Baby Movie Review

Friday,July 14,2023 - 09:36 by Z_CLU

నటీ నటులు : ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ మరియు వైష్ణవి చైతన్య

సంగీతం: విజయ్ బుల్గానిన్

సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి

నిర్మాణం: మాస్ మూవీ మేకర్స్

సహ నిర్మాత: ధీరజ్ మొగిలినేని

నిర్మాత: SKN

రచన & దర్శకత్వం: సాయి రాజేష్

విడుదల తేది : 14 జులై 2023

నిడివి : 177 నిమిషాలు

సెన్సార్ : UA

 

సాంగ్స్ తో మంచి బజ్ తెచ్చుకున్న 'బేబీ' సినిమా , ట్రైలర్ తో మరింత హైప్ క్రియేట్ చేసింది. రిలీజ్ కి ముందే ప్రీమియర్స్ తో క్రేజ్ తెచ్చుకున్న ఈ లవ్ స్టోరీ ఎలా ఉంది ? దర్శకుడు సాయి రాజేష్ బేబీతో మెస్మరైజ్ చేశాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.

 

కథ :

ఆనంద్ (ఆనంద్ దేవరకొండ) బస్తీ కుర్రాడు. తన ఎదురింట్లో ఉండే వైష్ణవి తనను ప్రేమిస్తుందని తెలుసుకొని ఆమెను ప్రేమించడం మొదలు పెడతాడు. ఇద్దరు ఒకరికొకరు ప్రేమలో ఉన్న సందర్భంలో వైష్ణవి కాలేజీ లో చేరుతుంది. పదవ తరగతి ఫెయిల్ అవ్వడంతో ఆనంద్ ఆటో డ్రైవర్ గా మారతాడు. కాలేజీ లో చేరిన కొద్ది రోజులకే వైష్ణవి కి విరాజ్ తో (విరాజ్ అశ్విన్) తో పరిచయం ఏర్పడుతుంది. వైష్ణవి ఆల్రెడీ ప్రేమలో ఉందని తెలియని విరాజ్ ఆమె ముందు తన ప్రేమ ప్రపోజల్ పెడతాడు. మరి ఆనంద్ తో ప్రేమలో ఉన్న వైష్ణవి విరాజ్ ప్రేమను ఒప్పుకుందా ? ప్రేమిస్తున్న వైష్ణవినే ప్రాణంగా భావించే ఆనంద్ ఈ విషయం తెలుసుకొని ఏం చేశాడు ? వైష్ణవి చేసిన ఒక తప్పు ఆమె జీవితాన్ని ఎలా నాశనం చేసింది ? అనేది మిగతా కథ.

 

నటీ నటుల పనితీరు :

ఆటో డ్రైవర్ ఆనంద్ గా ఆనంద్ దేవరకొండ ఒదిగిపోయాడు. ఇప్పటికే కొన్ని పాత్రలతో హీరోగా మెప్పించిన ఆనంద్ తన కెరీర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కొన్ని సన్నివేశాల్లో నటుడిగా మంచి మార్క్స్ స్కోర్ చేశాడు. వైష్ణవి నటన సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచింది. ఆమెకి మరిన్ని మంచి అవకాశాలు వస్తాయి. విరాజ్ అశ్విన్ తన క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. కొన్ని సన్నివేశాల్లో గ్రే షేడ్స్ నటన తో ఆకట్టుకున్నాడు. వైష్ణవి తండ్రి పాత్రలో నాగబాబు పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. సీత, వైవా హర్ష  మిగతా నటీ నటులు తమ పాత్రలతో ఆకట్టుకున్నారు.

 

సాంకేతిక వర్గం పనితీరు :

రిలీజ్ కి ముందు తన మ్యూజిక్ తో సినిమాకు మంచి బజ్ తెచ్చిన విజయ్ బుల్గానిన్ సినిమాకు సోల్ మ్యూజిక్ అందించాడు. ముఖ్యంగా ఓ రెండు ప్రేమ మేఘాలు సాంగ్ హైలైట్ గా నిలిచింది. నేపథ్య సంగీతం సినిమాకు బిగ్ ప్లస్ పాయింట్. బాల్ రెడ్డి కెమెరా వర్క్ సినిమాకు మరో హైలైట్. తన విజువల్స్ తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. విప్లవ్ ఎడిటింగ్ పరవాలేదు. ఇంకాస్త లెంత్ తగ్గిస్తే బాగుండేది.

