Movie Review – Arjuna Phalguna

Friday,December 31,2021 - 02:11 by Z_CLU

నటీనటులు : శ్రీవిష్ణు, అమృతా అయ్యర్, నరేష్, శివాజీ రాజా, సుబ్బరాజు, దేవీప్రసాద్, రంగస్థలం మహేష్ తదితరులు నిర్మాతలు : నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : తేజ మర్ని డైలాగ్స్ : సుధీర్ వర్మ. పి సినిమాటోగ్రపీ : జగదీష్ చీకటి ఆర్ట్ డైరెక్టర్ : గంధి నడికుడికర్ మ్యూజిక్ డైరెక్టర్ : ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్ రన్ టైమ్ : 2 గంటల 9 నిమిషాలు సెన్సార్ : U/A రిలీజ్ డేట్ : డిసెంబర్ 31, 2021

ఈ ఏడాది రాజరాజ చోరతో హిట్ కొట్టాడు శ్రీవిష్ణు. దీంతో అతడి నెక్ట్స్ మూవీ అర్జున ఫల్గుణపై అంచనాలు పెరిగాయి. ఈ రోజు రిలీజైన ఈ సినిమాతో శ్రీవిష్ణు అంచనాల్ని అందుకున్నాడా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ

arjuna phalguna sree vishnu

కథ తూ.గో జిల్లా ములకల్లంకలో జరిగిన కథ ఇది. అర్జున్ (శ్రీవిష్ణు), అతడి ఫ్రెండ్స్ (రంగస్థలం మహేష్, చైతన్య, రాజ్ కుమార్ చౌదరి) చిన్నప్పట్నుంచి ఫ్రెండ్స్. ఈ గ్యాంగ్ లోకి శ్రావణి (అమృతా అయ్యర్) కూడా చిన్నప్పుడే చేరుతుంది. అంతా కలిసిమెలిసి పెరుగుతారు. శ్రావణికి, అర్జున్ అంటే ఇష్టం. ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఊరిలో కరణం (సీనియర్ నరేష్), బ్యాంక్ అధికారులతో కుమ్మక్కవుతాడు. పైకి రైతులకు లోన్లు ఇప్పించినట్టు నటించి, ఆస్తులు రాయించుకుంటాడు. రంగస్థలం మహేష్ ఆస్తి కూడా అలానే జప్తుకు వస్తుంది. ఆస్తిని కాపాడుకునేందుకు, అంతా కలిసి సోడా కొట్టు వ్యాపారం చేసేందుకు డబ్బు సంపాదించాలనుకుంటారు. కానీ అది వర్కవుట్ కాదు.

చిన్ననాటి స్నేహితుడు చెప్పిన మాట విని, అరకు నుంచి గంజాయి స్మగ్లింగ్ చేయాలనుకుంటారు. ములకల్లంక నుంచి అరకు వెళ్తారు. గంజాయితో వస్తుంటే సీఐ (సుబ్బరాజు) పట్టుకుంటాడు. అక్కడ్నుంచి రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంది అర్జున్ గ్యాంగ్. ఈ మొత్తం ఎపిసోడ్ నుంచి తనను, తన ఫ్రెండ్స్ ను, తన ఊరి వాళ్లను అర్జున్ ఎలా కాపాడుకున్నాడనేది ఈ సినిమా కథ.

నటీనటుల పనితీరు నటుడిగా శ్రీవిష్ణు తననుతాను ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నాడు. అర్జున ఫల్గుణ సినిమాలో కూడా అదే పనిచేశాడు. తూర్పుగోదావరిలోని ఓ మారుమూల గ్రామంలో ఉండే కుర్రాడు ఎలా ప్రవర్తిస్తాడో అచ్చంగా అలానే కనిపించాడు. అతడి నటన ఈ సినిమాకు హైలెట్. హీరోయిన్ అమృతా అయ్యర్ కూడా ఓకే అనిపించుకుంది. హీరో గ్యాంగ్ లో చేసిన రంగస్థలం మహేష్, చౌదరి, చైతన్య ఓకే. సుబ్బరాజు తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. నరేష్, శివాజీరాజా తమ పాత్రల మేరకు మెప్పించారు.

టెక్నీషియన్స్ పనితీరు టెక్నికల్ గా సినిమాలో చెప్పుకోదగ్గ అంశం సినిమాటోగ్రఫీ మాత్రమే. జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక ప్రియదర్శన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. పాటలతో మాత్రం ఇతడు ఆకట్టుకోలేకపోయాడు. సుధీర్ వర్మ డైలాగ్స్ బాగున్నాయి. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరక్షన్ విభాగాల్ని చూసుకున్న తేజ మర్ని.. ఈ 3 సెగ్మెంట్స్ లో పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. మరీ ముఖ్యంగా స్టోరీ-స్క్రీన్ ప్లే విషయంలో అతడు ఇంకాస్త ఎక్కువ ఫోకస్ పెట్టి ఉండాల్సింది. నెరేషన్ విషయంలో అతడు చాలా చోట్ల తడబడ్డాడు.

Sree Vishnu Arjuna Phalguna (1)

జీ సినిమాలు సమీక్ష పద్మవ్యూహంలో ఇరుక్కుపోవడానికి నేను అభిమన్యుడ్ని కాదంటూ టీజర్ నుంచే చెబుతూ వస్తున్నాడు శ్రీవిష్ణు. ఆ విషయాన్ని అతడు చెప్పనక్కర్లేదు. సినిమా స్టార్ట్ అయిన అర్థగంటకే మనకు కూడా అర్థమైపోతుంది. క్లైమాక్స్ కు వచ్చిన తర్వాత పూర్తిగా అర్థమైపోతుంది. లాజిక్స్ కు అందకుండా జిమ్మిక్స్ చేస్తూ, తనకు ఎదురైన ఎన్నో కష్టాల్ని హీరో అవలీలగా అధిగమిస్తుంటే.. శ్రీవిష్ణులో ఓ సగటు టాలీవుడ్ హీరోను కనులారా చూసుకోవచ్చు. కానీ ఇలాంటి కథను శ్రీవిష్ణు ఎంచుకోవడం కరెక్ట్ కాదు. రాజరాజ చోర లాంటి మంచి కంటెంట్ ను సెలక్ట్ చేసుకున్న శ్రీవిష్ణు, అర్జున-ఫల్గుణ లాంటి అరకొర కంటెంట్ ను కూడా సెలక్ట్ చేసుకున్నాడంటే ఆశ్చర్యం కలుగుతుంది.

సినిమాకు మంచి బ్యాక్ డ్రాప్ సెట్ చేసి పెట్టాడు దర్శకుడు తేజ మర్ని. గోదారి తీరంలో ఉండే యాస, భాష, కట్టు, పడికట్టు అన్నీ దించేశాడు. కానీ వీటిపై పెట్టిన శ్రద్ధ.. సినిమా నెరేషన్ పై పెట్టి ఉంటే బాగుండేది. అత్యంత క్లిష్టమైన సమస్య నుంచి హీరో తన తెలివితేటలతో ఎలా బయటపడ్డాడనే విషయాన్ని దర్శకుడు చెప్పాలనుకున్నాడు. కానీ సినిమా అంతా పూర్తయిన తర్వాత, హీరోను తెలివైనోడు అనే కంటే, అదృష్టవంతుడు అంటే బాగుంటుంది. సన్నివేశాలన్నీ అంత కన్వీనియంట్ గా రాసుకున్నారు.

సినిమాకు ట్విస్టులు పెట్టడం ఎంత కష్టమో, ప్రేక్షకుల్ని మెప్పించేలా ఆ ట్విస్టుల్ని విప్పడం కూడా అంతే ముఖ్యం. మొదటి భాగంలో సక్సెస్ అయిన దర్శకుడు రెండో భాగంగా ఫెయిల్ అయ్యాడు. సీరియస్ గా కథను నడిపించి, క్లైమాక్స్ కు వచ్చేసరికి కామెడీ ట్రాక్ లోకి ఎందుకు తీసుకెళ్లాలనుకున్నాడో దర్శకుడికే తెలియాలి. మరీ ముఖ్యంగా సుబ్బరాజు పాత్రను అమాంతం పైకి తీసుకెళ్లి, అక్కడ్నుంచి అగాధంలోకి తోసెయ్యడం కూడా బాగాలేదు. ఇలా చెప్పుకుంటూపోతే సన్నివేశాల్లో, క్యారెక్టరైజేషన్స్ లో చాలా లొసుగులు కనిపిస్తాయి. ట

ఇవన్నీ ఒకెత్తయితే శ్రీవిష్ణు-అమృతాఅయ్యర్ లవ్ ట్రాక్ మరో ఎత్తు. వాళ్లను ఫ్రెండ్స్ గా చూపించాలా, లవర్స్ గా చూపించాలా అనే విషయంపై దర్శకుడికే క్లారిటీ లేనట్టుంది. ఎక్కడా ప్రేమించుకున్నట్టు కనిపించరు. ఆ ఎఫెక్షన్ చూపించరు. ఒక్కటంటే ఒక్క సీన్ లో కూడా లవ్ ఎమోషన్ కనిపించలేదు. క్యారెక్టర్ల పరిచయానికే చాలా టైమ్ తీసుకున్న దర్శకుడు.. ఫస్టాఫ్ మొత్తాన్ని అటుఇటు తిప్పాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ కు వచ్చేవరకు 'ఇదీ కథ' అనే విషయం ప్రేక్షకుడికి అర్థంకాదు. సెకండాఫ్ లో ఉన్నంతలో మంచి ట్విస్టులు పెట్టిన దర్శకుడు, అక్కడ కూడా తడబడ్డాడు. కామెడీ పండకపోవడం, లూజ్ నెరేషన్ వల్ల కథలో ప్రేక్షకుడు లీనం కాలేకపోయాడు.

ఇన్ని మైనస్ పాయింట్స్ మధ్య చెప్పుకోదగ్గ అంశం ఏదైనా ఉందంటే అది శ్రీవిష్ణు పెర్ఫార్మెన్స్. ఈ కథను పిచ్చిగా నమ్మాడు శ్రీవిష్ణు. తన నటనతో సినిమాను చాలా దూరం మోశాడు. కానీ ఒక దశలో ఈ సినిమా హీరో భుజాలపై కూడా నిలబడలేకపోయింది. మంచి పెర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ అమృతా అయ్యర్, ఇకపై ఇలాంటి పాత్రలు చేయకుండా ఉంటే మంచిది. హీరో గ్యాంగ్ లో ఉన్నోళ్లలో రంగస్థలం మహేష్ కాస్త ఎలివేట్ అయ్యాడు. చైతన్య, రాజ్ కుమార్ చౌదరి ఓకే. ప్రియదర్శన్ పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ బాగుంది. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆశించిన స్థాయిలో లేవు. సినిమాటోగ్రఫీ బాగుంది.

ఓవరాల్ గా వీక్ నెరేషన్ వల్ల అర్జున-ఫల్గుణ సినిమా ఆశించినంత వినోదాన్ని అందించదు. పాటలు పండని, కామెడీ పేలని ఈ సినిమాను శ్రీవిష్ణు నటన కోసం మాత్రం చూడొచ్చు.

రేటింగ్ : 2/5