Allari Naresh’s ‘Itlu Maredumilli Prajaneekam’ Review

Friday,November 25,2022 - 01:41 by Z_CLU

నటీ నటులు : అల్లరి నరేష్, ఆనంది, శ్రీ తేజ్, వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్, షానీ తదితరులు

కెమెరా మెన్ : రాంరెడ్డి

సంగీతం : శ్రీచరణ్ పాకాల

డైలాగ్స్: అబ్బూరి రవి

నిర్మాణం: జీ స్టూడియోస్, హాస్య మూవీస్

నిర్మాత: రాజేష్ దండా

రచన- దర్శకత్వం: ఎఆర్ మోహన్

నిడివి : 131 నిమిషాలు

సెన్సార్ : U/A

విడుదల తేది : 25 నవంబర్ 2022

 

అల్లరి నరేష్ హీరోగా విభిన్న కథాంశంతో తెరకెక్కిన 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. జీ స్టూడియోస్ , హాస్య మూవీస్ నిర్మించిన ఈ సినిమాకు AR మోహన్ దర్శకత్వం వహించారు. టీజర్, ట్రైలర్ తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమాతో అల్లరి నరేష్ మెప్పించాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.

 

కథ :

మారేడుమిల్లిలో ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గుతూ రావడంతో  తెలుగు టీచర్ శ్రీనివాస్ శ్రీపాద (అల్లరి నరేష్) ఎలక్షన్ ఆఫీసర్ గా అక్కడి ప్రజలను ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేందుకు వెళ్తాడు. అలా అటవీ ప్రాంతంలో అడుగుపెట్టిన శ్రీనివాస్ కి లక్ష్మి ( ఆనంది) సహాయం చేస్తుంటుంది. ఆమె మంచితనం తనలాగే ఇతరుల గురించి ఆలోచించే మనస్తత్వం చూసి ప్రేమలో పడతాడు శ్రీనివాస్.

ఒక వైపు మారేడుమిల్లి ప్రజలు తాము ఓటు వేయమని ఖరాఖండిగా చెప్పేస్తారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఓటు వేసేదే లేదని నిశ్చయించుకుంటారు.  వారిని శ్రీనివాస్ ఎలా ఒప్పించి ఓట్లు వేయించాడు ? వారి సమస్యల పరిష్కారం కోసం ఏం చేశాడనేది మిగతా కథ.

 

నటీ నటుల పనితీరు :

హీరో అల్లరి నరేష్ ఎప్పటిలానే కేరెక్టర్ కి బెస్ట్ ఇచ్చాడు. తన నేచురల్ పెర్ఫార్మెన్స్ తో సినిమాకు మెయిన్ హైలైట్ అనిపించుకున్నాడు. ఆనంది తన పాత్రతో ఆకట్టుకుంది. లక్ష్మి పాత్రలో ఒదిగిపోయి నటించింది. కలెక్టర్ గా సంపత్ రాజ్ పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. వెన్నెల కిషోర్ డైలాగ్ కామెడీతో ఎంటర్టైన్ చేశాడు. రెండో భాగంలో ఎంటరైనప్పటికీ రఘుబాబు తన కామెడీతో హిలేరియస్ గా ఎంటర్టైన్ చేశాడు. పెద్దాగా కుమనన్ , కండగా శ్రీ తేజ్ వారి నటనతో మెప్పించారు. అడవిలో గూడెం చేరుకునే సన్నివేశంలో ప్రవీణ్ , జెమినీ సురేష్ తమ నటనతో నవ్వించారు.

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు సంబంధించి టెక్నీషియన్స్ వర్క్ లో ముందుగా మాట్లాడుకోవాల్సింది శ్రీ చరణ్ మ్యూజిక్ గురించి. తన స్కోర్ సినిమాకు బిగ్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. సన్నివేశాలను ఎలివేట్ చేస్తూ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. రాంరెడ్డి కెమెరా వర్క్ బాగుంది. సినిమా నేచురల్ గా కనిపించడంలో అతని పాత్ర కీలకంగా ఉంది. బ్రహ్మ కడలి ఆర్ట్ వర్క్ బాగుంది.సినిమా కోసం వేసిన సెట్స్ నేచురల్ గా ఉన్నాయి. కొన్ని సినిమాలకు పదునైన మాటలు అవసరం. ఉత్తేజ పరిచేలా మాటలు రాస్తూ ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించడం కష్టమే. తన ఎక్స్ పీరియన్స్ తో రైటర్ అబ్బూరి రవి తన పదునైన మాటలతో సినిమాకు వన్నె తీసుకొచ్చాడు. పృథ్వీ స్టంట్స్ పరవాలేదు. ఎడిటర్ చోటా కే ప్రసాద్ ఎక్కడా బోర్ కొట్టకుండా పర్ఫెక్ట్ రన్ టైంకి ఎడిట్ చేయడం సినిమాకు మరో కలిసొచ్చిన అంశం.

ఏ.ఆర్.మోహన్ ఎంచుకున్న కథ, రాసుకున్న కథనం ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సినిమాను నేచురల్ గా తెరకెక్కించి దర్శకుడిగా మంచి మార్కులు అందుకున్నాడు దర్శకుడు మోహన్. జీ స్టూడియోస్ , హాస్య మూవీస్ ప్రొడక్షన్ వేల్యూస్ కథకు తగ్గట్టుగా ఉన్నాయి.

జీ సినిమాలు రివ్యూ :

'నాంది' తర్వాత అల్లరి నరేష్ కథల ఎంపికలో మార్పు వచ్చింది.  నరేష్ తనలో మరో కోణాన్ని ఆవిష్కరించుకుంటూ ఉత్తమ కథలు ఎంచుకున్నాడు. 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఓటు వేసేందుకు ఇష్టపడని అటవీ ప్రాంత జనాలు , ఎన్నికల అధికారి అక్కడికి వెళ్లి వారి సమస్య తీరే వరకూ వారికి అండగా నిలబడటం అనే పాయింట్ బాగుంది. ఈ పాయింట్ కి తగ్గట్టే స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకుంది. దర్శకుడు మోహన్ తన రైటింగ్ తో పాటు డైరెక్షన్ తో కూడా మెప్పించాడు. ముఖ్యంగా సినిమాను చాలా నేచురల్ రియాల్టీకి దగ్గరగా తెరకెక్కించి ఓ మంచి ఫీల్ కలిగించాడు.

ఫస్ట్ పదినిమిషాలు నరేష్ కేరెక్టరైజేషణ్ అతని స్వభావం చూపిస్తూ కేరెక్టర్ ఎష్టాబిలిష్ చేసిన దర్శకుడు తర్వాత అటవీ ప్రాంతంలో ప్రజల జీవన విధానం , వారి స్వభావం, నమ్మకాలను చూపిస్తూ సినిమాను ముందుకు నడిపించాడు. సినిమా బోర్ కొట్టకుండా కావలసినంత కామెడీ వడ్డించాడు. వెన్నెల కిషోర్ , రఘు బాబు , ప్రవీణ్ లను పర్ఫెక్ట్ గా వాడుకుంటూ మంచి కామెడీ క్రియేట్ చేసి ఎంటర్టైన్ చేశాడు. ముఖ్యంగా వెన్నెల కిషోర్ డైలాగ్ కామెడీ అలాగే సెకండాఫ్ రఘుబాబు కామెడీ బాగా పేలింది. రఘుబాబు కామెడీ ఎపిసోడ్ కి థియేటర్స్ నవ్వులతో ఎంజాయ్ చేయడం గ్యారెంటీ. వీరభద్ర స్వామి యాక్షన్ ఎపిసోడ్ తో డిజైన్ చేసిన ప్రీ క్లైమాక్స్ బ్లాక్ సినిమాలో మరో హైలైట్ అనిపించుకుంది. చివర్లో మంచి సందేశం ఇచ్చి ఎండ్ కార్డ్ వేశాడు దర్శకుడు.

అటవీ ప్రాంతంలో జరిగే ఎన్నికలు , ఓట్ల లెక్కింపు ప్రధాన కథాంశం అయినప్పటికీ మంచి వినోదంతో అలరించాడు దర్శకుడు. కేరెక్టర్స్ డిజైనింగ్ బాగా కుదరడంతో అన్ని పాత్రలు గుర్తుండేలా ఉన్నాయి. కానీ నెరేషన్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉంటే బాగుండేది.

 అల్లరి నరేష్ నటన , ఆనంది కేరెక్టర్, వెన్నెల కిషోర్ -రఘుబాబు కామెడీ, శ్రీ చరణ్ బ్యాక్ మ్యూజిక్ , అబ్బూరి రవి మాటలు , ఇంటర్వెల్ ట్విస్ట్ , కథలో ఉన్న సందేశం, క్లైమాక్స్ సినిమాకు హైలైట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ఆకట్టుకుంటుంది.

 

రేటింగ్ : 2.75 / 5