‘Miss Shetty Mr Polishetty’ Review
Thursday,September 07,2023 - 01:15 by Z_CLU
నటీనటులు : నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి, జయసుధ, నాజర్ అభినవ్ గోమటం, మురళీ శర్మ, తులసి, హర్ష వర్ధన్ , సోనియా తదితరులు
కెమెరా : నిరవ్ షా
సంగీతం : రధన్
నేపథ్య సంగీతం : గోపి సుందర్
నిర్మాణం : యువీ క్రియేషన్స్
నిర్మాతలు: వంశీ - ప్రమోద్
రచన, దర్శకత్వం: మహేష్ బాబు.పి
విడుదల : 7 సెప్టెంబర్ 2023
అనుష్క , నవీన్ పోలిశెట్టి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందనే న్యూస్ వచ్చినప్పుడే 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' పై మంచి ఎక్స్ పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఫైనల్ గా ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చింది. మరి అనుష్క ఈ సినిమాతో పర్ఫెక్ట్ కం బ్యాక్ ఇచ్చిందా ? నవీన్ పోలిశెట్టి హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడా ? దర్శకుడు మహేష్ ఈ బోల్డ్ కాన్సెప్ట్ ను ఎలా హ్యాండిల్ చేశాడు ? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.

కథ :
లండన్ లో చెఫ్ గా వర్క్ చేసే అన్విత (అనుష్క) తన తల్లి కోరిక మేరకు ఆమెను తీసుకొని ఇండియా వస్తుంది. పెళ్లి అంటే అస్సలు పడని అన్విత తన తల్లి మరణం తర్వాత తనకి ఓ తోడు ఉండాలని భావించి IUI ప్రెగ్నెన్సీ ద్వారా పిల్లను కనాలని భావిస్తుంది. తన క్వాలిటీస్ కి మ్యాచ్ అయ్యే స్పర్మ్ డోనర్ కోసం చూస్తుంటుంది. ఈ క్రమంలో అన్వితకి ఫుల్ టైమ్ సాఫ్ట్ వేర్, పార్ట్ టైమ్ స్టాండప్ కామెడీ చేస్తుండే సిద్దు పోలిశెట్టి కనిపిస్తాడు.
తనకి కావలిసిన అన్నీ క్వాలిటీస్ మ్యాచ్ అవుతాడా ? అనే క్రమంలో సిద్దుకి బాగా దగ్గరవుతుంది అన్విత. సిద్దు మాత్రం ఆ పరిచయాన్ని ప్రేమగా భావించి అన్వితను లవ్ చేస్తాడు. మరి విషయం తెలిశాక సిద్దు ఏం చేశాడు ? పెళ్లి అంటే పడని అన్విత సిద్దు ప్రేమలో పడి అతడ్ని పెళ్లి చేసుకుందా ? లేదా అనేది మిగతా కథ.
నటీ నటుల పనితీరు :
నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ గురించి తెలిసిందే. గత రెండు సినిమాళ్లో నవీన్ తన టైమింగ్ తో హిలేరియస్ గా మెప్పించి హిట్స్ అందుకున్నాడు. సిద్దు కేరెక్టర్ తో మరోసారి మెస్మరైజ్ చేశాడు. కొన్ని సీన్స్ లో తన కామెడీతో హిలేరియస్ గా నవ్వించాడు. ఎమోషనల్ సీన్స్ లో కూడా ఆకట్టుకున్నాడు. అనుష్క కి పర్ఫెక్ట్ పాత్ర , కథ దొరికాయి. దాంతో స్వీటీ ఎప్పటిలానే బెస్ట్ ఇచ్చింది. సినిమాకు నవీన్ , అనుష్క ఇద్దరూ హైలైట్ గా నిలిచారు. మురళీ శర్మ రెగ్యులర్ ఫాదర్ రోల్ చేసినా మరోసారి అలరించాడు. నటి తులసి తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. అభినవ్ గోమటం పరవాలేదనిపించాడు. దర్శకుడు అతని కామెడీ టైమింగ్ ను వాడుకోకుండా జస్ట్ ఫ్రెండ్ గా చూపించాడు. డాక్టర్ గా హర్ష వర్ధన్ అలరించాడు. హీరోయిన్ తల్లి పాత్రలో జయసుధ మంచి నటన కనబరిచింది. నాజర్, సోనియా తదితరులు సపోర్టింగ్ రోల్స్ తో ఆకట్టుకున్నారు.
సాంకేతిక వర్గం పనితీరు :
రధన్ కాంపోజ్ చేసిన సాంగ్స్ లో "లేడీ లక్కు" , హీరో దనుష్ పాడిన 'హత విది' , 'ఏ వైపుకి సాగుతోంది' సాంగ్స్ వినసొంపుగా ఉన్నాయి. గోపిసుందర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ కి స్కోర్ మరింత బలాన్నిచ్చింది. నిరవ్ షా విజువల్స్ బ్యూటీఫుల్ గా ఉన్నాయి. ఆయన కెమెరా వర్క్ సినిమా క్వాలిటీ పెంచింది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాగుంది. కానీ సెకండాఫ్ కాస్త ల్యాగ్ అనిపించే సీన్స్ ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. రాజీవన్ ప్రొడక్షన్ డిజైనింగ్ బాగుంది.
