Kushi Movie Review

Friday,September 01,2023 - 01:58 by Z_CLU

నటీనటులు : విజయ్ దేవరకొండ, సమంత, జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, శరణ్య పొన్ వణ్నన్, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు.

మ్యూజిక్  : హిషామ్ అబ్దుల్ వాహబ్

డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : జి.మురళి

సి.ఇ.ఓ : చెర్రీ

నిర్మాతలు : నవీన్ యేర్నేని,రవిశంకర్ యలమంచిలి

కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శివ నిర్వాణ.

రన్ టైమ్ : 165 నిమిషాలు

విడుదల తేది : 1 సెప్టెంబర్ 2023

విజయ్ దేవరకొండ , సమంత జంటగా శివ నిర్వాణ డైరెక్షన్ లో ఓ లవ్ స్టోరీ వస్తుందనే  ఎనౌన్స్ మెంట్ నుండే 'ఖుషి' పై మంచి ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి.  హృదయం ఫేమ్ హిషామ్ అబ్దుల్ వాహబ్ ఇచ్చిన సాంగ్స్ సినిమాపై మంచి బజ్ తీసుకొచ్చాయి. భారీ అంచనాల నడుమ ఈ సినిమా థియేటర్స్ లోకొచ్చింది. మరి సరికొత్త ప్రేమకథతో ఈ సినిమా ప్రేక్షకులను 'ఖుషి' చేసిందా ? విజయ్ దేవరకొండ సూపర్ హిట్ అందుకున్నాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.

కథ :

బీఎస్ఎన్ఎల్ టెలిఫోన్ ఆఫీస్లో వర్క్ చేసే విప్లవ్ (విజయ్ దేవరకొండ) కాశ్మీర్ అందాలు చూడటం కోసం అక్కడ పోస్టింగ్ వేయించుకుంటాడు. అలా కాశ్మీర్ లో అడుగుపెట్టిన విప్లవ్ కి అక్కడ పరిస్తితులు ఇబ్బంది పెడతాయి. ఇంతలో విప్లవ్ కి ఆరా(సమంత) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఆమెతో మొదటి చూపులునే ప్రేమలో పడిపోయిన విప్లవ్ పాకిస్తాన్ అమ్మాయి అని తెలుసి కూడా ఎలాగైనా తనతో పెళ్లి పీటలు ఎక్కాలనుకుంటాడు.

తర్వాత తను ప్రేమిస్తున్న ఆరా పాకిస్తాన్ అమ్మాయి కాదని కాకినాడకి చెందిన ఆరాధ్య అనే బ్రహ్మీణ్ అమ్మాయని తెలుసుకొని షాక్ అవుతాడు. తర్వాత ఇద్దరూ తమ ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లాలని భావిస్తారు. ఆరాధ్య తండ్రి ప్రవచనాలు చెప్పే చదరంగం శ్రీనివాస్ కాగా , విప్లవ్ తండ్రి నాస్తికుడు లెనిన్ సత్యం. మరి ఇరువురి కుటుంబాలకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ స్టార్ట్ చేసిన విప్లవ్ , ఆరాధ్యకి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి ? ఫైనల్ గా వీరిద్దరి సమస్యకి పరిష్కారం దొరికిందా ? లేదా అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

విప్లవ్ కేరెక్టర్ లో విజయ్ దేవరకొండ మెస్మరైజ్ చేశాడు. తన యాక్టింగ్ తో సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాడు. సమంత తన పాత్రతో సినిమాకి ప్లస్ అయ్యింది. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ఎప్పటిలానే మంచి నటన కనబరిచింది. వెన్నెల కిషోర్ , రాహుల్ రామకృష్ణ డైలాగ్ కామెడీ అక్కడక్కడా వర్కవుట్ అయ్యి ఫన్ క్రియేట్ చేసింది. సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ కంప్లీట్ అపోజిట్ పాత్రల్లో ఆకట్టుకున్నారు. నటి లక్ష్మికి మరో మంచి పాత్ర దక్కింది. అలీ ఒక్క సీన్ కే పరిమితమయ్యాడు. ఆ సీన్ తో నవ్వించలేకపోయాడు. జయరాం ,రోహిణి భార్యా భర్తలుగా వారి పాత్రలకు బెస్ట్ ఇచ్చారు. సెకండాఫ్ లో తమ పాప గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యే సీన్ లో అద్భుతంగా నటించారు. శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు :

ఏ లవ్ స్టోరీకయినా మంచి మ్యూజిక్ , ఎట్రాక్ట్ చేసే విజువల్స్ ముఖ్యం. ఖుషికి ఈ రెండు బాగా కుదిరాయి. హీషాం అందించిన మ్యూజిక్ సినిమాకు బిగ్ ఎస్సెట్. పాటలు , నేపథ్య సంగీతం ఆకట్టుకున్నాయి. నా రోజా నువ్వే , ఆరాధ్య , ఖుషి టైటిల్ సాంగ్ వినసొంపుగా ఉన్నాయి. అలాగే సాడ్ సాంగ్ కూడా బాగుంది. జీ. మురళి కెమెరా వర్క్ మరో ప్లస్ పాయింట్. తన వర్క్ తో కాశ్మీర్ లొకేషన్స్ ను బాగా చూపించాడు. పీటర్ హెయిన్స్  కంపోజ్ చేసిన ఫైట్ బాగుంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ పర్ఫెక్ట్ గా ఉంది.

శివ నిర్వాణ దర్శకుడిగా మెప్పించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ , లవ్ ట్రాక్ ను బాగా తెరకెక్కించాడు. కాకపోతే రైటింగ్ లో ఎక్కువ మార్కులు స్కోర్ చేయలేకపోయాడు. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వెల్యూస్ సినిమా క్వాలిటీ పెంచాయి.

జీ సినిమాలు సమీక్ష :

శివ నిర్వాణ లవ్ స్టోరీస్ తో వరుస సూపర్ హిట్స్ కొట్టాడు. కానీ ఫస్ట్ టైమ్ కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో తీసిన 'టక్ జగదీష్' ప్రేక్షకులను నిరాశ పరిచింది. దాంతో మళ్ళీ తన స్ట్రెంగ్త్ అయిన లవ్ స్టోరీతోనే ప్రేక్షకుల ముందుకొచ్చాడు నిర్వాణ. విజయ్ , సమంతల కోసం ఓ ఎమోషనల్ లవ్ స్టోరీ రాసుకున్నాడు. దానికి పవన్ కళ్యాణ్ క్లాసిక్ మూవీ ఖుషి టైటిల్ పెట్టుకున్నాడు. మలయాళంలో మంచి పేరుతెచ్చుకున్న హీషాం ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నాడు. మంచి విజువల్స్ ఇచ్చే జి. మురళి ను కెమెరా మెన్ గా తీసుకున్నాడు. ఇలా ఓ లవ్ స్టోరీకి కావాల్సిన అన్నీ బలాలు సమకూర్చుకున్నాడు దర్శకుడు. ముఖ్యంగా మొదటి భాగాన్ని మంచి లవ్ స్టోరీతో కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో అందంగా నడిపించాడు. ఇక రెండో భాగాన్ని ఎమోషనల్ గా నడిపించాడు. కొందరు భార్య భర్తల సమస్యను తీసుకొని వారి బాధను స్క్రీన్ పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు.  ఆ పాయింట్ కి సైన్స్ , దేవుడి తో ముడిపెట్టి ఏదో కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు.

రెండో భాగంలో రైటింగ్ లో కొన్ని కంప్లయింట్స్ ఉన్నప్పటికీ కొన్ని సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. అలాగే ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ తో మెప్పించాడు దర్శకుడు. అయితే శివ నిర్వాణ రెండో భాగంలో తను అనుకున్న కథను ఏదో కొత్తగా చెప్పబోయి కొంత తడబడ్డాడనిపిస్తుంది. విజయ్ -సమంత మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవ్వడంతో వారి మధ్య లవ్ సీన్స్ , ఫ్యామిలీ సీన్స్ బాగా పండాయి.

శివ నిర్వాణ తెరకెక్కించిన కొన్ని ఎమోషనల్ సీన్స్ కి హీషాం తన స్కోర్ తో మరింత బలాన్నిచ్చాడు. ముఖ్యంగా విజయ్ , సమంత తమ యాక్టింగ్ తో సినిమాకు మెయిన్ హైలైట్ అనిపించుకున్నారు. చూడముచ్చటైన పెయిర్ , వినసొంపైన పాటలు , ఆకట్టుకునే విజువల్స్ , క్లైమాక్స్ సినిమాకు ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడదగిన సినిమా ఖుషి. టికెట్టు కొన్న ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఖుషి చేయకపోయినా ఓవరాల్ గా ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామాగా మెప్పిస్తుంది.

 

రేటింగ్ : 3 /5