Miss India Movie Review

Wednesday,November 04,2020 - 01:12 by Z_CLU

నటీనటులు : కీర్తి సురేష్ , నవీన్ చంద్ర, జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, VK నరేష్, నదియా, కమల్ కామరాజు, సుమంత్ శైలేంద్ర, పూజిత పొన్నాడ తదితరులు

సంగీతం : తమన్

ఛాయాగ్రహణం : సుజీత్ వాసుదేవ్

రచన : నరేంద్రనాథ్, తరుణ్ కుమార్

నిర్మాత : మహేష్ కోనేరు

దర్శకత్వం : నరేంద్ర నాథ్

విడుదల తేది : 4 నవంబర్ 2020

రన్ టైమ్ : 2 గంటల 16 నిమిషాలు

మహానటి తర్వాత తెలుగులో కీర్తిసురేష్ నటించిన 'మిస్ ఇండియా' ఈరోజే OTT ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమాతో కీర్తి మళ్ళీ తన మేజిక్ రిపీట్ చేసి మెప్పించిందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ .

miss-india-movie-review-telug కథ :

స్కూల్ డేస్ నుండే ఎం.బి.ఏ పూర్తి చేసి ఏదైనా వ్యాపారం చేయాలనే టార్గెట్ తో తన జీవితంపై ఆశలు పెంచుకుంటుంది మానస సంయుక్త (కీర్తి సురేష్). అయితే అనుకోకుండా కుటుంబంతో అమెరికా వెళ్లి సెటిల్ అయిన సంయుక్త చనిపోయిన తన తాత విశ్వనాథం (రాజేంద్ర ప్రసాద్) గొప్పదనాన్ని ఛాయ్ (Tea) రూపంలో తెలియజేయలనుకుంటుంది. అమెరికాలో కాఫీకి అలవాటు పడిన వారికి తన 'Miss india' బ్రాండ్ టీ ని రుచి చూపించి వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంటుంది.

ఈ క్రమంలో తన గోల్ కి అడ్డుతగిలే పెళ్లికి సైతం దూరంగా ఉండాలని తనను ప్రేమించే విజయ్ ఆనంద్ (నవీన్ చంద్ర) కి దూరమవుతుంది. ఒకానొక సమయంలో తన మీద తనకున్న నమ్మకంతో ఇంటి నుండి బయటకివచ్చిన సంయుక్త చివరికి తన టీ వ్యాపారంతో ఎలా ఎదిగింది..? కొన్నేళ్ళుగా అమెరికాలో KSK కాఫీ వ్యాపారం చేస్తున్న కైలాష్ శివ కుమార్ (జగపతి బాబు) కి ఎదురుగా నిలిచి సంయుక్త ఎలా తన గోల్ రీచ్ అయ్యింది అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

కథానాయికగా నేషనల్ అవార్డు అందుకున్న కీర్తి సురేష్ మానస సంయుక్త పాత్రలో మంచి నటన కనబరిచింది. కొన్ని సన్నివేశాల్లో చిక్కిన అందంతో ఆకట్టుకోకపోయినా తన నటనతో మెప్పించింది. ఉన్నది కాసేపే అయినప్పటికీ గతంలో చేసిన పాత్రే కావడంతో రాజేంద్ర ప్రసాద్ పాత్ర ఆకట్టుకోలేదు. స్టైలిష్ విలన్ గా జగపతి బాబు ఎప్పటిలాగే మంచి మార్కులే అందుకున్నాడు. కాకపోతే ఇది ఓ సాఫ్ట్ స్టోరీతో తెరకెక్కిన ఫీమేక్ సెంట్రిక్ కావడంతో తన పవర్ ఫుల్ విలనిజాన్ని చూపించడానికి స్కోప్ లేకుండా పోయింది.

తన పాత్రకు సరైన క్లారిఫికేషన్ లేకపోవడంతో నరేష్ దర్శకుడు చెప్పింది చేసాడు. తల్లి పాత్రలో నదియా మరోసారి ఆకట్టుకుంది. కాకపోతే ఆమె పాత్ర , సన్నివేశాలు , మాటలు గతంలో చూసిన సినిమాల్లో నదియాను గుర్తుచేస్తాయి. నవీన్ చంద్ర, సుమంత్ శైలేంద్ర లు తమ పాత్రలతో కొంత వరకూ ఆకట్టుకున్నారు. పూజిత పొన్నాడ, దివ్య శ్రీపాద పరవాలేదనిపించుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు :

తమన్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ పాయింట్. ముఖ్యంగా తన నేపథ్య సంగీతంతో సినిమాకు బలన్నిచ్చాడు. తమన్ ట్యూన్ చేసిన కొత్తగా కొత్తగా , లచ్చ గుమ్మడి పాటలు జస్ట్ పరవాలేదనిపించాయి తప్ప మళ్ళీ మళ్ళీ పాడుకునేలా లేవు. సుజీత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతీ ఫ్రేం లావిష్ గా కనిపించింది. తమ్మిరాజు ఎడిటింగ్ మైనస్. అవసరం లేని సన్నివేశాలు తీసేసి కాస్త గ్రిప్పింగ్ గా ఎడిట్ చేసి ఉంటే సినిమా మరీ బోర్ కొట్టకుండా ఉండేది.

