‘HanuMan’ Movie Review

Friday,January 12,2024 - 12:40 by Z_CLU

నటీ నటులు : తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి తదితరులు

డీవోపీ: దాశరధి శివేంద్ర సంగీత దర్శకులు: గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ స్క్రీన్‌ ప్లే: స్క్రిప్ట్స్‌విల్లే నిర్మాత: కె నిరంజన్ రెడ్డి బ్యానర్: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ రచన, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ నిడివి : 158 నిమిషాలు విడుదల తేదీ : 12 జనవరి 2024 తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన హనుమాన్ మంచి అంచనాల నడుమ ఈరోజే థియేటర్స్ లోకి వచ్చింది. సంక్రాంతి పోటీలో నిలిచిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది ? ప్రశాంత్ దర్శకుడిగా బ్లాక్ బస్టర్ అందుకున్నాడా? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ. కథ : చుట్టూ కొండల నడుమ అంజనాద్రి అనే పల్లెటూరు. ఆ ఊరిలో చిన్న చిన్న దొంగతనాలు చేసే చలకీ కుర్రాడు హనుమంతు(తేజ సజ్జ) . తను ప్రేమించిన అమ్మాయి మీనాక్షి (అమృత నైయర్) ను కాపాడే క్రమంలో హనుమంతుకి ఓ మణి ద్వారా హనుమంతుల వారి శక్తులు వస్తాయి. ఈ క్రమంలో ఆ ఊరిపై పెత్తనం చెలాయిస్తూ కుస్తీ పోటీలో ఊరి జనాల ప్రాణాలు తీసే గజపతి పై హనుమంతు హనుమాన్ శక్తితో ఓడించి ఊరిలో సూపర్ మెన్ అనిపించుకున్నాడు. ఆ అద్భుత శక్తులు మణి ద్వారా వచ్చిందని తెలుసుకున్న మైఖేల్ (వినయ్ రాయ్) ఆ శక్తులను పొందడం కోసం తన సైన్యంతో అంజనాద్రి లో అడుగు పెడతాడు. చివరికి హనుమంతు నుండి మైఖేల్ ఆ అద్భుతమణిను సొంతం చేసుకోగలిగాడా ? లేదా అనేది మిగతా కథ. నటీ నటుల పనితీరు : తేజ సజ్జా మంచి నటన కనబరిచాడు. హనుమంతు పాత్రకు తన నటనతో బలన్నిచ్చాడు. హనుమాన్ శక్తులు వచ్చిన సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్ లో తేజ తన పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో సినిమాకు హైలైట్ గా నిలిచాడు. హీరోయిన్ గా మీనాక్షి పాత్రలో అమ్రిత నాయర్ ప్లస్ అయ్యింది. తన పాత్రతో ఆకట్టుకుంది. అక్క పాత్రలో వరలక్ష్మి శరత్‌కుమార్ మెప్పించింది. తను ఎలాంటి పాత్రైన చేయగలను అని మరోసారి నిరూపించుకుంది. వినయ్ రాయ్ విలనిజం బాగుంది. ఇప్పటికే ఈ తరహా విలన్ పాత్రలతో మెప్పించిన వినయ్ మరోసారి స్టైలిష్ విలన్ గా మంచు మార్కులు అందుకున్నాడు. ఊరి పాలేగాడు గా రాజ్ దీపక్ శెట్టి పర్ఫెక్ట్ అనిపించాడు. జబర్దస్త్ శ్రీను కొత్త గెటప్ తో అలరించాడు. సత్య కామెడీ బాగా పండింది. తన టైమింగ్ తో రెండు మూడు సన్నివేశాల్లో హిలేరియస్ గా నవ్వించాడు. సాంకేతిక వర్గం పనితీరు : టెక్నికల్ గా సినిమాకు అందరూ బెస్ట్ ఔట్ పుట్ అందించారు. ముఖ్యంగా శివెంద్ర విజువల్స్, గౌర హరి నేపథ్య సంగీతం సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాయి. విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. ఎడిటర్ సాయి బాబు తలారి ఎక్కడా డ్రాగ్ లేకుండా కట్ చేశారు. నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్ వర్క్ బాగుంది. కాస్ట్యూమ్స్, మేకప్ బాగా కుదిరాయి. ప్రశాంత్ వర్మ రైటింగ్, మేకింగ్ బాగుంది. కొన్ని పాత్రలు , సన్నివేశాలు బాగా రాసుకున్నాడు. దర్శకుడిగా ఏ మాత్రం నిరాశ పరచకుండా చివరి వరకూ సినిమాను నిలబెట్టాడు. ప్రొడక్షన్ వేల్యూస్ సినిమా క్వాలిటీ ను పెంచాయి. నిర్మాత  సినిమాకు పెట్టిన ఖర్చు స్క్రీన్ పై కనిపించింది. జీ సినిమాలు సమీక్ష : హాలీవుడ్ లో ఎప్పటికప్పుడు సూపర్ హీరోస్ కథలతో సినిమాలు వస్తూనే ఉంటాయి. అయితే మనకి తెలిసిన  హనుమాన్ సూపర్ పవర్స్ వాడుకొని ఆ శక్తులు అందుకున్న కుర్రాడి కథతో సూపర్ హీరో సినిమా తీస్తే బాగుందనే ప్రశాంత్ వర్మ ఆలోచన బాగుంది. కథ పరంగా కాస్త అంజి, శ్రీ ఆంజనేయం పోలికలు ఉన్నప్పటికీ, ట్రీట్ మెంట్, మేకింగ్ పరంగా కొత్త ఎక్స్ పీరియన్స్ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. ముఖ్యంగా పాత్రలు, సన్నివేశాలు బాగా డిజైన్ చేసుకున్నాడు. పాత్రలకు తగ్గ నటీ నటులకు ఎంచుకున్నాడు. అక్కడే సగం సక్సెస్ అయ్యాడు. తేజ సజ్జా ను సూపర్ పవర్స్ ఉన్న కుర్రాడిగా హనుమాన్ గా ప్రెజెంట్ చేసి మెప్పించాడు. మొదటి భాగాన్ని ఎంటర్టైనింగ్ గా నడిపిస్తూ అక్కడక్కడా మంచులో తపస్సు చేస్తున్న హనుమాన్ విజువల్స్ చూపిస్తూ మెస్మరైజ్ చేశాడు దర్శకుడు. మొదటి భాగంలో హీరో కామెడీ సీన్స్, సత్య కామెడీ బాగా పేలాయి. స్టార్ హీరోల సీన్స్ రీ క్రియేట్ ట్రాక్ థియేటర్ లో బాగా పేలింది. ఆ ఎపిసోడ్ లో బాలయ్య ట్రైన్ కామెడీ వర్కౌట్ అయ్యింది. సెకండాఫ్ సిస్టర్ సెంటిమెంట్, హనుమాన్ సూపర్ పవర్స్ మీద డిపెండ్ అయ్యాడు. సెకండాఫ్ లో హనుమంతుడి విజువల్స్ వచ్చినప్పుడల్లా గూస్ బంప్స్ రావడం ఖాయం. విభీషణుడు హనుమంతుల బలం,  గురించి చెప్పే ఎపిసోడ్ హైలైట్స్ లో ఒకటి. సెకండాఫ్ లో ఆవకాయ సాంగ్ తో వచ్చే ఫైట్ కూడా హైలైట్ గా నిలిచింది. ఫస్ట్ హాఫ్ లో కామెడీ , హీరోకి హనుమంతుడి శక్తులు వచ్చే  సన్నివేశాలు, ఫైట్స్, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్,  పాటలు, సెకండాఫ్ లో వచ్చే గూస్ బంప్స్ సీక్వెన్స్, క్లైమాక్స్ లో హనుమంతుడు రావడం మెయిన్ హైలైట్స్. టెక్నికల్ గా  ప్రశాంత్ వర్మ బెస్ట్ వర్క్ ఇచ్చాడు. కంటెంట్ పరంగా కూడా మంచి మార్కులు అందుకున్నాడు. ఈ పండక్కి పిల్లలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా తన వర్క్ తో మంచి విజువల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చాడు. హనుమాన్ సూపర్ హీరో కథతో వచ్చిన అందరికీ నచ్చే సినిమా. ముఖ్యంగా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. కుటుంబంతో కలిసి పండక్కి చూడదగిన సినిమా. రేటింగ్ : 3.25 / 5