Akkineni Akhil’s ‘Agent’ Movie Review

Friday,April 28,2023 - 01:27 by Z_CLU

నటీ నటులు : అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య, మమ్ముట్టి, డినో మోరియా,  మురళి శర్మ , పోసానీ , అజయ్ తదితరులు

సంగీతం: హిప్ హాప్ తమిళ

కెమెరా  : రసూల్ ఎల్లోర్

ఎడిటింగ్ : నవీన్ నూలి

కథ: వక్కంతం వంశీ

నిర్మాణం: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా

సహ నిర్మాతలు: అజయ్ సుంకర,  దీపా రెడ్డి

నిర్మాత: రామబ్రహ్మం సుంకర

స్క్రీన్ ప్లే -దర్శకత్వం : సురేందర్ రెడ్డి

విడుదల తేదీ : 28 ఏప్రిల్ 2023

 

'ఏజెంట్' అంటూ స్పై యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు అక్కినేని అఖిల్. కొన్నేళ్లుగా సాలిడ్ హిట్ కోసం చూస్తున్న అఖిల్ కి ఈ సినిమా ఆ లోటు తీరుస్తుందని ఫ్యాన్స్ భావించారు. మరి అఖిల్ ఏజెంట్ గా మెప్పించి సరైన హిట్ అందుకున్నాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.

akhil agent movie zeecinemalu 2

కథ : 

చిన్నతనం నుండే రా ఏజెంట్ అవ్వాలనే డ్రీమ్ పెట్టుకున్న రామకృష్ణ అలియాస్ రిక్కీ(అఖిల్) పలు సార్లు ప్రయత్నాలు చేసి విఫలం అవుతాడు. ఏజెంట్ మహాదేవ్ (మమ్ముట్టి) ను ఆదర్శంగా తీసుకొని అతనితో కలిసి వర్క్ చేయాలని చూసే రిక్కీకి అనుకోకుండా తను ప్రేమించిన అమ్మాయి విధ్య (సాక్షి వైద్య) ద్వారా ఆ అవకాశం వస్తుంది. అలా ఏజెంట్ మహదేవ్ సపోర్ట్ తో సీక్రెట్ రా ఏజెంట్ గా మారిన రిక్కీ ఓ మిషన్ మీద వర్క్ మొదలు పెడతాడు.

ఎట్టిపరిస్థితుల్లో తను అనుకున్న మిషన్ కంప్లీట్ చేసి తీరాలని ఆ   ప్రయత్నాల్లో ఉంటాడు మాజీ ఏజెంట్ గాడ్(డినో). ఇంతకీ ఆ మిషన్ ఏంటి ? మహదేవ్ రిక్కీ ని ఎందుకు తన సీక్రెట్ మిషన్ లో ఇన్వాల్వ్ చేశాడు ? ఫైనల్ గా రిక్కీ ఆ మిషన్ ను ఆపగలిగాడా ? అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు : 

ఇప్పటి వరకు లవర్ బాయ్ కేరెక్టర్స్ లో కనిపించిన అఖిల్ ఏజెంట్ గా సరికొత్త ట్రాన్స్ఫర్మేషన్ చూపించి మెప్పించాడు. రిక్కీ గా పాత్రకు న్యాయం చేశాడు. కాకపోతే కేరెక్టర్ డిజైనింగ్ లో ఫాల్ట్ ఉంది.  సాక్షి వైద్య ను లవ్ ట్రాక్ , సాంగ్స్ కోసమే తీసుకున్నారు తప్ప ఆమెకి సినిమాలో సరైన ఇంపార్టెన్స్ దొరకలేదు. ఒక్కో సీన్ లో మాత్రమే ఆమె పాత్రకు స్టోరీతో కనెక్షన్ ఉంటుంది. మమ్ముట్టి నటన గురించి కొత్తగా చెప్పేదేముంటుంది ఏజెంట్ మహదేవ్ డెవిల్ గా మెస్మరైజ్ చేశాడు. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆ పాత్రకు అందం తెచ్చారు. డినో తన విలనిజంతో ఆకట్టుకోలేదు , ఆ పాత్రకు పర్ఫెక్ట్ అనిపించనూ లేదు. మురళి శర్మ , పోసానీ కృష్ణ మురళికి గతంలో చేసిన పాత్రలే దక్కడంతో అదే పెర్ఫార్మెన్స్ రిపీట్ చేసి కొన్ని సన్నివేశాలకే పరిమితం అయ్యారు. మిగతా నటీ నటులు పరవాలేదనిపించుకున్నారు.

 

సాంకేతిక వర్గం పనితీరు : 

స్పై యాక్షన్ మూవీస్ కి టెక్నికల్ గా బిగ్ సపోర్ట్ అందాలి లేదంటే సాదా సీదా గా అనిపిస్తుంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అల్టిమేట్ అనిపించాలి. ఏజెంట్ కి టెక్నీషియన్స్ నుండి బెస్ట్ అందలేదు. హిప్ హాప్ తమిళ స్కోర్ అక్కడక్కడా మాత్రమే ఆకట్టుకుంది. ఇక పాటల సంగతి సరే సరి. ఒక్క పాట కూడా టికెట్టు కొన్ని ప్రేక్షకుడిని ఇంప్రెస్ చేయలేకపోయింది. మ్యూజిక్ పరంగా ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది.

రసూల్ ఎల్లోర్ కెమెరా పనితనం అక్కడక్కడా మెప్పించింది. కొన్ని షాట్స్ బాగున్నాయి. ఎడిటింగ్ లో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. ఫస్ట్ హాఫ్ అయ్యే సరికే ఫుల్ సినిమా చూసినట్టు అనిపించడం ఖాయం.  ఆర్ట్ వర్క్ మిగతా విభాగాలు పరవాలేదు.

వక్కంతం కథ , సురేందర్ రెడ్డి స్క్రీన్ ప్లే వీక్ గా ఉన్నాయి. భార్గవ్  కార్తీక్ డైలాగ్స్ పెద్దగా పెలలేదు.  ఏకే ఎంటర్టైన్ మెంట్స్ ప్రొడక్షన్ వెల్యూస్  కథకు తగట్టుగా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష : 

స్పై యాక్షన్ జోనర్ ఎంచుకున్నప్పుడు ఏ దర్శకుడైనా చాలా కసరత్తు చేసుకోవాలి. స్టోరీ ఎలా ఉన్నా రేసీ స్క్రీన్ ప్లే , అదిరిపోయే ట్విస్టులతో సన్నివేశాలు ప్లాన్ చేసుకోవాలి. పేలవమైన కథ అదే తీరులో కథనం ఉంటే తేడా కొట్టడం ఖాయం. ఏజెంట్ విషయంలో అదే జరిగింది. విషయం లేని కథ , ఆకట్టుకోలేని కథనం సినిమాకు మేజర్ మైనస్ అనిపిస్తాయి. సురేందర్ రెడ్డి సినిమాళ్లో హీరోలు హైపర్ యాక్టివ్ గా కనిపిస్తారు. ఆ కేరెక్టర్స్ తో హీరోలు కొంత కామెడీ కూడా పండిస్తారు. అతనొక్కడే, కిక్ , అశోక్ , రేసు గుర్రం ఇలా ఏ సినిమా చూసినా అందులో హీరో స్పెషల్ గా కనిపించి హైలైట్ అవుతాడు. అయితే ఏజెంట్ లో అదే తేడా కొట్టింది. స్పై మూవీలో అఖిల్ సురేందర్ రెడ్డి గత చిత్రాల్లో హీరో  లాగా బిహేవ్ చేయడమే ఇక్కడ పెద్ద సమస్య గా కనిపించింది. అందుకే టీజర్ లో అఖిల్ ను చూసి కొంత నెగటివ్ వచ్చేసింది.

స్పై మూవీస్ లో రా ఏజెంట్ గా కనిపించే హీరో ఎత్తుకి పై ఎత్తు వేస్తూ కాస్త సీరియస్ ఉంటూ శత్రువులపై ఎటాక్స్  చేస్తుండాలి. కానీ ఏజెంట్ లో అఖిల్ పాత్ర అలా లేదు. దానికి విభిన్నంగా ఉంది. ఒక సీన్ లో నువ్వు అసలు ఏజెంట్ లా కనిపించవు అందుకే ఈ మిషన్ కి నిన్ను ఎంచుకున్నాను అని మమ్ముట్టి పాత్రతో ఓ డైలాగ్ చెప్పించారు. నిజమే కథ ప్రకారం హీరో అలాగే బిహేవ్ చేయాలి అనుకోవచ్చు కానీ అతడు ఏజెంట్ అవ్వాలనే ధ్యేయం పెట్టుకున్నప్పుడు అంతో ఇంతో సీరియస్ గా ఉండాలి కదా. అల్లరి కుర్రాడిలా బిహేవ్ చేస్తే ఎలా ? అదే అఖిల్ పాత్రలో పెద్ద మైనస్ అనిపిస్తుంది.

సురేందర్ రెడ్డి ఈ స్పై మూవీ కోసం వక్కంతం చెప్పిన పేలవమైన కథ ఎంచుకోవడమే రాంగ్ ఛాయిస్. కనీసం స్క్రీన్ ప్లే  అయినా అదిరిపోయేలా ఉండుంటే బాగుండేది. సినిమా ఆరంభం నుండి చివరి వరకు టికెట్టు కొన్న ప్రేక్షకుడికి ఎక్కడా కిక్ ఇవ్వదు, ఎలాంటి ఆసక్తి రేకెత్తించదు. ఈ జానర్ లో సినిమా చేసి మెప్పించడం పెద్ద టాస్క్. అడివి శేష్ ఈ జోనర్ లో 'గూడచారి' తీసి మెస్మరైజ్ చేశాడు. రీసెంట్ గా షారూఖ్ ఖాన్ 'పఠాన్' తో కలెక్షన్ల దుమ్ము దులిపేశాడు. ఆ రెండు సినిమాలు చూసిన ప్రేక్షకుల కళ్ళకి ఈ ఏజెంట్ కిక్ ఇవ్వదు.

స్పై మూవీస్ లో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉండాలి.  హీరో ఏం చేస్తాడు ? ఎలా మిషన్ ను ఆపుతాడు ? అనే ఇంట్రెస్ట్ అడియన్ కి కలగాలి. ఏజెంట్ లో అదే మిస్ అయ్యింది. దీంతో అఖిల్ ఏజెంట్ గా మెప్పించలేకపోయాడు. ఇంటర్వల్ యాక్షన్ ఎపిసోడ్ బాగుంది కానీ పూర్తయ్యాక ఇంత విద్వంశం అవసరమా ? అనే ఫీలింగ్ ప్రేక్షకుడికి కలుగుతుంది. హమ్మయ్య క్లైమాక్స్ వచ్చేసింది అనుకునే లోపు ఇంకా సినిమా ముందుకు సాగుతూ మరో ఐదు నిమిషాలు నడుస్తూ ఇబ్బంది పెట్టింది. ఫైనల్ గా  ఏజెంట్ మిషన్ మిస్ ఫైర్ అయ్యింది.

రేటింగ్ : 2 /5