నరేంద్రనాథ్ , తరుణ్ కుమార్ ఈ సినిమా కోసం రాసుకున్న కథ -స్క్రీన్ ప్లే షార్ట్ ఫిలిం కోసం అన్నట్టుగా ఉన్నాయి. ముఖ్యంగా స్క్రీన్ ప్లే , సన్నివేశాలపై ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

miss-india-movie-review-telugu జీ సినిమాలు సమీక్ష :

మనదేశంలో ఉదయం నుండి రాత్రి వరకూ టీ లాగిస్తూ రిలీఫ్ అయ్యే జనాల సంఖ్య అధికం. టీ తాగనిదే చాలా మంది ఏ పని చేయలేరు. అందుకే మెగాస్టార్ చిరంజీవి కూడా మృగరాజు సినిమాలో ఛాయ్ మీద ఒక పాట పాడి టీ గొప్పదనం చెప్పాడు. సరిగ్గా ఇదే టీ కాన్సెప్ట్ తో ఓ స్ట్రాంగ్ ఉమెన్ బిజినెస్ లో ఎలా సక్సెస్ అయ్యిందనే కథతో 'మిస్ ఇండియా'ను తీర్చిదిద్దాడు దర్శకుడు నరేంద్రనాథ్. అయితే తను అనుకున్న కాన్సెప్ట్ ఆడియన్స్ కి ఎంటర్టైన్ మెంట్ తో కలిపి చెప్పడం మిస్ అయ్యాడు. కొన్ని సందర్భాల్లో ఈ ఛాయ్ కాన్సెప్ట్ తో నిర్మాతను అలాగే మిగతా నటీనటులను దర్శకుడు ఎలా ఒప్పించాడనే ప్రశ్న కలగకపోదు. అవును ఇలాంటి చిన్న ఐడియాతో సినిమా తీయడం మామూలు విషయం కాదు పైగా సక్సెస్ అందుకోవడం చాలా కష్టం. ఎంతో డ్రామా జోడించి ఎంటర్టైన్ చేస్తేనే తప్ప ఇలాంటి కాన్సెప్ట్ వర్కౌట్ అవ్వదు. ప్రేక్షకుడు ఊహించిన ఎంటర్టైన్ మెంట్ లేకపోవడం, సినిమా ప్రారంభం నుండి చివరి వరకూ ఒకే టెంపోలో నెమ్మదిగా సాగడం ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది.

నిజానికి మహానటి తర్వాత కీర్తి తెలుగులో చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ముందు నుండి ఓ మోస్తరు అంచనాలన్నాయి. కానీ ఆ అంచనాలను పూర్తిస్థాయిలో అందుకోలేకపోయింది మిస్ ఇండియా. సినిమా ప్రారంభమైన కాసేపటికే కొన్ని సన్నివేశాలు చూస్తూ డ్రామా మోతాదు ఎక్కువ అవుతుందనిపిస్తుంది. దానికి తోడు రాజేంద్ర ప్రసాద్ , నరేష్ పాత్రలు సినిమాపై ఉన్న కాసింత ఆసక్తిని తగ్గించేస్తాయి. మూలికలతో రాజేంద్ర ప్రసాద్ చేసే టీ వైద్యం తాలూకు సన్నివేశాలు చూస్తే సినిమాను పాస్ చేసి అర్జెంట్ గా ఓ టీ తాగి రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది. ఇక అల్జిమర్స్ వ్యాధి నరేష్ రెండో భాగంలో వచ్చే సన్నివేశాల్లో ఎదురుగా వ్యక్తులు మాట్లాడుకుంటుంటే పిచ్చోడిలా బిహీవ్ చేయడం నవ్వు తెప్పిస్తుంది. అతనికి అల్జిమర్స్ కాకుండా ఇంకేదైనా వ్యాధి క్రియేట్ చేసి సినిమాను కాసింత ఎమోషనల్ గా తెరకెక్కిస్తే బాగుండేది. ఇక టీ వ్యాపారంతో ఎదగడానికి కీర్తి చేసే ప్రయత్నాలతో వచ్చే కొన్ని సన్నివేశాలు కొంత పరవాలేదు అనిపిస్తాయి.

నిజానికి చిన్నప్పటి నుండి వ్యాపారం చేయాలనే ధోరణితో ఉన్న ఓ యువతీ ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా తన కాళ్ళపై ఎలా నిలబడి చివరికి ఎలా సక్సెస్ అయ్యింది అనే పాయింట్ మంచి ఎమోషన్ తో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకుంటే ఇది వర్కౌట్ అయ్యే ఫార్ములానే. అవేవి వర్కౌట్ చేయలేకపోవడంతో స్క్రిప్టింగ్ జాగ్రత్త తీసుకోకపోవడంతో ఫైనల్ గా సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. దర్శకుడు తను చెప్పాలనుకున్న కథను ఎంటర్టైనింగ్ గా చెప్పడంలో మిస్ అయ్యాడు. ముఖ్యంగా క్యారెక్టర్స్ డిజైనింగ్ కూడా ఇంకా స్ట్రాంగ్ గా ప్లాన్ చేసుకోవాల్సింది. అలాగే సినిమాలో నవీన్ చంద్ర, సుమంత్ శైలేంద్ర ఇద్దరితో కీర్తి లవ్ ట్రాక్ కూడా రొటీన్ గా అనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోదు. అది కూడా సినిమాకు మైనస్ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా కీర్తి సురేష్ కోసం ఈ సినిమాను ఓ సారి చూడొచ్చు.

రేటింగ్ 2.25/5