్‌ మిగతా నటీ నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

   

సాంకేతిక వర్గం పనితీరు :

నోబిన్ పాల్‌ అందించిన సంగీతం బాగుంది. అక్కడక్కడా వచ్చే నేపథ్య సంగీతం సన్నివేశాలను ఎలివేట్ చేసింది. పూర్ణ చారి, బట్టు విజయ్ కుమార్ , నాగార్జున , అనిరుద్ పాటలకు మంచి సాహిత్యం అందించారు. అర‌వింద్ ఎస్‌.క‌శ్య‌ప్‌ తన కెమెరా వర్క్ తో మంచి విజువల్స్ అందించాడు. ప్రతీక్ శెట్టి ఎడిటింగ్ ఫరవాలేదు. కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ డ్రాగ్ అనిపించింది. కె.ఎన్‌.విజ‌య్ కుమార్ డైలాగ్స్ బాగున్నాయి. కిర‌ణ్ రాజ్‌.కె డైరక్షన్ బాగుంది కానీ అక్కడక్కడా తడబడ్డాడు. సన్నివేశాలను ఇంకా బలంగా రాసుకోవాల్సింది. ప్రొడక్షన్ వేల్యూస్ కథకి తగ్గట్టుగా ఉన్నాయి.

 

జీ సినిమాలు సమీక్ష :

రిలీజ్ కి ముందే కొన్ని ట్రైలర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా ? అనే ఇంట్రెస్ట్ కలిగిస్తాయి. తాజాగా '777 చార్లి' ట్రైలర్ కూడా ఇదే కోవలో ఆకట్టుకుంది. ట్రైలర్ తో సినిమాపై బజ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయిన దర్శకుడు కిర‌ణ్ రాజ్‌ థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రేక్షకులను కంటెంట్ తో ఓ మోస్తారుగా మాత్రమే మెప్పించాడు. ఈ తరహా కథల మీద ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంది. ముఖ్యంగా సెంటిమెంట్ సీన్స్ బాగా రాసుకోవాలి. బలమైన సన్నివేశాలు పెట్టుకోవాలి. క్లైమాక్స్ లో ప్రేక్షకులను కంటతడి పెట్టించి ఇంటికి పంపాలి. కానీ దర్శకుడు కొంత వరకే ఇవన్నీ చేయగలిగాడు.

యానిమల్ సెంటిమెంట్ డ్రామాతో ఇది వరకే చాలా సినిమాలు వచ్చాయి. ఆ మధ్య తెలుగులో రాజేంద్ర ప్రసాద్ కూడా 'టామీ' అనే డాగ్ సినిమా చేశారు. అందులో ఎమోషన్ బాగా పండింది కూడా..అయినా సినిమా సక్సెస్ అవ్వలేదు. ఇక 777 చార్లి కూడా అదే తరహాలో ఉందే తప్ప ఇందులో కొత్తదనం కనిపించలేదు. కుక్క ఎంట్రీ ఇచ్చిన కాసేపటికే సినిమా క్లైమాక్స్ ఊహించేయొచ్చు. సహజంగా మనుషులకు పెట్టే వ్యాధిని ఇందులో కుక్కకి పెట్టారు అంతే.

అలాగని సినిమాలో ఎమోషన్ లేదా ? అంటే కచ్చితంగా ఉంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ మనసుని హత్తుకుంటాయి. ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. అలాగే డాగ్ కనిపించే సన్నివేశాలన్నీ అలరిస్తాయి. పాటలు కూడా ఆకట్టుకున్నాయి. కాకపోతే కొన్ని మైనస్ ల వల్ల సినిమా పూర్తి స్థాయిలో మెప్పించలేక యావరేజ్ అనిపిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ని మరీ సాగ దీసిన విధానం కాస్త బోర్ కొట్టిస్తుంది. ఇక కాశ్మీర్ ప్రయాణం తాలూకు సీన్స్ మధ్యలో బాబీ సింహా ట్రాక్ బోర్ కొట్టించింది. అలాగే చార్లి చనిపోయే ముందు ఒక కుక్క పిల్లను కని హీరోకి ఇవ్వడంతో అక్కడ సింపతీ రాక సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు.

రక్షిత్ శెట్టి నటన , డాగ్ సన్నివేశాలు , సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , విజువల్స్ , సెకండాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు సినిమాకు ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా యానిమల్ ని విపరీతంగా ఇష్టపడే పెట్ లవర్స్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. మిగతా వారిని మాత్రం ఓ మోస్తారుగా ఆకట్టుకుంటుంది.

ఈ తరహా  కథతో యానిమల్ డ్రామా సినిమా చేసిన మేకర్స్ ప్రయత్నానికి అలాగే దీన్ని తెలుగులో రిలీజ్ చేసిన రానాని మెచ్చుకోవాల్సిందే .

 

రేటింగ్ : 2.75/5