Maniratnam’s ‘Ponniyan Selvan 1’ Movie Review

Friday,September 30,2022 - 02:29 by Z_CLU

నటీ నటులు : విక్రమ్‌, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్‌, విక్రమ్‌ ప్రభు, శోభిత ధూళిపాళ, జయరామ్‌, ప్రభు, పార్తిబన్‌, ప్రకాష్‌రాజ్‌ తదితరులు

కథనం: జైమోహన్‌

మాటలు : తనికెళ్ళ భరణి (తెలుగు)

ఛాయాగ్రహణం: ఎస్‌. రవి వర్మన్‌

కళా దర్శకత్వం: తోట తరణి

కూర్పు: అక్కినేని శ్రీకర్‌ ప్రసాద్‌

నిర్మాణం : లైకా ప్రొడక్షన్స్‌, మద్రాస్‌ టాకీస్‌

సమర్పణ: సుభాస్కరన్‌.

దర్శకత్వం : మణిరత్నం

నిడివి : 167 నిమిషాలు

విడుదల తేది : 30 సెప్టెంబర్ 2022

 

విక్రమ్, ఐశ్వర్య రాయ్, కార్తి , జయం రవి , త్రిష, విక్రం ప్రభులతో  మణిరత్నం తీసిన భారీ బడ్జెట్ హిస్టారికల్ మూవీ 'పోన్నియన్ సెల్వన్ పార్ట్ 1' గ్రాండ్ గా రిలీజైంది. పోన్నియన్ సెల్వన్ అనే నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా ? భారీ అంచనాలను అందుకొని బిగ్ హిట్ అనిపించుకుందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

 

కథ : 

వేయి సంవత్సరాల క్రితం  చోళ నాట స్వర్ణ శకం ఉదయించక మునుపు చోళ రాజ్యంలో ఒకరిని బలికోరిన తోకచుక్క.. రక్షణకై ఒకరు, ఆధిపత్యం కోసం మరొకరు యుద్దాలు చేసుకోవడం ఈ కథ మొదలవుతుంది. అప్పటి చోళ రాజ్యాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. మరో వైపు చోళ రాజు ఆదిత్య కరికాలుడు (విక్రమ్) తన రాజ్యాన్ని రక్షించుకునేందుకు వ్యూహాలు పన్నుతుంటాడు. ఈ క్రమంలో రాజ్య ఆక్రమణ కోసం రాజ వారసులను చంపేందుకు పెద్ద కుట్ర జరుగుతుందని తెలుసుకున్న ఆదిత్య కరికాలుడు ఆ కుట్రను చేదించేందుకు వల్లవరాజన్ (కార్తి) ని పంపుతాడు.  అసలేం జరుగుతుందో తెలుసుకోవడానికి గుర్రంపై బయలుదేరిన వల్లవరాజన్ ఏం తెలుసుకున్నాడు ? మరో వైపు అరుల్మౌళి (జయం రవి)ని ఎలా రక్షించాడు ?  ఆడవాళ్ళూ ఇందులో భాగమైన ఈ కథ చివరికి ఏ మజిలీకి చేరుకుందనేది పిఎస్ 1ని తెరమీద చూసి తెలుసుకోవాలి.

 

నటీ నటుల పనితీరు :

ఈ సినిమాలో నటించిన హీరో -హీరోయిన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. ఇది వరకే తమ పాత్రలతో మెప్పించి స్టార్స్ గా ఎదిగిన యాక్టర్ అందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.  ఏ పాత్రనైనా అలవోకగా చేయగలిగే అతికొద్ది మంది వెర్సటైల్ హీరోల్లో విక్రమ్ ఒకరు. చోళ రాజుగా విక్రమ్ నటన బాగుంది. అలాగే మరో రాజుగా కనిపించిన అరుళ్ మౌళి పాత్రలో జయం రవి మెప్పించాడు. అతను స్క్రీన్ పై కనిపించింది కాసేపే అయినప్పటికీ కథలో కీలకమైన పాత్రతో ఆకట్టుకున్నాడు. కార్తి తన కామెడీ టైమింగ్ తో అలాగే డైలాగ్ డెలివరీ తో అలరించాడు. ముఖ్యంగా రాణిలను కలిసే సన్నివేశాల్లో కార్తి నటన బాగుంది. చోళ రాణుల పాత్రల్లో ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌, త్రిష ఇద్దరూ ఆకట్టుకున్నారు. ఐశ్వర్య అందం , అభినయంతో ఆకట్టుకుంది. త్రిష కి కథలో కీలకమైన యువరాణి పాత్ర దక్కడంతో నటిగా మంచి మార్కులు అందుకుంది. జయరాం తన పాత్రకు పూర్తి న్యాయం చేసి ఎంటర్టైన్ చేశాడు. విక్రమ్‌ ప్రభు, శోభిత ధూళిపాళ, ప్రకాష్‌రాజ్‌ ,జయరామ్‌, ప్రభు, పార్తిబన్‌ తదితరులు వారి పాత్రలకు పూర్తి న్యాయం చేసి రక్తి కట్టించారు.

