Movie Review – Akhanda

Thursday,December 02,2021 - 02:44 by Z_CLU

నటీనటులు: బాలకృష్ణ, ప్ర‌గ్యా జైస్వాల్‌,పూర్ణ, జ‌గ‌ప‌తిబాబు, శ్రీకాంత్‌, నితిన్ మెహతా , శ్రవణ్, కాలకేయ ప్రభాకర్, అవినాష్ తదితరులు

సినిమాటోగ్రఫీ : సి. రాంప్రసాద్‌

సంగీతం : త‌మన్‌ ఎస్‌‌‌

మాటలు : ఎం.రత్నం

ఎడిటింగ్‌ : కోటగిరి వేంకటేశ్వరరావు, తమ్మిరాజు

స‌మ‌ర్ప‌ణ‌ : మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి

నిర్మాత : మిర్యాల రవీందర్‌రెడ్డి

రచన -దర్శకత్వం : బోయపాటి శ్రీను

నిడివి : 167 నిమిషాలు

విడుదల : 2 డిసెంబర్ 2021

బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఇప్పటికే రెండు సినిమాలొచ్చాయి. ఆ రెండూ ఎంతటి విజయం సాధించాయో తెలిసిందే. ఈ కాంబోలో మరో సినిమా అనగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి హై ఎక్స్ పెక్టేషన్స్ తో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన 'అఖండ' ఆ అంచనాలను అందుకుందా? బాలయ్య అఖండగా శివ తాండవం చేసి భారీ విజయం అందుకున్నాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ

balakrishna akhanda movie review in telugu కథ :

అనంతపురంలో ఊరి పెద్దకి ఇద్దరు కొడుకులు పుడతారు. అందులో ఒకడు మురళి కృష్ణ(బాలకృష్ణ) గా ఊరికి పెద్దగా ఉంటారు. మరొకడు శివుడి ఆజ్ఞతో శివభక్తుడిగా అఘోర అవుతాడు. దొంగతనంగా శక్తి పీఠాధిపతిగా మారిన రౌడీ గజేంద్ర.. తన అనుచరుడు వరదరాజు(శ్రీకాంత్)తో కలిసి అనంతపురంలో మైనింగ్ నడిపిస్తూ దాని ద్వారా జనాల్ని బలి తీసుకుంటాడు.

విషయం తెలుసుకున్న మురళి కృష్ణ, వరదరాజు కి ఎదురెళ్ళి మైనింగ్ ఆపేయాలని వార్నింగ్ ఇస్తాడు. ఊరి జనాన్ని తన భయంతో లొంగదీసుకొని మైనింగ్ పనులు చేయించుకునే వరదరాజు తనపై ఎదురుతిరిగిన మురళి కృష్ణపై పగ పెంచుకొని అతని హాస్పిటల్ పేల్చేసి ఆ కేసులో మురళి కృష్ణ ని ఇరికిస్తాడు. అలా హాస్పిటల్ పేలుడు కేసులో అరెస్ట్ అయిన మురళి కృష్ణపై ఒకవైపు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటుంది.

ఇక ఊరి జనాలని చంపుతూ మురళికృష్ణ కుటుంబాన్ని అవస్థలు పెడుతూ అతడి కూతురుని చంపాలని చూస్తుంటారు వరదరాజు మనుషులు. ఆ సమయంలో సీన్ లోకి ఎంటరైన అఖండ.. పాప ప్రాణాలను ఎలా కాపాడాడు? శక్తిపీఠాదిపతిని చంపి అతని స్థానంలో కూర్చొని వరదరాజుతో దుర్మర్గాలు చేయిస్తున్న గజేంద్ర(నితిన్ మెహతా)ని తన శివ శక్తులతో శివుడి రూపంలో ఎలా అంతం చేశాడనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

