‘Dear Megha’ Movie Review

Friday,September 03,2021 - 06:41 by Z_CLU

నటీ నటులు : మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల, పవిత్ర లోకేష్ తదితరులు

సంగీతం : హరి గౌర

కెమెరా : ఐ ఆండ్రూ

నిర్మాణం : వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్

నిర్మాత : అర్జున్ దాస్యన్

రచన,దర్శకత్వం : సుశాంత్ రెడ్డి

విడుదల తేది : 3 సెప్టెంబర్ 2021

మేఘ ఆకాష్ టైటిల్ రోల్ లో నటించిన 'డియర్ మేఘ' సినిమా ఈరోజే విడుదలైంది. కన్నడ సినిమా 'దియా' కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పించి సక్సెస్ అందుకుందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

కథ :

మేఘ స్వరూప్ (మేఘ ఆకాష్) తన కాలేజీ డేస్ లో అర్జున్ ని ప్రేమిస్తుంటుంది. అనుకోకుండా అర్జున్ చదువు ఆపేసి కాలేజీ మానేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మేఘ ముంబై కి షిఫ్టవుతుంది. కొన్నేళ్ళ తర్వాత మళ్ళీ మేఘకి ఎదురవుతాడు అర్జున్. తను కూడా మేఘ ని ప్రేమిస్తున్నవిషయం చెప్తాడు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ ఓ యాక్సిడెంట్ వలన అర్జున్ చనిపోతాడు. అర్జున్ చనిపోయిన బాధ నుండి బయటికి రాలేకపోతుంది మేఘ.

 ఆ సమయం లో మేఘ కి ఆది(అదిత్) పరిచయమవుతాడు. కలిసిన కొన్ని రోజులకే ఇద్దరూ  మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఆ పరిచయం వలన మేఘతో ప్రేమలో పడతాడు ఆది. కానీ మేఘ మాత్రం అతడిని ఓ మిత్రుడిలానే చూస్తుంది.  ఫైనల్ గా మేఘ కూడా ఆది ప్రేమలో పడిన విషయం గ్రహించి అతనితో పెళ్లి పీటలు ఎక్కాలనుకుంటుంది. ఇంతలో అర్జున్ యాక్సిడెంట్ లో చనిపోలేదని, అతను బ్రతికే ఉన్నాడన్న విషయం మేఘకి తెలుస్తుంది. మరి చివరికి మేఘ ఎవరిని పెళ్లి చేసుకుంది ? పెళ్లి తర్వాత ఆమె జీవితం ఎలా మలుపు తిరిగింది ? అనేది మిగతా కథ.

 

నటీ నటుల పనితీరు :

టైటిల్ పాత్రలో మేఘ అకాష్ తన నటనతో మెప్పించింది. కొన్ని సన్నివేశాల్లో ఆమె నటనకి మంచి మార్కులు పడ్డాయి. అదిత్ పాత్రలో ఒదిగిపోయాడు. చలాకీ కుర్రాడిలా కనిపిస్తూ అలరించాడు. అర్జున్ సోమయాజులు తన పాత్రకు పర్ఫెక్ట్ అనిపించాడు. హీరో అమ్మ పాత్రలో పవిత్ర లోకేష్ మంచి నటన కనబరిచింది. మిగతా వారు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు :

ఇలాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ కి ఇంపాక్ట్ తీసుకొచ్చే మ్యూజిక్ చాలా ముఖ్యం. హరి గౌర సంగీతం సినిమాకు హైలైట్ గా నిలిచింది. సాంగ్స్ తో పాటు అతను అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి ప్లస్ అయ్యింది. సిద్ శ్రీరామ్ సాంగ్ మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చింది. ఐ ఆండ్రూ సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ప్లస్ పాయింట్. మంచి లోకేషన్స్ ఎంచుకొని సినిమాకు బెస్ట్ విజువల్స్ ఇచ్చాడు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్, పీ ఎస్.వర్మ ఆర్ట్ డైరెక్షన్ బాగుంది.

