Krack movie Review

Sunday,January 10,2021 - 07:51 by Z_CLU

నటీనటులు : రవితేజ, శృతి హాసన్, సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్, రవిశంకర్ తదితరులు

సంగీతం :ఎస్. థమన్

కెమెరామెన్ : జి.కే.విష్ణు

డైలాగ్స్‌: సాయిమాధ‌వ్ బుర్రా

నిర్మాణం : స‌ర‌స్వ‌తి ఫిలిమ్స్ డివిజ‌న్‌

నిర్మాత : బి.మధు

రచన -దర్శకత్వం : గోపీచంద్ మలినేని

రన్ టైం : 154 నిమిషాలు

రిలీజ్ డేట్ : 9 జనవరి 2021

మాస్ మహారాజ రవితేజ-డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కిన 'క్రాక్' సినిమా సంక్రాంతి స్పెషల్ గా థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. నిర్మాతకున్న పాత ఫైనాన్షియల్ ట్రబుల్స్ తో కాస్త ఆలస్యంగా విడుదలైన ఈ సినిమా అంచనాలు అందుకుందా? రవితేజ మరోసారి సంక్రాంతి హిట్ కొట్టాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

krack-movie-review-telugu 2 కథ :

తన భార్య కళ్యాణి (శృతి హాసన్) , కొడుకు(మాస్టర్ మలినేని సాత్విక్) తో హాయిగా గడిపేస్తూ కర్నూలులో SI గా ఉద్యోగం చేసే వీరశంకర్ (రవితేజ), సలీమ్ భత్కల్ అనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను పట్టుకొని జైల్లో పెడతాడు. సలీమ్ కేసుతో CI గా ప్రమోషన్ అందుకొని ఒంగోలుకి ట్రాన్స్ఫర్ అయిన శంకర్ అక్కడ వేటపాలెం గ్యాంగ్ తో మర్డర్లు చేయించే కఠారి కృష్ణ(సముద్రఖని) ను పోలిస్ మర్డర్ కేసులో అరెస్ట్ చేస్తాడు. అలా కఠారి కృష్ణకి ఎదురెళ్లిన శంకర్ తన క్రాక్ తో చివరికి అతన్ని మనిషిగా ఎలా మర్చాడు..? అనేది కథాంశం.

నటీనటుల పనితీరు :

మాస్ మహారాజ రవితేజ మరోసారి తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో సినిమాకు హైలైట్ గా నిలిచాడు. పవర్ ఫుల్ పోలీస్ గా శంకర్ పాత్రను ఆయన ఎంజాయ్ చేస్తూ నటించాడు. యాక్షన్ ఎపిసోడ్స్, డాన్సుల్లో రవితేజలో మునపటి ఎనర్జీ కనిపించడానికి ఇదే కారణం. శృతిహాసన్ హీరోయిన్ గా తన గ్లామర్ తో ఎట్రాక్ట్ చేయలేదు కానీ నటిగా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఎమోషనల్, రొమాంటిక్ సీన్స్ లో మెప్పించింది. సముద్రఖని, రవిశంకర్, వరలక్ష్మి తమ విలనిజంతో మెప్పించి సినిమాకు మరింత బలం చేకూర్చారు. చిరాగ్ జానీ పెద్దగా స్కోప్ లేని విలన్ పాత్రలో పరవాలేదనిపించుకున్నాడు. అప్సర రాణి ఐటెం సాంగ్ తో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

మాస్టర్ మలినేని సాత్విక్ మొదటి సినిమా అయినప్పటికి బాగా నటించాడు. కథలో కీలక మలుపు తీసుకొచ్చే పాత్రల్లో సుధాకర్ కొమాకుల, వంశీ చాగంటి ఇద్దరు బాగా నటించారు. గోపరాజు రమణ, దేవ్ ప్రసాద్, ముక్కు అవినాష్ పోలిస్ పాత్రలతో మెప్పించారు. ఆలి, చమ్మక్ చంద్ర, ఆచంట మహేష్ జస్ట్ ఒక్క సీనులో మెరిశారు. జీవ , మౌర్యాని, హైపర్ ఆది, రచ్చ రవి తదితరులు తమ పాత్రలకు న్యాయం చేసారు.

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు టెక్నికల్ గా మంచి సపోర్ట్ అందింది. ముఖ్యంగా జి.కే.విష్ణు సినిమాటోగ్రఫీ, థమన్ మ్యూజిక్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. తెలుగులో మొదటి సినిమా కావడంతో ప్రేక్షకులకు తన కెమెరా పనితనం చూపించి మంచి విజువల్స్ అందించాడు విష్ణు. థమన్ అందించిన పాటలలో బూమ్ బద్దల్ పాట బాగుంది మిగతావి పర్వాలేదనిపించాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాకు హైలైట్ గా నిలిచింది. కొన్ని సందర్భాల్లో తమన్ నేపథ్య సంగీతం సన్నివేశాలకు మరింత బలాన్నిచ్చింది. "కోరమీసం పోలీసోడా", 'భూమ్ బద్దల్' పాటలకు రామజోగయ్య శాస్త్రి , 'మాస్ బిర్యాని' పాటకు కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం బాగుంది. నవీన్ నూలి తన ఎడిటింగ్ మేజిక్ తో సినిమాను పర్ఫెక్ట్ గా కట్ చేశాడు.

సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగ్స్ థియేటర్స్ లో మాస్ ఆడియన్స్ తో విజిల్స్ వేయించాయి. ముఖ్యంగా "ఒంగోలు నడిరోడ్డు మీద నగ్నంగా నిలబెట్టి నవరంద్రాల్లో సీసం పోస్తా నా కొడక" లాంటి డైలాగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌ మాస్టర్స్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ఆడియన్స్ ని మెప్పించి ఎట్రాక్ట్ చేసాయి. ఎ.ఎస్.ప్రకాష్ ఆర్ట్ వర్క్ బాగుంది.

గోపీచంద్ మలినేని తను రాసుకున్న యాక్షన్ డ్రామా కథను పర్ఫెక్ట్ కమర్షియల్ మీటర్ లో ప్రెజెంట్ చేసి అలరించాడు. దర్శకుడిగా గోపీచంద్ ఈ సినిమాతో మరో మెట్టెక్కాడు. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ సంస్థ ప్రొడక్షన్ వాల్యూస్ గ్రాండియర్ గా ఉన్నాయి.

krack-movie-review-telugu 2 జీ సినిమాలు సమీక్ష :

కమర్షియల్ యాక్షన్ సినిమాలో కొత్తదనం ఊహించలేం. హీరో కి పవర్ ఫుల్ క్యారెక్టరైజేషన్, హీరో-విలన్ మధ్య గొడవ, రౌడీలను హీరో చిత్తుగా కొట్టే యాక్షన్ ఎపిసోడ్స్, ఐటెం సాంగ్ , అక్కడక్కడా కాస్త కామెడీ. ఇదే కొన్నేళ్ళుగా బాక్సాఫీస్ దగ్గర కాసులు కురిపిస్తున్న కమర్షియల్ సినిమా ఫార్మేట్. దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా 'క్రాక్' విషయంలో అదే ఫాలో అయ్యాడు. కాకపోతే ఒక పోలీసోడు ముగ్గురు రౌడీలతో ఎలా ఆడుకున్నాడనే ఎలిమెంట్ ను యాబై రూపాయల నోటు, మామిడికాయ, మేకు ఇలా ఓ మూడు ఎలిమెంట్స్ తో మిక్స్ చేసి కాస్త కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు. స్క్రిప్టింగ్ స్టేజిలో ఈ ఐడియా కొత్తగా అనిపించొచ్చు కానీ స్క్రీన్ పైకి సినిమాగా వచ్చేసరికి రొటీన్ కథే అనిపించింది.

"చూసారా జేబులో ఉండాల్సిన నోటు , చెట్టుకుండాల్సిన కాయ , గోడకుండాల్సిన మేకు ఈ మూడు ముగ్గురు తోపులని తొక్కి తాట తీశాయి. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే ఈ ముగ్గురితో ఆడుకుంది ఒకే పోలీసోడు." అంటూ వెంకటేష్ వాయిస్ ఓవర్ తో సినిమాను స్టార్ట్ చేసిన గోపిచంద్ మలినేని ఆ వెంటనే ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎవ్వరికీ దొరక్కుండా తప్పించుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవాలని చూసే సన్నివేశాలు, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా డ్యూటీ చేస్తూ విలన్ కి ఎదురెళ్ళే సన్నివేశాలతో కూడిన రొటీన్ కథతోనే సినిమాను నడిపించాడు. కాకపోతే ఈ రొటీన్ స్టఫ్ నే తన మార్క్ యాక్షన్ తో విష్ణు, తమన్ ల సపోర్ట్ తో ఎక్కడా బోర్ కొట్టకుండా తన స్క్రీన్ ప్లేతో అలరిస్తూ దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేశాడు గోపీచంద్.

సాంగ్స్ కూడా ఎక్కడికక్కడ కరెక్ట్ టైమింగ్ లో పడ్డాయి. రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ సినిమాను నిలబెట్టింది. ఇంటర్వెల్, క్లైమాక్స్ ఫైట్స్ మాస్ ఆడియన్స్ ను బాగా ఎట్రాక్ట్ చేసి విజిల్స్ వేయించాయి.

సినిమాలో వచ్చే కొన్ని సన్నివేశాలతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్... 2-3 తమిళ సినిమాలను గుర్తుచేసేలా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు, శృతి హాసన్ ఫైట్, వేటపాలెం యాక్షన్ ఎపిసోడ్స్... సేతుపతి, ఖాకీ సినిమాలను గుర్తుచేస్తాయి. బహుశా దర్శకుడు ఆ సినిమాల్లో కనిపించే ఎలిమెంట్స్ ను ఆదర్శంగా తీసుకొని ఆ టైపులో యాక్షన్ ఎపిసోడ్స్ ను కంపోజ్ చేయించుకొని ఉండొచ్చు.

ఫైనల్ గా రవితేజ పెర్ఫార్మెన్స్, విష్ణు విజువల్స్, తమన్ నేపథ్య సంగీతం, యాక్షన్ ఎపిసోడ్స్, గోపీచంద్ మలినేని టేకింగ్, అన్నీ కలిసి 'క్రాక్' ద్వారా ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు మంచి మాస్ విందు అందింది. రీసెంట్ గా వచ్చిన రవితేజ సినిమాల్లో ఇదే బెస్ట్.

బాటమ్ లైన్ : మాస్ మసాలా 'క్రాక్'

రేటింగ్ - 3/5