బాలకృష్ణ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో పవర్ ఫుల్ పాత్రలు పోషించిన బాలయ్య మరోసారి తన నట విశ్వరూపం చూపించాడు. ఇటు మాస్ ని ఆకట్టుకునే పంచెకట్టులో మురళి కృష్ణగా అటు రోమాలు నిక్కపోడిచే నటనతో అఖండగా అద్భుత నటన కనబరిచాడు. ఓవరాల్ గా డబుల్ రోల్స్ చేసి తన నటనతో సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాడు బాలయ్య. హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ ఆకట్టుకుంది. తన పరిధిలో నటించి మెప్పించింది. సపోర్టింగ్ రోల్ పద్మావతి పాత్రలో పూర్ణ బాగా నటించింది. విలనీగా నితిన్ మెహతా, శ్రీకాంత్ లు పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా తన గెటప్ మార్చేసి విలనీగా మెప్పించాడు శ్రీకాంత్. జగపతి బాబు, అవినాష్, నాగ మహేష్, కాలకేయ ప్రభాకర్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు :

కొన్ని సన్నివేశాలకు ఆ ఇంపాక్ట్ తీసుకొచ్చే నేపథ్య సంగీతం చాలా ముఖ్యం. ఈ సినిమాకు సరిగ్గా అలాంటి ఎఫర్ట్ పెట్టి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు తమన్. ముఖ్యంగా అఖండ తాలూకు ఎలివేషన్ సన్నివేశాలకు తమన్ ఇచ్చిన స్కోర్ మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చాయి. యాక్షన్ ఎపిసోడ్స్ ని కూడా తన స్కోర్ తో హైలైట్ చేశాడు. అఖండ టైటిల్ సాంగ్ ఆకట్టుకుంది కానీ ఫస్ట్ హాఫ్ లో వచ్చే రెండు పాటలు మాత్రం ఓ మోస్తరుగా అనిపించాయి. రామ్ ప్రసాద్ అందించిన విజువల్స్ బాగున్నాయి. కొన్ని సన్నివేశాల్లో అతని కెమెరా ప్రతిభ కనిపించింది. కోటగిరి వెంకటేశ్వరావు, తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. కాకపోతే కొన్ని బోర్ కొట్టే సన్నివేశాలు ట్రిమ్ చేసి ఉంటే బెటర్ గా ఉండేది.

ఎ.ఎస్‌.ప్రకాష్‌ ఆర్ట్‌ వర్క్ బాగుంది. స్ట‌న్ శివ, రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌ మాస్టర్స్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ఆడియన్స్ తో విజిల్స్ వేయించేలా ఉన్నాయి. ఎం.రత్నం అందించిన పవర్ ఫుల్ డైలాగ్స్ క్లాప్స్ కొట్టించాయి. బోయపాటి శ్రీను రాసుకున్న కథ, ఎలివేషన్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ద్వారకా క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ గ్రాండ్ గా ఉన్నాయి.

balakrishna akhanda movie review in telugu జీ సినిమాలు సమీక్ష :

విడివిడిగా ఇద్దరికీ రీసెంట్ గా ఫ్లాప్స్ ఉన్నా.... ఇద్దరు కలిసి చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళు రాబట్టడంతో బాలయ్య-బోయపాటి కాంబోలో మూడో సినిమాగా వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే వీరిద్దరూ కలిసి చేసిన గత సినిమాలతో పోల్చుకుంటే ఈసారి డ్రామా తగ్గిందనే చెప్పాలి. అలాగే సెంటిమెంట్ కూడా లైట్ వెయిట్ గానే ఉంది. అలాగే కథనం కూడా గతంలో చూసేసిన మాస్ యాక్షన్ సినిమాల తరహాలోనే రొటీన్ గానే అనిపించింది. కానీ బోయపాటి డిజైన్ చేసిన అఖండ పాత్ర, యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం వీరి కాంబోలో వచ్చిన సినిమాలను అధిగమించినట్టు అనిపిస్తాయి.

చలనం లేకుండా పుట్టిన శిశువు శివుడి ఆజ్ఞతో ఎలా కళ్ళు తెరిచాడు? అతనికి శివ శక్తి ఎందుకు వచ్చింది ? ఎందుకు అఘోరాగా మారాడు? ఇదంతా సినిమా ఆరంభంలోనే సీన్ బై సీన్ చెప్పేసుకుంటూ వెళ్ళిన దర్శకుడు ఓ పది నిముషాల పాటు ఆడియన్స్ ని మౌనంగా ఉంచాడు. ఆ తర్వాత వచ్చే యాక్షన్ ఎపిసోడ్ తో సినిమా గ్రాఫ్ పెంచాడు. అనంతరం లవ్ ట్రాక్ కాస్త ఇబ్బందిగా ఉంటూ రొటీన్ అనిపించినా తర్వాత వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ తో మెస్మరైజ్ చేశాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్ మాస్ ఆడియన్స్ కి ఓ రేంజ్ లో కిక్ ఇచ్చి హైలైట్ గా నిలిచింది. ప్రీ ఇంటర్వెల్ కి అఖండగా అఘోర పాత్రని కథలోకి తీసుకొచ్చి ఆ ఎపిసోడ్ తో మాస్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించాడు బోయపాటి.

ఇక రెండో భాగాన్ని కూడా ఎలివేషన్స్ తో భారీ యాక్షన్ తో నింపేసి అదే ఫార్మేట్ లో సినిమాను నడిపించాడు. ఈ మాస్ మసాలాతో పాటు డ్రామా కూడా యాడ్ చేసుకొని ఉంటే బెటర్ గా ఉండేది. బోయపాటి-బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన 'సింహా', 'లెజెండ్' సినిమాల్లో మాస్ మసాలా అంశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ డ్రామా వాటిని డామినేట్ చేసేలా ఉంటుంది. ఈసారి అఖండలో అలాంటి డ్రామా లేకపోవడం మైనస్. అలాగే తల్లి-కొడుకు మధ్య వచ్చే సెంటిమెంట్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. క్లైమాక్స్ కి ముందు అలాగే క్లైమాక్ లో పాపతో సెంటిమెంట్ ట్రై చేసినప్పటికీ అది కూడా ఫోర్స్ గా పెట్టినట్టే అనిపిస్తుంది తప్ప కన్నీళ్ళు తెప్పించలేకపోయింది. ఓవరాల్ గా ఈసారి ఎమోషన్ తో కాకుండా ఓన్లీ ఎలివేషన్స్ మీదే డిపెండ్ అయి సినిమా తీశాడు బోయపాటి. అది క్లియర్ కట్ గా తెలుస్తుంది. అలాగే క్లైమాక్స్ లో విలన్స్ గన్నులు పట్టుకొని కాల్చడం, వాళ్ళ డ్రెస్సింగ్ చూస్తే 'వినయ విధేయ రామ' ఛాయలు కనిపించాయి. ఊరి చివర పెద్ద గుడి, అందులో హీరో తన కుటుంబంతో పూజ చేయడం, మధ్యలో కదలకుకుండా రౌడీలు ఎటాక్ చేస్తున్నా ఏమి చేయలేక హీరో మౌనం పాటించడం, పూజ అనంతరం మందలు మందలుగా వచ్చిన రౌడీల భరతం పడటం మళ్ళీ ఈసారి కూడా అదే క్లైమాక్స్ చూపించాడు బోయపాటి.

ఇవన్నీ పక్కన పెడితే బాలయ్య హై వోల్టేజ్ పెర్ఫార్మెన్స్ , అఖండ క్యారెక్టర్ డిజైనింగ్, బోయపాటి మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్, ఎలివేషన్ వచ్చే సన్నివేశాలతో పాటు రోమాలు నిక్కపొడిచేలా చేసిన తమన్ నేపథ్య సంగీతం సినిమాకు మేజర్ హైలైట్స్ గా నిలిచాయి.

ఫైనల్ గా బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో ప్రేక్షకులు ఆశించే అన్ని మాస్ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. కాకపోతే రొటీన్ స్క్రీన్ ప్లే, డ్రామా లేకపోవడం పెద్ద మైనస్. బాలయ్య అభిమానులకు, మాస్ ఆడియన్స్ కి మాత్రం పండగే.

రేటింగ్ : 2.75/5