కథ -కథనం ఆకట్టుకుంది. సుశాంత్ రెడ్డి ఈ రీమేక్ సినిమాను బాగానే హ్యాండిల్ చేశాడు కానీ పూర్తి స్థాయిలో మనసుని హత్తుకునేలా తెరకెక్కించడంలో కాస్త విఫలమయ్యాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

 

జీ సినిమాలు సమీక్ష :

కొన్ని సినిమాలు ఆ బాషలోనే ఆకట్టుకుంటాయి. రీమేక్ కి వచ్చే సరికి ఎక్కువ శాతం ఆ ఇంపాక్ట్ తీసుకురావడంలో విఫలం అవుతుంటారు దర్శకులు. ఏ రీమేకయినా పాత్రలకు సూటయ్యే నటీ నటులను ఎంచుకోవడం అందులో ముఖ్యమైన ఘట్టం. ఇక సినిమాను నిలబెట్టే పాత్రలకు అయితే ఇంకాస్త ఎక్కువ జాగ్రత్త వహించాలి. ఈ సినిమాకు అదే కొంత మైనస్ అని చెప్పొచ్చు. టైటిల్ రోల్ కి మేఘ ఆకాష్ ని తీసుకోవడం రాంగ్ చాయిస్ అనే చెప్పాలి. మేఘ నటన బాగుంది కానీ బాబ్లీ క్యారెక్టర్ కి సూటయ్యే ఆ అమ్మాయి మేఘ స్వరూప్ పాత్రలో ఉన్న ఫీల్ ని ఎక్స్ ప్రెస్ చేయలేకపోయింది. ఒరిజినల్ లో తన నటనతో మెస్మరైజ్ చేసిన ఖుషీ రవి ని మ్యాచ్ చేయలేకపోయింది. అలాగే మొదటి భాగంలో వచ్చే లవ్ సీన్స్ కూడా ఆకట్టుకోలేదు. యాక్సిడెంట్ సీన్ , ఆ తర్వాత అపార్ట్ మెంట్ లో వచ్చే సీన్స్ మాత్రం పరవాలేదనిపిస్తాయి.

ఇక రెండో భాగాన్ని ఎమోషనల్ గా నడిపించే ప్రయత్నం చేసి అందులో కొంతవరకు మాత్రమే సక్సెస్ అయ్యాడు దర్శకుడు. ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ తో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. హీరో అమ్మ పాత్రకి సీనియర్ నటి ఒరిజినల్ లో చేసిన పవిత్ర లోకేష్ ని తీసుకోవడం వల్ల ఆ సన్నివేశాలు వర్కౌట్ అయ్యాయి. అలాగే హీరో ఆది క్యారెక్టరైజేషణ్ రెండో భాగాన్ని ఉన్నంతలో నిలబెట్టింది.  ఒరిజినల్ తో పోలిస్తే కొన్ని చిన్న చిన్న మార్పులు మాత్రమే చేశాడు సుశాంత్ రెడ్డి. కాకపోతే అక్కడ హీరోయిన్ అమ్మ లేకపోవడం నాన్న ఒక్కడే ఉండటాన్ని కాస్త మార్చేసి అక్కడలేని అమ్మని తీసుకొచ్చి మదర్ క్యారెక్టర్ క్రియేట్ చేశాడు. ఆ మార్పు అనవసరం అనిపిస్తుంది. అలాగే సినిమా చాలా స్లోగా సాగడం అక్కడక్కడా బోర్ కొట్టిస్తుంది.

ప్రేమించిన అబ్బాయి దూరమమై "లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ పెయిన్స్ అండ్ ప్రాబ్లమ్స్" అనుకునే అమ్మాయికి "లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సప్రయిజెస్ అండ్ మిరాకిల్స్" అనే అబ్బాయి పరిచయమైతే వారిద్దరి జర్నీ ఎలా ఉంటుందనే పాయింట్ తో ఎమోషనల్ లవ్ డ్రామా గా తెరకెక్కిన 'డియర్ మేఘ' కొంత వరకు ఆకట్టుకుంటుంది.

రేటింగ్ : 2.5 /5

  - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics