Movie Review – Ardha Shathabdham

Saturday,June 12,2021 - 02:54 by Z_CLU

ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడుతూ వచ్చిన 'అర్థ శతాబ్దం' సినిమా ఎట్టకేలకు OTT ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. కార్తీక్ రత్నం హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో సాయి కుమార్ , నవీన్ చంద్ర , శుభలేఖ సుధాకర్ , ఆమని తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్ కి ముందే టీజర్ , ట్రైలర్ ఎట్రాక్ట్ చేసింది. దీంతో సినిమాపై ఓ మోస్తరు అంచనాలు నెలకొన్నాయి. మరి రిలీజ్ కి ముందు కంటెంట్ ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా OTT ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది.

తెలంగాణా నేపథ్యంలో ఓ కథ రాసుకొని అందులో కొన్ని క్యారెక్టర్స్ క్రియేట్ చేసి నేచురాలిటీ కి దగ్గర ఈ సినిమా తెరకెక్కించిన దర్శకుడు ఆసక్తి కరమైన కథనం, బలమైన సన్నివేశాలు రాసుకోవడంలో విఫలమయ్యాడు. నిజానికి ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో కొనసాగుతున్న కుల వివక్ష మీద కథను రాసుకున్న దర్శకుడి ఆలోచన మంచిదే. కానీ పేపర్ పై తను రాసుకున్న ఆ కథను ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో ఫెయిల్ అయ్యాడు రవీంద్ర. ఇలాంటి కథలో కేవలం ఎమోషన్ ఒక్కటే నింపితే వర్కౌట్ అవ్వదు. ఇంకా కొన్ని ఎలిమెంట్స్ చేర్చి చక్కని డ్రామా పండించాలి. అప్పుడే ఇలాంటి కథలు క్లిక్ అవుతాయ్. ఆ విషయంలో దర్శకుడు ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. అలాంటి జాగ్రత్తలు తీసుకొని ఆసక్తికరంగా కథనం రాసుకోకపోవడంతో సినిమా ల్యాగ్ అనిపిస్తూ అక్కడక్కడా బోర్ కొట్టిస్తుంది. OTT లో ఆడియన్ కి ఉన్న స్కిప్ ఆప్షన్ వాడకుండా సినిమాను తీయలేకపోయాడు దర్శకుడు.

Ardha shathabdham movie review in telugu by zeecinemalu 2

ఇక నటీనటుల విషయానికొస్తే కేరాఫ్ కంచర పాలెం తో నటుడిగా మంచి గుర్తింపుతో పాటు వరుస అవకాశాలు అందుకుంటున్న కార్తీక్.... కృష్ణ పాత్రలో మంచి నటన కనబరిచాడు. కొన్ని ప్రేమ సన్నివేశాల్లో కార్తీక్ నటించిన తీరు ఆకట్టుకుంటుంది. సరైన కథ పడితే హీరోగా మంచి స్థాయికి చేరుకుంటాడు. ఇక పుష్ప పాత్రలో కృష్ణ ప్రియ కూడా చక్కని నటన ప్రదర్శించింది. పల్లెటూరి అమ్మాయిగా పాత్రలో ఒదిగిపోయింది. లుక్ నవీన్ చంద్ర ఎప్పటిలానే తన పాత్రతో ఆకట్టుకొని మరోసారి తనకిచ్చిన క్యారెక్టర్ కి న్యాయం చేశాడు. కాకపోతే క్యారెక్టర్ డిజైనింగ్ తేడా కొట్టింది. సాయి కుమార్ , శుభలేక సుధాకర్ , ఆమని వంటి సీనియర్లు తలో పాత్ర వేసి ఉన్నంతలో సన్నివేశాలకు అందం తీసుకొచ్చారు. సాయి కుమార్ పాత్రపై స్పష్టత వచ్చేలా సన్నివేశాలు పడలేదు.

ఇక టెక్నికల్ గా చూసుకుంటే సినిమాకు మ్యూజిక్ అందించిన నఫ్వాల్ రాజా తన టాలెంట్ తో సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యాడు. ముఖ్యంగా అతను అందించిన నేపథ్య సంగీతం బాగుంది. మెరిసేలే పాట ఆకట్టుకుంది. మిగతా పాటలు మాత్రం జస్ట్ ఫరవాలేదనిపిస్తాయి. అశ్కేర్, వెంకట్ , వేణు సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరి లోకేషన్స్ ని బాగా చూపిస్తూ కథకు సరైన విజువల్స్ అందించారు. విలేజ్ సెటప్ చేసిన సునీత్ ఆర్ట్ డైరెక్టర్ పనితనం బాగుంది. ఇక దర్శకుడు రవీంద్ర ఎంచుకున్న కథ బాగుంది కానీ కథనం సినిమాకు మెయిన్ మైనస్. నిర్మాణ విలువలు బాగున్నాయి.

రేటింగ్ : 2.25/5

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics