‘101 Jillala Andagadu’ Movie Review

Friday,September 03,2021 - 03:55 by Z_CLU

న‌టీన‌టులు : అవ‌స‌రాల శ్రీనివాస్‌ , రుహానీ శ‌ర్మ, రోహిణీ, రమణ భాస్కర్ త‌దిత‌రులు

సినిమాటోగ్ర‌ఫీ : రామ్‌

సంగీతం : శ‌క్తికాంత్ కార్తీక్‌

స‌మ‌ర్ప‌ణ‌ : దిల్‌రాజు, జాగ‌ర్ల‌మూడి క్రిష్‌

నిర్మాత‌లు : శిరీష్‌, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి

రచన : అవ‌స‌రాల శ్రీనివాస్‌

ద‌ర్శ‌క‌త్వం : రాచ‌కొండ విద్యాసాగ‌ర్‌

విడుదల : 3 సెప్టెంబర్ 2021

 

అవసరాల శ్రీనివాస్ హీరోగా దిల్ రాజు, క్రిష్ సమర్పణలో తెరకెక్కిన 'నూటొక్క జిల్లాల అందగాడు' ఈరోజే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి బట్టతల కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ని మెప్పించిందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

101 jillala andagadu avasarala ruhani 2 కథ :

భూమి ఇన్ఫ్రా అనే కన్స్ట్రక్షన్ కంపెనీలో వర్క్ చేసే GSN గుత్తి సూర్య నారాయణ (అవసరాల శ్రీనివాస్) తనకున్న బట్టతలను కవర్ చేసుకుంటూ విగ్గు పెట్టుకొని జుట్టు మెండుగా ఉన్న వ్యక్తిలా జీవిస్తుంటాడు. తన బట్టతల విషయం తెలిసి ఎవరూ తనని ప్రేమించరని, పెళ్లి చేసుకోరని అనుకుంటాడు. అదే టైంలో తను పనిచేసే కంపెనీలో జాయిన్ అయిన అంజలి(రుహాని శర్మ)ని ఇష్టపడతాడు.

కొన్ని రోజుల్లోనే వారిద్దరి ఫ్రెండ్ షిప్ ప్రేమగా మారుతుంది. కానీ ఓ సందర్భంలో GSNకు జుట్టు లేదని తెలిసి అతనికి దూరంగా ఉంటుంది అంజలి. తనకి జుట్టు లేకపోవడం వలన ప్రేమించిన అమ్మాయి కూడా దూరమైందని భావించి తనని ఫేస్ చేయలేకపోతాడు GSN. ఇంతకీ అంజలి GSN ని అర్థం చేసుకొని మళ్ళీ మునుపటిలానే ఇష్టపడిందా..? లేదా ? అనేది మిగతా కథ.

 

నటీ నటుల పనితీరు :

ఎప్పటిలానే తన క్యారెక్టర్ కి బెస్ట్ ఇచ్చాడు అవసరాల శ్రీనివాస్. పాత్రకు తగినట్టుగా కనిపించాడు. రుహాని శర్మ అంజలి పాత్రకు పూర్తి న్యాయం చేసింది. హీరో తల్లి పాత్రలో రోహిణి మంచి నటన కనబరిచింది. ఎమోషనల్ సీన్స్ లో ఎప్పటిలానే నటిగా మంచి మార్కులు అందుకుంది. సత్తిపండు పాత్రలో రమణ భాస్కర్ అలాగే మిగతా నటీ నటులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.

 

సాంకేతిక వర్గం పనితీరు :

శక్తి కాంత్ అందించిన మ్యూజిక్ సినిమాకు ప్లస్ పాయింట్. పాటలతో పాటు కొన్ని సందర్భాల్లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సినిమాటోగ్రాఫర్ రామ్‌ కెమెరా వర్క్ బాగుంది. కిర‌ణ్ గంటి పర్ఫెక్ట్ రన్ టైంతో సినిమాను కట్ చేశాడు. అవసరాల శ్రీనివాస్ కథ బాగున్నా కథనం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. దర్శకుడిగా రాచ‌కొండ విద్యాసాగ‌ర్‌ పరవాలేదనిపించుకున్నాడు కానీ బెస్ట్ డెబ్యూ అనిపించుకోలేకపోయాడు.ప్రొడక్షన్ వాల్యూస్ కథకి తగ్గట్టుగా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

బట్టతల కాన్సెప్ట్ తో హిందీ లో కొన్ని సినిమాలు వచ్చాయి. వాటిలో బట్టతలతో నానా ఇబ్బందులు పడుతూ లోలోపల ఎంతో బాధ పడే వ్యక్తి జీవితాన్ని చూపించారు. సరిగ్గా అదే పాయింట్ ని ఎంచుకొని తెలుగులో మొదటి ప్రయత్నంగా ఈ సినిమా చేశాడు అవసరాల శ్రీనివాస్. కాకపోతే ఈ కథతో హిలేరియస్ కామెడీ , కనెక్ట్ అయ్యే ఎమోషన్ తో పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు. దాంతో సినిమా యావరేజ్ స్టేజి దగ్గరే ఆగిపోయింది.

ఆ రెండిటి మీద ఇంకా శ్రద్ధ పెట్టి వర్క్ చేసి ఉంటే బెటర్ అవుట్ పుట్ వచ్చేది. ఉన్నంతలో రెండు మూడు కామెడీ ఎపిసోడ్స్ ప్లాన్ చేసుకున్నారు. కానీ వాటి నుండి హిలేరియస్ ఫన్ వర్కౌట్ అవ్వలేదు. అక్కడక్కడా కొన్ని నవ్వులు మాత్రమే ప్రేక్షకుడికి అందుతాయి తప్ప పూర్తి స్థాయిలో కడుపుబ్బా నవ్వించలేకపోయింది. ఇక సెకండాఫ్ ను ఎమోషనల్ గా డ్రైవ్ చేయించి మధ్యలో కాస్త నవ్వించే ప్రయత్నం చేశారు. బట్టతలతో ఒక వ్యక్తిపడే ఇబ్బందులను అలాగే లోలోపల పడే బాధని సరిగ్గా ప్రాజెక్ట్ చేయలేకపోయాడు దర్శకుడు.

సినిమా ఆరంభంలోనే హీరోకి బట్టతల ఉండటం, దాన్ని ఎవరికీ తెలియకుండా విగ్గుతో కవర్ చేస్తూ ఉండటం కాకుండా జుట్టు ఊడిపోయే దశ నుండి అతని బాధను తెలియజేస్తూ అందులో నుండి హాస్యం పుట్టించి ఉంటే బాగుండేది. ముఖ్యంగా అన్నీ ట్రై చేసి అలసిపోయి చివరాఖరికి విగ్గుతో మేనేజ్ చేయడం ఒక్కటే సొల్యుషన్ అని చూపిస్తే ఆడియన్స్ ఇంకా కనెక్ట్ అయ్యేవారు. దర్శకుడు రాచకొండ విద్యా సాగర్ అలా కాకుండా ముందు నుండే హీరో విగ్గుతో మేనేజ్ చేయడం చూపిస్తూ మధ్యలో జుట్టు రావడానికి ఓ హెయిర్ కేర్ కి వెళ్లినట్టు చూపించడం వర్కౌట్ అవ్వలేదు.

కొన్ని కథలు, పాత్రల నుండి మంచి హాస్యం పుట్టించి చివర్లో ఏడిపించచ్చు. అలాంటి కథతో మంచి క్యారెక్టర్ తో ఆ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోవడంలో రైటర్ , డైరెక్టర్ ఇద్దరూ విఫలం అయ్యారు. కాకపోతే కొన్ని సన్నివేశాలు , ఎమోషన్ తో కొంత వరకూ మెప్పించారు. హోటల్ రూమ్ నుండి విగ్గుతో బయటికి వచ్చి ఎవరికీ దొరక్కుండా తప్పించుకునే కామెడీ సన్నివేశాల్లో అవసరాల మంచి కామెడీ పండించాడు. ఆ ఎపిసోడ్స్ బాగానే వర్కౌట్ అయింది. అలాగే హీరోయిన్ ముందు టోపీ పెట్టుకొని దాన్ని ఎగిపోకుండా చూసుకునే సన్నివేశం కూడా నవ్వు తెప్పించింది. అలాగే సెకండాఫ్ లో అమ్మతో వచ్చే ఎమోషనల్ ఎపిసోడ్ కూడా బాగానే ఉంది. కానీ హీరో ఇబ్బందులను అతను అనుభవించే బాధని అంత ఎఫెక్టివ్ గా చూపించలేకపోయాడు దర్శకుడు. దాంతో హీరో పడే బాధ ఎక్కువగా రిజిస్టర్ అవ్వలేదు. దాంతో క్లైమాక్స్ కి ముందు సన్నివేశాలకు ఆడియన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే అవకాశం లేకపోయింది. ఓవరాల్ గా నూటొక్క జిల్లాల అందగాడు కాసిన్ని నవ్వులతో కొంత ఎమోషన్ తో పరవాలేదనిపిస్తుంది.

రేటింగ్ : 2.5/5

  - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics