Movie Review – Gamanam

Friday,December 10,2021 - 12:44 by Z_CLU

నటీనటులు : శ్రియా, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, చారుహాసన్, సుహాస్, రవిప్రకాష్, బిత్తిరి సత్తి తదితరులు స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సుజనా రావు నిర్మాతలు : రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంగీతం : ‘మాస్ట్రో’ ఇళయరాజా డీఓపీ : జ్ఞానశేఖర్ వి.ఎస్ డైలాగ్స్ : సాయి మాధవ్ బుర్రా ఎడిటర్ : రామకృష్ణ అర్రమ్ రన్ టైమ్ : 1 గంట 54 నిమిషాలు సెన్సార్ : U రిలీజ్ డేట్ : డిసెంబర్ 10

3 కథల సమాహారం.. శ్రియ, నిత్యామీనన్, చారుహాసన్, శివ కందుకూరి, సుహాస్ లాంటి నటులు.. ఇళయరాజా సంగీతం.. ఇలా కాస్త హైప్ తో వచ్చింది గమనం. మరి ఈ సినిమా గమనం బాక్సాఫీస్ హిట్ దిశగా దూసుకెళ్లిందా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

gamanam movie release poster కథ

వేదం, మనమంతా, చందమామ కథలు లాంటి సినిమాల టైపులో కొన్ని కథల సమాహారం ఈ గమనం. ముఖ్యంగా ముగ్గురి జీవితాల చుట్టూ తిరిగే కథ ఇది. 1. కమలకు (శ్రియ) వినిపించదు. ఆమె భర్త దుబాయ్ లో ఉంటాడు. కమలకు ఓ పాప. ఎప్పటికైనా భర్త వస్తాడని ఎదురుచూస్తూ కుట్టుపని చేస్తూ, పేదరికం అనుభవిస్తుంటుంది కమల. కష్టపడి సంపాదించిన డబ్బుతో చెవిటి మిషన్ కొనుక్కుంటుంది. అయితే భర్త ఆమెను వదిలేసి వేరే మహిళను పెళ్లి చేసుకొని దుబాయ్ లో ఉండిపోయాడనే విషయం చివర్లో తెలుసుకుంటుంది. 2. అలీ (శివ కందుకూరి) ఓ ముస్లిం కుర్రాడు. ఎలాగైనా టీ-20కి ఆడి పేరు తెచ్చుకోవాలని తపన పడుతుంటాడు. క్రికెట్ కోసం చదువుతున్న ఎంబీబీఎస్ ను కూడా వదులుకుంటాడు. మరోవైపు అలీ, జరా (ప్రియాంక జవాల్కర్) ప్రేమించుకుంటారు. క్రికెట్ వదిలేసి, చదువుకొని లైఫ్ లో సెటిల్ అవ్వమంటుంది జరా. అలీ తాత చారుహాసన్ కూడా అదే చెబుతుంటాడు. చివరికి అలీ ఏమయ్యాడనేది క్లైమాక్స్. 3. రాజు-రవి ఇద్దరూ అనాధ పిల్లలు. డంప్ యార్డ్ లో ప్లాస్టిక్ ఏరుకొని జీవిస్తుంటారు. రోడ్డు పక్కనే ఉన్న పైప్ లైన్లో వాళ్ల ఇల్లు. ఐదేళ్ల రాజుకు ఎలాగైనా కేక్ కొనుక్కొని కట్ చేయాలని కోరిక. దాని కోసం రాజు-రవి ఇద్దరూ డబ్బులు పోగేస్తారు. ఆ డబ్బుతో వినాయకుడి మట్టి బొమ్మలు కొని అమ్మి, కేక్ కు కావాల్సిన మరింత డబ్బు సంపాదించాలనేది వాళ్ల ప్లాన్. ఫైనల్ గా వాళ్లు కేక్ కొనుక్కున్నారా లేదా అనేది స్టోరీ.

హైదరాబాద్ లో వచ్చిన వరదల కారణంగా ఈ ముగ్గురి జీవితాలు ఎలా డిస్టర్బ్ అయ్యాయి.. వాళ్ల జీవితాలు ఏ విధంగా మారాయనేది గమనం స్టోరీ. మధ్యలో నిత్యామీనన్ తో ఓ స్పెషల్ సాంగ్ కూడా పెట్టారు.

నటీనటుల పనితీరు

చెవిటి తల్లిగా శ్రియ ఇందులో పెర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉండే మంచి పాత్ర పోషించింది. భర్త వదిలేసిన భార్యగా, చెవిటితనంతో బాధపడే మహిళగా, ఓ బిడ్డకు తల్లిగా, సింగిల్ మదర్ పాత్ర పోషించిన శ్రియ.. ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. ముస్లిం కుర్రాడిగా, ఔత్సాహిక క్రికెటర్ గా శివ కందుకూరి చాలా బాగా చేశాడు. ప్రియాంక జవాల్కర్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. సహాయపాత్రల్లో చారుహాసన్, రవిప్రకాష్, సుహాస్ బాగా నటించారు. నిత్యామీనన్ ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించింది. ఈ సినిమాలో ఏ ఒక్క కథతో ఆమెకు సంబంధం లేదు.

టెక్నీషియన్స్ పనితీరు

ఇళయరాజా తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఈ సినిమాను నిలబెట్టారు. ఆయన నేపథ్య సంగీతం సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచింది. ఇక జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ మరో హైలెట్ గా నిలిచింది. ఎడిటింగ్ వీక్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇక దర్శకురాలు సుజనా రావు విషయానికొస్తే.. మొదటి సినిమాకే ఆమె మంచి ఎమోషన్స్ ఉన్న ఎలిమెంట్స్ సెలక్ట్ చేసుకున్నారు. నటీనటుల నుంచి మంచి ఔట్ పుట్ కూడా తీసుకున్నారు. ఆమె రాసుకున్న కథ బాగుంది. కానీ ఆ కథలకు కనెక్షన్ ఉంటే ఇంకా బాగుండేది. స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం సుజనారావు ఫెయిల్ అయ్యారు. స్లో నెరేషన్ ఈ సినిమాకు పెద్ద స్పీడ్ బ్రేకర్.

Shiva Kandukuri Priyanka Jawalkar Gamanam Movie జీ సినిమాలు రివ్యూ

సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకుడు ఒకటి ఊహించుకుంటాడు. ఆ ఊహలకు అందకుండా సినిమా ఉంటే బాగుంటుంది. లేదంటే, అతడి ఊహను నిజం చేస్తూ పెర్ ఫెక్ట్ డ్రామాతో సినిమా పండించినా బాగుంటుంది. కానీ ఈ రెండింటిలో ఏ ఒక్కటి జరగకపోయినా ఆడియన్ డిసప్పాయింట్ అవుతాడు. గమనం సినిమాలో ఇదే జరిగింది.

సినిమాలో 3 కథల్ని చెప్పారనే విషయం ట్రయిలర్ చూస్తేనే అర్థమైంది. సినిమా చూస్తున్నంత సేపు ఈ కథల మధ్య కనెక్షన్ ఎలా ఉంటుందా అనే ఉత్సుకత కలుగుతుంది. కానీ కథల మధ్య ఎలాంటి కనెక్షన్ ఇవ్వకుండా, పూర్తిగా ఆంథాలజీ టైపులో ఈ సినిమా తీయడంతో ప్రేక్షకుడికి నిరాశ కలుగుతుంది. ఎవరి కథ వాళ్లదే, ఎవరి బాధ వాళ్లదే. గమనం సినిమాకు అదే పెద్ద మైనస్ గా మారింది.

ఈ సినిమాకు "హైదరాబాద్ వరదలు" అనే మంచి కథావస్తువు దొరికింది. అంతకుమించి మంచి టెక్నికల్ సపోర్ట్ కూడా దొరికింది. కానీ స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా లేకపోవడం ఈ సినిమాలో ప్రధాన లోపం. ప్రారంభం నుంచే ఓ రకమైన మూడ్ తో స్టార్ట్ అవుతుంది సినిమా. ప్రేక్షకుడు ఆ మూడ్ కు అలవాటు పడతాడు కూడా. కానీ అక్కడ్నుంచి ఆ భావోద్వేగాన్ని అలానే కొనసాగించడానికి కావాల్సిన స్క్రీన్ ప్లే, బలమైన సన్నివేశాలు ఇందులో కుదరలేదు. పాత్రల పరిచయానికే చాలా టైమ్ వాడుకున్న డైరక్టర్.. ఆ తర్వాత ఆ కథల్లో కాన్ ఫ్లిక్ట్ చూపించడానికి ఇంకా టైమ్ తీసుకున్నారు. హైదరాబాద్ వరదలకు ఈ కథలన్నింటినీ ముడిపెట్టి చూపించడం ఆమె కాన్సెప్ట్. దాన్ని చివర్లో సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు.

వరదల వల్ల కొందరి కలలు చెల్లాచెదురైతే, మరికొందరు గుండె నిబ్బరంతో తేరుకుంటారు. ఈ ''చెల్లాచెదురు'' అనే కాన్సెప్ట్ ను హై ఎమోషన్స్ తో ఎలివేట్ చేసినా బాగుండేది. లేకపోతే గుండె నిబ్బరంతో బతుకు బండి లాగిస్తున్న శ్రియ పాత్రను ఇంకాస్త బలంగా చూపించినా బాగుండేది. లేకపోతే వరదల తర్వాత ఆ ఇద్దరు పిల్లల పరిస్థితేంటనేది ఇంకాస్త హార్ట్ టచింగ్ గా, ఎలాబరేట్ గా చూపించినా బాగుండేది. ఈ ప్రయత్నాలేవీ జరగపోవడం వల్ల ప్రేక్షకుడు నిరాశ చెందుతాడు.

ఆంథాలజీ కథ కావడం వల్ల ఓటీటీ ప్రేక్షకులు తప్ప, కామన్ ఆడియన్స్ ఈ సినిమాకు కనెక్ట్ కాలేరు. కానీ పెర్ఫార్మెన్సుల విషయంలో మాత్రం ఎవ్వర్నీ తక్కువ చేయడానికి వీల్లేదు, అంత బాగా చేశారు నటీనటులంతా. మరీ ముఖ్యంగా వినాయకుడి బొమ్మలు అమ్మడానికి ఇద్దరు పిల్లలు పడే పాట్లు, వాళ్ల తాపత్రయం చూస్తే గుండె బరువెక్కుతుంది. ఇక భర్త తనను వదిలేశాడని తెలుసుకున్న సందర్భంలో శ్రియ నటన కూడా కన్నీళ్లు తెప్పిస్తుంది. శ్రియ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇది. ఇక ముస్లిం కుర్రాడిగా శివ కందుకూరి, ముస్లిం అమ్మాయిగా ప్రియాంక జవాల్కర్ తమ పాత్రల మేరకు మెప్పించారు.

ఇళయరాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వింటే ఆయనను ఎందుకు సంగీత జ్ఞాని అంటారో మరోసారి అందరికీ అర్థమౌతుంది. జ్ఞానశేఖర్ విజువల్స్ చాలా బాగున్నాయి. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ లో మెరుపులు కనిపించలేదు. కథా రచయితగా, దర్శకురాలిగా సుజనా రావుకు ఫుల్ మార్కులు పడతాయి. స్క్రీన్ ప్లే రైటర్ గా మాత్రం ఆమె ఇంకా చాలా వర్క్ చేస్తే బాగుండేది. బహుశా.. ఆంథాలజీ కథలకు ఉండే పరిమితుల వల్ల ఆమె స్క్రీన్ ప్లే కూడా అలా 'లిమిట్' అయిపోయిందేమో.

ఓవరాల్ గా.. గమనం సినిమా మంచి బ్యాక్ డ్రాప్, అంతకంటే మంచి పెర్ఫార్మెన్సులతో రిచ్ గా తెరకెక్కింది. కానీ కథనంలో లోపాలు, సాగదీసినట్టుండే సన్నివేశాలు.. శుభం కార్డు వరకు సీట్లో కూర్చోనివ్వవు.

రేటింగ్ - 2.5/5