సాయి రాజేష్ కథ , కథనం ఆకట్టుకున్నాయి. కొన్ని సన్నివేశాలను దర్శకుడిగా తీసిన విధానం బాగుంది. ప్రొడక్షన్ వేల్యూస్ కథకి తగ్గట్టుగా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

ఒక బోల్డ్ లవ్ స్టోరీను అంతే బోల్డ్ గా తీయడం కష్టమైన పని. హనేస్టీగా ఒక ప్రేమ కథ చెప్పాలని, దాని ద్వారా ఎమోషనల్ డ్రామా చూపించి ఆడియన్స్ ను మెప్పించాలని బేబీ కథ రాసుకున్న సాయి రాజేష్ అంతే నిజాయితిగా కథను చెప్పాడు. కామెడీ కి మంచి స్కోప్ ఉన్నా ఎక్కడా డైవర్ట్ అవ్వకుండా తను చెప్పాలనుకున్న కథను హనేస్టీ గా తెరకెక్కించాడు. దర్శకుడిగా నిర్మాతగా సెటైరిక్ కామెడీ ,స్పూఫ్ కామెడీ సినిమాలు తీసిన సాయి రాజేష్ తనలో కూడా విషయం ఉందని ఈ సినిమాతో నిరూపించుకున్నాడు. దర్శకుడిగా చాలా చోట్ల మంచి స్కోర్ చేశాడు. కొన్ని సన్నివేశాలను సాయి రాజేష్ తీసిన విధానం ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ , ప్రీ క్లైమాక్ సీన్ హైలైట్ గా నిలిచాయి. వాటిలో సాయి రాజేష్ రైటింగ్ టాలెంట్ కనిపించింది.

బేబీ కోసం సాయి రాజేష్ కొత్త కథ తీసుకోలేదు. ఇప్పటికే కొన్ని లవ్ స్టోరీస్ లో చూసిందే మళ్ళీ చూసిన ఫీలింగ్ కలిగించాడు. దీంతో సినిమా చూస్తున్నంత సేపు మన్మథ ,ప్రేమిస్తే , ఆర్ ఎక్స్ 100 సినిమాలు గుర్తొస్తాయి. కానీ ఇందులో బోల్డ్ గా ఒక పాయింట్ టచ్ చేసి తన స్టైల్ లో ఫ్రెష్ గా చూపించే ప్రయత్నం చేసి అందులో ఎక్కువ శాతం సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా సినిమాకు మెయిన్ యాక్టర్స్ నుండి అలాగే టెక్నిషియన్స్ నుండి బెస్ట్ అవుట్ పుట్ అందింది. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ సినిమా చూస్తున్నంత సేపు ఒక మూడ్ లోకి తీసుకెళ్తుంది. సినిమా పూర్తయ్యాక విజయ్ మ్యూజిక్ గురించి ఎవరైనా మాట్లాడుకోవాల్సిందే. బాల్ రెడ్డి కెమెరా వర్క్ కూడా సినిమాకు ప్లస్ అయింది. నిడివి కాస్త ఎక్కువ ఉండటం వల్ల ఎడిటర్ తన కత్తెర కి ఇంకాస్త పదును పెట్టాల్సింది అనిపించక మానదు. మొదటి భాగం కాస్త స్లో గా నడుస్తూ ఇంటర్వెల్ వరకూ రన్ టైం గుర్తుచేస్తుంది. ఎడిటింగ్ లో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ట్రిమ్ చేస్తే బాగుండేది. అలాగే కేరెక్టర్స్ వాటి బిహివియర్ కాస్త మైనస్ అనిపించినా దర్శకుడి పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూస్తే ఆకట్టుకుంటాయి.

ఒక అమ్మాయి ప్రేమ వాళ్ళ మోసపోయాననుకునే ఆటో డ్రైవర్ అబ్బాయి ఆవేదన , ఆ అమ్మాయి తప్పు చేయాల్సిన పరిస్థితులను బాగా చూపించాడు సాయి రాజేష్. మొదటి భాగంలో కథ లేకపోయినా స్కూల్ లవ్ స్టోరీతో వచ్చే సీన్స్ , అక్కడక్కడా లైట్ కామెడీ తో బాగానే నడిపించాడు. ఇంటర్వెల్ బ్లాక్ నుండి అసలు కథలోకి తీసుకెళ్ళి అక్కడి నుండి ఎమోషనల్ డ్రామాతో మెప్పించాడు దర్శకుడు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ బాగా డిజైన్ చేసుకున్నాడు. ఇలాంటి కథలు రాసుకునే టప్పుడు యూత్ ని దృష్టిలో పెట్టుకొని సీన్స్ రాసుకోవాలి. బేబీలో యూత్ కనెక్ట్ అయ్యే సీన్స్ చాలా ఉన్నాయి. అవన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. ప్రీ క్లైమాక్స్ తో దర్శకుడు ఏది నిజమైన ప్రేమ అంటూ చెప్తూ వచ్చే ఎమోషనల్ సీన్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. కాకపోతే ఈ కథకి ఎలాంటి క్లైమాక్స్ రాసుకోవాలి అనే తర్జన భర్జనలో ప్రీ క్లైమాక్స్ నుండి కాస్త డ్రాగ్ చేస్తూ ముందుకు నడిపించాడు దర్శకుడు. ముఖ్యంగా ఏ కేరెక్టర్ ను చంపకుండా సాడ్ ఎండింగ్ లేకుండా ప్లాన్ చేసుకోవడంతో క్లైమాక్స్ లో కొన్ని కంప్లింట్స్ కనిపిస్తాయి. ఓవరాల్ గా బేబీ బోల్డ్ పాయింట్ తో న్యూ ఈజ్ ఎమోషనల్ డ్రామాగా ఆకట్టుకుంది.

రేటింగ్ : 3/5