   

సాంకేతిక వర్గం పనితీరు :

రెహమాన్ మ్యూజిక్ సినిమాకు బిగ్గెస్ట్ ఎస్సెట్ అని చెప్పొచ్చు. మణిరత్నం -రెహమాన్ కాంబినేషన్ మ్యూజిక్ పరంగా ఎప్పుడూ డిజప్పాయింట్ చేయలేదు. ఈ సినిమాకు కూడా రెహ్మాన్ సంగీత దర్శకుడిగా పూర్తి న్యాయం చేశాడు. పాటలు బాగున్నాయి. కానీ తెలుగు లిరిక్స్ కుదరలేదు. దీంతో ట్యూన్ బాగున్నా సినిమా అయ్యాక  ప్రేక్షకుడు నోట్లో పాటలు పాడుకోలేని పరిస్థితి. ఈ సినిమాకు మరో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ రవి వర్మన్ సినిమాటోగ్రఫీ. తన కెమెరా వర్క్ తో సినిమా విజువల్ గా ఆకట్టుకునేలా చేశాడు. తోటతరణి ఆర్ట్ వర్క్ బాగుంది. కాస్ట్యూమ్స్ , మేకప్ విభాగాలు బాగా పనిచేశాయి.

తనికెళ్ళ భరణి అందించిన మాటలు అక్కడక్కడా ఆకట్టుకున్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ నిరాశ పరిచాయి.  మణిరత్నం దర్శకత్వం బాగుంది కానీ నెమ్మదిగా సాగే కథనం మైనస్. ప్రొడక్షన్ వేల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

వేయి సంవత్సరాల క్రితం చోళ రాజ్యంలో జరిగిన ఓ కథను పోన్నియన్ సెల్వన్ పేరుతో కల్కి కృష్ణ మూర్తి అనే రచయిత కొన్ని భాగాలుగా పుస్తకాలు రాశాడు. తమిళ్ లో ఈ నవలను సినిమాగా తీసేందుకు చాలా మంది దర్శకులు ప్రయత్నించారు. కానీ ఎవరూ తీయలేకపోయారు. చివరికి ఈ కథ మణిరత్నం చేతిలో పడింది. ఫిలిం మేకింగ్ లో మాస్టర్ అనిపించుకున్న దర్శకుడు మణిరత్నం ఈ కథను సినిమాగా తీస్తున్నారనే ఎనౌన్స్ మెంట్ నుండే పోన్నియన్ సెల్వన్ 1 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా తమిళ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. నిజానికి ఈ నవలను ఎలాంటి మార్పులు లేకుండా ఉన్నది ఉన్నట్టు తీసే ప్రయత్నం చేశారు మణిరత్నం. అందువల్ల ప్రేక్షకుడు ఈ తరహా సినిమాల్లో కోరుకునే హై మూమెంట్స్ , అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లు , కిక్ ఇచ్చే సినిమాటిక్ సన్నివేశాలు ఎక్కువగా కనిపించలేదు. అయితే మణిరత్నం ఈ కథలో ఆడియన్ కోరుకునే అలాంటి ఎలిమెంట్స్ ఎక్కువ ప్లాన్ చేసుకుంటే సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళేది.

హిస్టారికల్ డ్రామా ను భారీ బడ్జెట్ తో తీయడం అంటే పెద్ద సాహసమే. దర్శకుడిపై ఎక్కువ భాద్యత ఉంటుంది. ఈ తరహా సినిమాలు ఇది వరకూ మణిరత్నం హ్యాండిల్ చేయకపోవడంతో ఆయన టేకింగ్ పోన్నియన్ సెల్వన్ కు మైనస్ అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కథను ప్రాపర్ గా నెరేట్ చేయడంలో మణిరత్నం తడబడ్డారు. సినిమా ఆరంభంలో మెగా స్టార్ చిరు వాయిస్ ఓవర్ తో కథ గురించి క్లుప్తంగా చెప్పించి మిగతాది సినిమా చూసి తెలుసుకోండి అన్నట్టుగా వదిలేశారు మణిరత్నం. పోనీయ్ సినిమా అయ్యాక అయినా సాధారణ ప్రేక్షకుడికి పూర్తి కథేంటో తెలుస్తుందా ? అంటే కష్టమే. అసలు ఈ కథలో ఎవరు ఎవరికీ ఏమవుతారు ? అనేది సినిమా పూర్తయ్యాక చాలా మందికి వచ్చే పెద్ద డౌట్. ఇలాంటి కథల్ని అరటి పండు వలిచినట్టుగా చెప్పే ప్రయత్నం చేయాలి లేదంటే ప్రేక్షకుడు  కథకి,పాత్రలకి, కనెక్ట్ అవ్వడం కష్టమే. అలాగే దీన్ని రెండు భాగాలుగా తీద్దమనుకున్నారు కాబట్టి మొదటి భాగంలో అసలు కథ చెప్పలేకపోవచ్చు. బహుశా రెండో భాగంలో పూర్తి కథ తెలియవచ్చు.

హిస్టారికల్ సినిమాల్లో గ్రాండియర్ విజువల్స్ తో పాటు ఆకట్టుకునే డ్రామా అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లు ఉండాలి. మణిరత్నం ఈ కథను గ్రాండియర్ గా చూపించే ప్రయత్నం చేశారు కానీ విజువల్స్ పరంగా పూర్తిస్థాయిలో మెస్మరైజ్ చేయలేకపోయారు. అలాగే యాక్షన్ సీక్వెన్స్ డిజైనింగ్ సరిగ్గా కుదరకపోవడంతో పోరాట సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అలాగే సన్నివేశాల్లో డ్రామా వర్కౌట్ అవ్వలేదు. స్లో నరేషన్ తో సినిమా నత్తనడకన సాగుతుంది. కొన్ని సన్నివేశాలతో కాస్త వేగంగా నడిచినా వెంటనే మళ్ళీ స్లో గా  రన్ అవ్వడం ప్రేక్షకుడికి ఇబ్బంది పెడుతుంది. పొన్నియన్ సెల్వన్ అరుల్ మౌళి మరణంతో మొదటి భాగాన్ని ముగించారు మణిరత్నం. అలాగే అతను మరణించాడా లేదా అనేది రెండో భాగానికి ఆరంభంగా చూపించే విధంగా హింట్ కూడా ఇచ్చారు.

మణిరత్నం సినిమాలకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. భాషతో సంబంధం లేకుండా ఆయనకు వరల్డ్ వైడ్ గా అభిమానులున్నారు. ఆ అభిమానంతోనే దర్శకుడిగా ఈ మధ్య మణిరత్నం కాస్త నిరాశ పరిచే సినిమాలు అందిస్తున్నా మళ్ళీ ఆయన సినిమా వచ్చిందంటే మొదటి రోజు థియేటర్స్ లో వాలిపోతుంటారు. పోన్నియన్ సెల్వన్ 1 తో మణిరత్నం పాన్ ఇండియా లెవెల్ లో తన ముద్ర వేసి బిగ్గెస్ట్ హిట్ అందుకుంటాడని అందరూ ఆశించారు. కానీ ఈ సినిమాతో ఆయన ఓ మోస్తరుగా మాత్రమే మెప్పించారు. ముఖ్యంగా బాహుబలి , గేమ్ ఆఫ్ త్రోన్స్ చూసిన ప్రేక్షకుల కంటికి పోన్నియన్ సెల్వన్ ఆనదు. కానీ ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా చూస్తే ఓ మోస్తరుగా ఆకట్టుకుంటుంది. గ్రాండియర్ విజువల్స్ , భారీ కాస్టింగ్ , మణిరత్నం సన్నివేషాలు , రెహమాన్ మ్యూజిక్ కోసం సినిమాను ఓ సారి చూడొచ్చు.

రేటింగ్ : 2.5/5