మహేష్ బాబు రాసుకున్న కథ , కథనం ఆకట్టుకున్నాయి. కొన్ని సీన్స్ ను దర్శకుడిగా బాగా తెరకెక్కించి మంచి మార్క్స్ స్కోర్ చేశాడు. యూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి.
జీ సినిమాలు సమీక్ష :
నవీన్ పోలిశెట్టి , అనుష్క జంటగా సినిమా అనేసరికి ఈ కాంబోపై అనేక రకాల కామెంట్స్ వినిపించాయి. అనుష్క పక్కన నవీన్ హీరో ఏంటి ? అంటూ మాట్లాడుకున్నారు. కానీ దర్శకుడు మహేష్ ఈ కాంబో సెట్ చేయడానికి స్ట్రాంగ్ రీజన్ ఉంది. వారిద్దరూ ఈ సినిమా ఎందుకు చేశారో ? తెలియాలంటే 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చూడాల్సిందే. ఇద్దరికీ పర్ఫెక్ట్ అనిపించే కథ ఇది. ముఖ్యంగా అనుష్క కం బ్యాక్ కి పర్ఫెక్ట్ స్క్రిప్ట్. ఆమె వయసుకి తగిన పాత్రతో కూడిన కథ దొరకడంతో స్వీటీ ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. నవీన్ కి కూడా 'జాతిరత్నాలు' తర్వాత మళ్ళీ ప్రేక్షకులను తన టైమింగ్ తో ఎంటర్టైన్ చేసే స్కోప్ ఉన్న స్క్రిప్ట్ దొరికింది. అందుకే ఇద్దరూ ఈ కథకి ఓటేసి నటించారు.
దర్శకుడు మహేష్ ఈ సినిమా కోసం స్పర్మ్ డొనేషన్ తో ఓ బోల్డ్ కాన్సెప్ట్ తీసుకున్నాడు. దాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా నీట్ గా డీల్ చేసి మెప్పించాడు. రెండో భాగంలో రెండు మూడు బోల్డ్ సన్నివేశాలు ఉన్నప్పటికీ అవి ఎంటర్టైనయింగ్ గా ఉంటాయి, కానీ మరీ ఇబ్బంది పెట్టేలా లేవు. పిల్లలతో ఆ సీన్స్ చూడటం కాస్త కష్టమే కానీ యూత్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక బోల్డ్ కథ తీసుకొని దాన్ని పర్ఫెక్ట్ క్లీన్ మూవీగా తీయడం గొప్ప విషయం. దానికి దర్శకుడు మహేష్ ను అభినందించాలి. అనుష్క కి ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని సన్నివేశాలు రాసుకున్నాడు దర్శకుడు.
సినిమా ప్రారంభమైన ఓ పదిహేను నిమిషాల తర్వాత నవీన్ పోలిశెట్టి ఎంట్రీ ఇస్తాడు. అప్పటి వరకూ ఒకే అనిపించే సన్నివేశాలతో నడిచే సినిమా అక్కడి నుండి ఎంటర్టైనింగ్ గా సాగింది. నవీన్ కామెడీ టైమింగ్ కి పర్ఫెక్ట్ క్యారెక్టర్ లభించడంతో తన నటనతో సినిమాకు హైలైట్ గా నిలిచాడు. అనుష్క కూడా తన పాత్రతో మరో సారి మెప్పించి మంచి కం బ్యాక్ ఇచ్చింది. హీరోకి అసలు విషయం తెలియడం సీన్ తో బ్రేక్ అంటూ ఇంటర్వల్ వేసిన దర్శకుడు దాని తర్వాత కథను నడిపించిన తీరు , కామెడీ సీన్స్ బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా హాస్పిటల్ లో వచ్చే సీన్ , తర్వాత అన్విత ను సిద్దు హోటల్ లో కలిసి మాట్లాడే సీన్ హిలేరియస్ గా పేలాయి. ఆ సీన్స్ టికెట్టు కొన్న ప్రేక్షకుడ్ని కడుపుబ్బా నవ్విస్తాయి.
సినిమాను ప్రీ క్లైమాక్స్ వరకూ ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించిన దర్శకుడు అక్కడి నుండి ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తూ తను చెప్పాలనుకున్న కథను ఎక్కడా తడబడకుండా హ్యాపీ ఎండింగ్ తో పర్ఫెక్ట్ గా చెప్పాడు. క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ పార్ట్ ఆకట్టుకుంది. ఓవరాల్ దర్శకుడు మహేష్ ఓ బోల్డ్ కథను అందంగా చూపిస్తూ ఎంటర్టైమెంట్ అందిస్తూ మెస్మరైజ్ చేశాడు. నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ , అనుష్క నటన , క్యారెక్టర్స్ , కథ -కథనం, మ్యూజిక్ , విజువల్స్ , హిలేరియస్ కామెడీ సీన్స్ , క్లైమాక్స్ సినిమాకు హైలైట్ అనిపించగా , మొదటి పదిహేను నిమిషాలు , సెకండాఫ్ లో బ్రేకప్ తర్వాత వచ్చే సీన్స్ మైనస్ అనిపిస్తాయి.
రేటింగ్ : 3 . 25 /5